అరుణాచల్ ప్రదేశ్‌లో క్రైస్తవుల నిరసనలను అడ్డుకోవాలి! కేంద్రానికి ABVKA లేఖ
అరుణాచల్ ప్రదేశ్ హైకోర్టు బలవంతపు మతమార్పిడులను నిరోధించే చట్టం అమలును ఆదేశించింది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా క్రైస్తవులు నిరసనలు చేస్తున్నారు. ఏబీవీకేఏ ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. 1978 చట్టం అమలు లేకపోవడం వల్ల క్రైస్తవుల సంఖ్య పెరిగిందని, స్థానిక గిరిజన సంస్కృతికి ముప్పు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది.

బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు చట్టం అమలు చేయాలని కొన్ని నెలల క్రితం గౌహతి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ చట్టం అమలు దిశగా అడుగులు వేస్తుండటంతో ఆ రాష్ట్రంలోని క్రైస్తవులు హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే ఈ నిరసనలను అడ్డుకోవాలంటూ ఏబీవీకేఏ(అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం) జాతీయ అధ్యక్షుడు సతేంద్ర సింగ్ కేంద్ర హోం మంత్రికి ఒక లేఖ రాశారు. అందులో ఇలా పేర్కొన్నారు. “అరుణాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా క్రైస్తవులు నిరసన, ప్రదర్శనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది చాలా దురదృష్టకరం. 1978లో అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టాన్ని ఆమెదించారు. ఆ సమయంలో పీకే తుంగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
స్థానిక స్థానిక తెగల మతం, సంస్కృతిని రక్షించడానికి, ప్రలోభాలు, ఒత్తిడి లేదా మోసం ద్వారా ఒక మతం నుండి మరొక మతానికి మతమార్పిడులను నిరోధించడానికి, ప్రభుత్వ రికార్డులలో అటువంటి మార్పిడులను నమోదు చేయడానికి ఈ చట్టం రూపొందించబడింది. గతంలో మధ్యప్రదేశ్, ఒడిశాలలో తరువాత దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలలో ఇలాంటి చట్టాలు చేశారు. ఈ చట్టాలన్నీ రాజ్యాంగబద్ధంగా సరైనవిగా దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కానీ దురదృష్టవశాత్తు అరుణాచల్ ప్రదేశ్‌లో దాని అమలు చేయలేదు. 70లలో అరుణాచల్ ప్రదేశ్ జనాభాలో 1 శాతం కూడా లేని క్రైస్తవులు, 2011 జనాభా లెక్కల ప్రకారం 31 శాతానికి పెరిగారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సరైన చట్టం అమలు కాలేదని చెప్పడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. కానీ సెప్టెంబర్ 30, 2024న, గౌహతి హైకోర్టు ఇటానగర్ శాశ్వత బెంచ్ ఒక ప్రజా ప్రయోజన పిటిషన్‌పై పలు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఉత్తర్వు జారీ అయిన 6 నెలల్లోపు ఈ చట్టాన్ని అమలు చేయడానికి నియమాలను తెలియజేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన చట్టపరమైన బాధ్యతను నెరవేర్చాలి. స్థానిక గిరిజన సమాజం గత 25 ఏళ్లుగా నియమాలను రూపొందించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా అరుణాచల్ ప్రభుత్వం, హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ క్రైస్తవ సంస్థలు, క్రైస్తవులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాన్ని, దానిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించడం అనేది తీవ్రంగా ఖండిచాల్సిన విషయం. గత యాభై ఏళ్లలో మత మార్పిడి కారణంగా సనాతన గిరిజన సమాజంలోని దాదాపు సగం జనాభా మారిపోయారు.
దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 15 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో, ఎటువంటి ఆటంకాలు లేకుండా మత మార్పిడులు చేస్తున్నవారు ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని డోన్యి-పోలో, రంగ్‌ఫ్రా, అమితమ్‌టై, రింగ్యాజోమాలో భక్తులు, బౌద్ధమతాన్ని అనుసరించే గిరిజన సమాజం వీరి చర్యలను గమనిస్తున్నాయి. అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, దేశంలోని మొత్తం గిరిజన సమాజం తరపున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఉంచుతున్నాను. బలవంతపు మతమార్పిడుల చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ప్రారంభించాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. వనవాసి కళ్యాణ్ ఆశ్రమం కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా హోం మంత్రిని వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించాలని కోరుతున్నారు” అని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.