ఈజీ మనీ.. జల్సాలు.. స్మగ్లర్ అవతారమెత్తిన మాజీ సైనికుడు.. వెలుగులోకి సంచలన విషయాలు..

మాజీ సైనికుడు కాస్త డ్రగ్ డీలర్ అవతారమెత్తాడు. డ్రగ్స్ సరఫరా చేస్తూ లక్షలు సంపాదించాడు. ఈ దందా కోసమే తన సైనిక ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. ఇందులో తన ఫ్రెండ్స్‌ను సైతం భాగం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈజీ మనీ.. జల్సాలు.. స్మగ్లర్ అవతారమెత్తిన మాజీ సైనికుడు.. వెలుగులోకి సంచలన విషయాలు..
Ex Army Jawan

Edited By: Krishna S

Updated on: Jul 10, 2025 | 1:32 PM

క్రమశిక్షణ, దేశభక్తికి మారుపేరుగా నిలవాల్సిన ఆర్మీ జవాన్ పక్కదారి పట్టాడు. ఈజీ మనీ, జల్సాల కోసం డ్రగ్స్ స్మగ్లర్‌గా అవతారమెత్తాడు. సైన్యంలో జవాన్‌గా పనిచేసిన వ్యక్తి.. తన ఫ్రెండ్స్‌తో కలిసి 18 కిలోల ఓపియం(నల్లమందు) స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ జవాన్.. తన సైనిక ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ డ్రగ్ స్మగ్లింగ్ దందాలోకి దిగగా.. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. అసలేం జరిగిందంటే.. గోధురామ్.. భారత సైన్యంలో జవాన్‌గా పనిచేసేవాడు. 2024 ఫిబ్రవరిలో సెలవుల సమయంలో రాజస్థాన్‌లోని సంచోర్‌లో భగీరత్ అనే స్మగ్లర్‌ను కలిశాడు. భగీరత్ ఆడంబరమైన జీవనశైలి, విలాసాలు గోధురామ్‌‌ను ఆకర్షించాయి. ఈ క్రమంలో స్మగ్లర్ గోధుకు.. ప్రతి ట్రిప్‌కు రూ.3 లక్షల ఆఫర్ ఇచ్చాడు. దీంతో అతడు సైనిక ఉద్యోగాన్ని వదిలేసి మరీ.. మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి జోధ్‌పూర్ వరకు నల్లమందు స్మగ్లింగ్ ప్రారంభించాడు. భగీరత్ అరెస్ట్ అయిన తర్వాత గోధు సర్వణ్ బిష్ణోయ్ అనే మరో స్మగ్లర్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను ప్రతి ట్రిప్‌కు రూ. 3 లక్షలతో పాటు ట్రావెల్ ఖర్చులను కూడా అందించేవాడు.

ఫ్రెండ్స్‌తో కలిసి..

గోధు తన స్నేహితులు పీరా రామ్, దేవిని కూడా ఈ దందాలో భాగస్వాములుగా మార్చేశాడు. వారికి ప్రతి ట్రిప్‌కు రూ.50వేలు ఆశ చూపించాడు. ఈ ముగ్గురు మే 2025లో మణిపూర్‌లోని సేనాపతి నుంచి 18 కిలోల నల్లమందు (ఓపియం) తీసుకొని ఢిల్లీ వైపు బయలుదేరారు.  రూ.23లక్షల విలువ గల ఈ ఒప్పందం ప్రకారం గోధు అందులో నుంచి 8 కిలోల నల్లమందును ఢిల్లీలో.. మిగతా 10 కిలోల నల్లమందును జోధ్‌పూర్‌లో సర్వణ్ బిష్ణోయ్‌కు అందజేయాల్సి ఉంది. కానీ ఢిల్లీ పోలీసులు వలపన్ని పట్టుకోవడంతో వారి గుట్టు మొత్తం రట్టయింది. గోధు కారును తనిఖీ చేయగా, డ్రైవర్, డ్రైవర్ పక్క సీటు కింద ఫుట్ మ్యాట్‌లో దాచిన 18 ప్యాకెట్లు లభించాయి. దీంతో మాదకద్రవ్యాల నిరోధక చట్టం (NDPS) సెక్షన్ 18/29 కింద FIR నమోదు చేశారు.

ఈ కేసులో పెద్ద తలకాయలను పట్టుకునేందుకు పోలసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ముగ్గురినీ తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్ పూర్తి వివరాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. గోధు సైతం పోలీసులకు సహకరిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో డ్రగ్స్ అందించిన రమేష్ మైతీ, రాజస్థాన్‌లో సర్వణ్ బిష్ణోయ్‌లను పట్టుకోవడంలో సహాయం చేస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ ఇద్దరూ డ్రగ్స్ రాకెట్‌లో కీలక సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్.. యువతను నాశనం చేయడమే కాకుండా, ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం నిధుల సమీకరణకు కూడా ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. డబ్బు ఆశ.. ఒక సైనికుడిని నేరమార్గం పట్టించడమే కాదు.. మనిషిని ఎంతగా దిగజార్చుతుందో ఈ ఘటన నిరూపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..