
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పార్లమెంట్ నూతన భవనంలో సెప్టెంబరు 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటాపోటీగా జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 781 మంది సభ్యులకుగాను 767 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు మాత్రం ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా బరిలోకి ఎన్డీయే తరఫున సీపీ రాధా కృష్ణన్, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో నిలిచారు.
అయితే ఉపరాష్ట్రపతిగా గెలుపొందడానికి కావాల్సిన ఓట్లు 377. ఇందులో ఎన్డీయే అభ్యర్ధి రాధాకృష్ణన్‌కు అత్యధికంగా 452 ఓట్లు, సుదర్శన్‌రెడ్డికి కేవలం 300 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 14 మంది ఎంపీలు ఓటు వేయలేదు. ఇక పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. మొత్తం 152 ఓట్ల మెజార్టీతో సీపీ రాధాకృష్ణన్ విజేతగా నిలిచారు. నిజానికి.. అనుకున్నదానికంటే ఎన్డీయే అభ్యర్థికి భారీగానే ఓట్లు పెరిగాయి. దీంతో భారత 15వ ఉప రాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.సి.మోదీ ప్రకటించారు. తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతి పీఠం అధిష్ఠించిన మూడో వ్యక్తి రాధాకృష్ణన్ కావడం గమనార్హం.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, బ్రేకింక్ వార్తా కథనాలను ఇక్కడ తెలుసుకోండి.
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆయన తల్లి జానకీ అమ్మాల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నాకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన లాగే నేను కూడా టీచర్‌గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను ప్రెసిడెంట్ అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని నా భర్త అడిగారు. 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
తాత్కాలిక ప్రధానమంత్రి గురించి నేపాల్ నుండి కీలక అప్‌డేట్ వచ్చింది. సుశీలా కర్కి నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి కావచ్చని తెలుస్తోంది. సుశీలా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. జనరల్-జెడ్ వర్చువల్ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచారం ప్రకారం, దాదాపు 5000 మంది వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమయంలో, జనరల్-జెడ్ సుశీలా కర్కి పేరును ప్రతిపాదించారు. సుశీల నేపాల్ మొదటి మహిళా న్యాయమూర్తి.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
ఈశాన్య అరేబియన్ సముద్రం దాని సమీపంలోని దక్షిణ పాకిస్తాన్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం కేంద్రం నుండి ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావణ శాఖ వెల్లడించింది. సముద్రమట్టం నుండి 3.1 కి.మీ ఎత్తు వరకుఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం (సెప్టెంబర్ 10) ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, నిజమాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం కొమరం భీం, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. అభివృద్ధి పనులకు అటంకం కలగకుండా నిధులు కేటాయించాలని సీఎం కోరారు.
ప్రముఖ నటి నయనతారపై కొత్త వివాదం రాజుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆమె వ్యక్తిగత, వృత్తి జీవితంపై రూపొందిన డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమా క్లిప్‌ను వినియోగించడం చట్టపరమైన చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ‘చంద్రముఖి’ నిర్మాతలు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా సినిమా సన్నివేశాలు డాక్యుమెంటరీలో వాడినందున చర్యలు తీసుకోవాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. విషయాన్ని పరిశీలించిన హైకోర్టు, నటి నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6 లోపు ఈ విషయంపై సమగ్ర సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసుతో నయనతార డాక్యుమెంటరీపై కొత్త వివాదం మొదలైంది.
ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. మనం అడిగిన వెంటనే కేంద్రం యూరియా అందిస్తోంది అని హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా రైతులకు అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమిలో మూడు పార్టీల కార్యకర్తల స్పీడ్‌తో సపరిపాలనలో ఏపీ ప్రభుత్వాన్ని అడ్డే లేదన్నారు సీఎం చంద్రబాబు.
పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. BJP అధిష్ఠానం నుంచి పిలుపు వస్తే వెళ్లి కలుస్తానన్నారు. తనను పిలిస్తే BJPలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ స్పష్టం చేశారు. తాను MLA పదవికి రాజీనామా చేయనని.. ఏం చేస్తారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే తానూ చేస్తానన్నారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు రబ్బర్ స్టాంప్‌గా మారారని.. BJP కొత్త కమిటీలో హైదరాబాద్ నేతలే ఉన్నారన్నారు. కమిటీ రాంచందర్‌రావు వేశారా.. కిషన్‌రెడ్డి వేశారా? అని ప్రశ్నించారు. ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు రాజాసింగ్.
అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయోత్సవ సభను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. పార్టీలు వేరైనా, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ రూ. 25 లక్షల ఆరోగ్య భీమా అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించామని, రూ. 1005 కోట్లతో పీఎం జన్ మన్ పథకం ద్వారా 625 గిరిజన గ్రామాలను అనుసంధానించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పవన్ తెలిపారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ కరవు సీజన్ అని.. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తున్నాం, ఎవరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా కూటమి పార్టీలు కలిసి కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
బీహార్ ఎన్నికకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్‌లో రోడ్లు, రైల్వేల అభివృద్ధికి సంబంధించి కేంద్ర కేబినెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీహార్‌లోని బక్సర్-భాగల్పూర్ కారిడార్ మొకామా – ముంగేర సెక్షన్ 82.4 కి.మీ మేర నాలుగు లేన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 4,447 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే బీహార్‌లో రైల్వే భాగల్‌పూర్ – దుమ్కా – రాంపూర్‌హాట్ డబ్లింగ్ 177 కి.మీ.కు మంత్రి మండలి ఆమోదించింది. రూ. 3,169 కోట్లతో భాగల్‌పూర్ – దుమ్కా – రాంపూర్‌హాట్ డబ్లింగ్ లేన్ నిర్మాణం చేపట్టనున్నారు.
హైదరాబాద్ మహానగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. అలలు లేని అలజడి సృష్టించి వదిలాడు. మేఘాలన్నీ కూడబలుక్కుని ఒకేచోట పడ్టట్టు వానంతా ఒక్కసారిగా కురిసింది. దీంతో రహదారులు నదులను తలపిస్తే.. కాలనీలు చెరువులుగా మారిపోయాయి. హైటెక్ సిటి, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, పాతబస్తీ, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
నేపాల్‌లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల మధ్య, భారత్-నేపాల్ మధ్య రైల్వే సేవలు నిరవధికంగా నిలిపివేశారు. భారత్-నేపాల్ రైలు సర్వీసులు నిలిచిపోయిన తర్వాత, ఇరు దేశాల సరిహద్దులోని జయనగర్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. SSB జవాన్లు స్టేషన్ నుంచి ఖాళీ చేశారు. అన్ని ద్వారాలను మూసేశారు.
దక్షిణ భారతదేశంలో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ. 190 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు.
వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో విద్యార్థులు పెద్ద సాహసానికే ఒడిగట్టారు. తమ పట్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అమానుషంగా వ్యవహరిస్తూ.. ఆటలకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు గురుకుల పాఠశాల గోడ దూకి.. పొలాల గట్లపై పరుగెత్తారు. చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో పదవ తరగతి విద్యార్థులు ఆందోళన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లికి చెందిన కవిత అనే మహిళపై అదే గ్రామానికి చెందిన రాజు అలియాస్ మల్లేశ్ కత్తి, బీరు సీసాతో దాడికి ప్రయత్నించాడు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా డ్యాన్స్ చేస్తుండగా, ఆమెను మల్లేశ్ అడ్డుకున్నాడు. దీంతో కవిత భర్త మల్లేష్ ను మందలించాడు. ఈ క్రమంలో కవితపై కక్ష పెంచుకున్న మల్లేశ్ కత్తితో దాడికి యత్నిస్తుండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. మల్లేశ్ కత్తి, బీరుసీసాతో కాసేపు హంగామా సృష్టించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మల్లేశ్.. మరోసారి సదరు మహిళ భర్తను చంపేస్తానంటూ హంగామా సృష్టించాడు. కవిత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. DMK ఎమ్మెల్యే పీఏ ఒక దివ్యాంగుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా వేధింపులపై ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పీఏ అద్యమాన్‌తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ఘటనపై అన్నాడీఎంకే నేతలు ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్టీ కార్యకర్తలు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలవాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో విచ్చల విడిగా డబ్బు పంచి అధికార పార్టీ గెలవాలనుకుంటోందని, కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయద్దన్నారు. దొంగ ఓట్ల విషయంలో కూడా కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, కార్యకర్తలు ప్రజలను కలిసి బీఆర్ఎస్ అభివృద్ధిని వివరించాలని కేటీఆర్ అన్నారు.
తమిళనాడులో కుప్పం వాసులు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో అత్త అల్లుడు మృతి చెందగా.. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వీరంతా తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి KRP డ్యాములో దూకి ఆత్మహత్యయత్నం చేశారు. బాధితులను కుప్పంకు చెందిన 50 ఏళ్ల లక్ష్మణ్ మూర్తి, అతని భార్య 40 ఏళ్ల జ్యోతి, 20 ఏళ్ల కూతురు కీర్తిక, జ్యోతి తల్లి 70 ఏళ్ల శారదమ్మగా గుర్తించారు. నలుగురిలో లక్ష్మణమూర్తి, శారదమ్మ నీటిలో మునిగిపోయి మృతి చెందారు. నీటిలో మునిగిన జ్యోతి, ఆమె కుమార్తె కీర్తికను మాత్రం జాలర్లు రక్షించారు.
అనంతరం జ్యోతి, కీర్తికను చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు. కుప్పం జయప్రకాష్ రోడ్డు కు చెందిన లక్ష్మణమూర్తి కుటుంబం క్రిష్ణగిరి KRP డ్యామ్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనికి కుటుంబ కలహాలు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
తిరుమల టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టాక మర్యాదపూర్వకంగా క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడును ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కలిశారు. అనిల్ కుమార్ సింఘాల్ ను శాలువాతో సత్కరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు.
అల్లూరి జిల్లాలో బెర్రీ బోరర్ సోకిన కాఫీ తోటలను గిరిజన సంఘం సందర్శించింది. కాఫీ రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, పచ్చి కాఫీ పళ్ళకు కిలో 200 రూపాయలు కొనుగోలు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం సభ్యులు అప్పలనర్స డిమాండ్ చేశారు.
నేపాల్‌లో పది మంది విశాఖవాసులు చిక్కుకున్నారు. నేపాల్ టూర్కు వెళ్లిన ఎల్ఐసి ఉద్యోగులు.. అక్కడి ఉద్రిక్త పరిస్థితుల నడుమ చిక్కుకుపోయారు. ప్రస్తుతం పోఖారా టౌన్ లోని ఓ హోటల్లో ఉన్న టూరిస్టులు. ఖాట్మండు లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్ లో చిక్కుకున్న ఎల్ఐసీ ఉద్యోగులు విశాఖలోని సహ ఉద్యోగులకు సైతం తమ పరిస్థితిని వివరిస్తూ సమాచారం అందించారు.
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు కేంద్రమంత్రి బండి సంజయ్‌ని కలిశారు. నిరుద్యోగులకు అండగా నిలిచినందుకు గ్రూప్ 1 అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్-1 పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంత్రి బండి సంజయ్ అభ్యర్థులను అభినందించారు. ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం వుందానే సందేహంగా వుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం లేదు. ప్రజల అభివృద్ధి లేదు సంక్షేమం లేదు. ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన విద్యా, వైద్యం, వ్యవసాయం ప్రయివేటు వ్యక్తుల దోపిడీకి గురవుతుంది. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్స్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దానిపై వైసీపీ ఆందోళన చేస్తే పోలీస్ లు బెదిరిస్తూ నోటీస్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల గడివేముల మండలంలో రెచ్చిపోయిన దొంగలు. మండలంలోని రెండు అలయాల్లోని హుండీలు, బీరువాల్లో చోరీ చేశారు. బీరువా, హుండీలు పగలగొట్టి రూ.2 లక్షల నగదు, బంగారు, వెండి నగలు అపహరించారు. సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా గంజాయి పట్టుకున్న DRI. బ్యాంకాక్ నుండి వస్తున్న ప్రయాణికుడి వద్ద అధికారులు గంజాయి గుర్తించారు. పట్టుబడ్డ నిందితుడు హైదరాబాద్ కు చెందిన సయ్యద్ రిజ్వీగా ఆధికారులు గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి (హైడ్రోపోనిక్) 13.9 కిలోల వరకు ఉంది. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
రాబోయే 3 గంటల్లో శ్రీకాకుళం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అలాగే రాబోయే 3 గంటల్లో పార్వతిపురం, మన్యం, అనకపల్లి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామ రాజు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక్కడ కూడా గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూల్చివేతలను చేపట్టారు. కంటోన్మెంట్ ల్యాండ్‌లో కొన్ని సంవత్సరాలుగా దుకాణాలను పెట్టుకుని జీవనోపాధిని కొనసాగిస్తూ వస్తున్నారు. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణాలను ఖాళీ చేయలేదు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు నేటి తెల్లవారుజామున జేసీబీలతో వచ్చి కూల్చివేతలను చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. సీఈఓ మధుకర్ నాయక్‌తోపాటు అధికారులు కూల్చివేతలను పర్యవేక్షించారు. ఈనెల 17న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. జేబీఎస్ పక్కనే ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం ఉండడంతో ముందస్తుగా అధికారులు కూల్చివేతలపై దృష్టి పెట్టారు.
ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదిని రక్షణ దళం అరెస్టు చేసింది. అరెస్టైన వ్యక్తిని అఫ్తాబ్ గా గుర్తించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 12కి పైగా ప్రదేశాలలో స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీల దాడులు జరుగుతున్నాయి. ఎనిమిది మందికి పైగా అనుమానితులను అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ముంబైకి చెందిన అఫ్తాబ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. రాంచీ, ఢిల్లీలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరింత మంది ఉగ్రవాదులను అరెస్టు చేసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 16న లండన్ పర్యటనకు మంత్రి లోకేష్. ఆర్థిక, ఆరోగ్య, డీప్‌టెక్ ఏఐ రంగాల్లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీకానున్న లోకేష్.
నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. నిన్న రూ.నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మణిహారిక. మణిహారిక నివాసంలో నిన్నటి నుంచి ఏసిబి సోదాలు కొనసాగుతున్నాయి.
మాచర్లలోని శ్రీశైలం రోడ్డులో చంద్రశేఖర్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. వెల్డింగ్ పనులు చేస్తూ, లారీ డ్రైవర్ గా కూడా పనిచేస్తున్న మృతుడు చంద్రశేఖర్. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మాచర్ల పోలీసులు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
పార్టీ ఆఫీసంటే అది కార్యకర్తల కార్యాలయమే అన్నారు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎంని కలవాలంటే అప్పాయింట్‌మెంట్ అవసరంకానీ.. పార్టీ ఆఫీసుకు ఎవరు ఎప్పుడొచ్చినా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఢిల్లీ బీజేపీ ఆఫీసు కన్నా టీడీపీ ఆఫీస్ పెద్దగా ఉందన్నారు లోకేష్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ NDA అభ్యర్థికి ఎందుకు ఓటేసిందో వైఎస్ జగన్‌నే అడగాలన్నారు లోకేష్. 2029 ఎన్నికల్లో కూడా మోదీకే తమ మద్దతు ఉంటుందన్నారు. కేటీఆర్‌ని కూడా కలుస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి కలవాల్సిన అవసరం లేదన్నారు. కవితను టీడీపీలో తీసుకోవడమంటే.. జగన్‌ని పార్టీలో చేర్చుకోవడమేనంటూ చిట్‌చాట్ చేశారు నారా లోకేష్.
పూర్తి కథనం చదవండి..
కవితను టీడీపీలో తీసుకోవడమంటే.. జగన్‌ని పార్టీలో చేర్చుకోవడమే: నారా లోకేష్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు.
ఫిల్మ్ నగర్ భూ వివాదం పై నేడు నాంపల్లి కోర్టు విచారణ… ఫిల్మ్ నగర్ లోని తన డెక్కన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా కూల్చివేశారని నంద కుమార్ ఫిర్యాదు చేశాడు. నంద కుమార్ ఫిర్యాదు మేరకు దగ్గుపాటి కుటుంబం పై కేసు నమోదు చేసిన ఫిల్మ్ నగర్ పోలీసులు. విచారణలో భాగంగా ఈరోజు కోర్టు కు హాజరు కావాలని దగ్గుపాటి రానా, వెంకటేష్, సురేష్ కు నాంపల్లి కోర్టు ఆదేశం. నేడు హాజరు కాకపోతే NBW జారీ చేసే అవకాశం ఉంది.
పుత్తడి ధర పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతూనే ఉంది. ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.లక్షా 15 వేల మార్క్ దాటింది. ఇక వెండి కిలో ధర ఏకంగా రూ.లక్షా 40వేలకు చేరుకుంది. హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,300 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,10,300 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది.
Gold Price Today: అలర్ట్.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే.. పూర్తి వార్తకథనం ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాల భవనం కుప్పకూలింది. శిధిలావస్థలో ఉన్న పాత డార్మిటరీ బ్లాక్ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 601 మంది విద్యార్థులు చదువుతుండగా.. శిధిలావస్థలో ఉన్న భవనాల్లోనే విద్యార్ధులు ఉంటున్నారు. సంఘటన సమయంలో విద్యార్ధులకు తరగతులు జరుగుతుండటంతో పెను ప్రమాదం తప్పింది.
విశాఖపట్నం జిల్లాలోని కూర్మన్నపాలెంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ప్రత్యూష అనే మహిళ భవనం పై నుంచి దూకింది. దీంతో తీవ్రగాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గత కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు పోలీసులకు గుర్తించారు.
నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన రచ్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రధాని ఓలీ రాజీనామా చేసినా నిరసనకారుల ఆగ్రహం చల్లారలేదు. మాజీ మంత్రులు, అధికారంలో ఉన్న మంత్రులే లక్ష్యంగా వారి ఇళ్లకు నిప్పంటించారు. ఈ క్రమంలో దల్లూలోని మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టాగా.. అదే సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. నేపాల్ అధ్యక్షుడి నివాసాన్ని సైతం ముట్టడించి, నిప్పంటించారు. ఆయన సొంతింటికి కూడా నిప్పుపెట్టారు.
మంగళవారం అబుదాబిలో జరిగిన AFC ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను ఓడించింది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ 94/9కే పరిమితమైంది. బాబర్ హయత్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫజల్‌హాక్ ఫరూఖీ 2/16, గుల్బాదిన్ నయీబ్ 2/8 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ రషీద్ ఖాన్ సహా మరో ఇద్దరు ఆఫ్ఘన్ బౌలర్లు ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. కాగా గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక కూడా ఉన్నాయి. గ్రూప్ ఎలో ప్రపంచ ఛాంపియన్స్ భారత్, పాకిస్తాన్, ఒమన్, ఆతిథ్య యుఏఈ దేశాలు ఉన్నాయి.
విజయవాడ ఏసీబీ కస్టడీకి రెండు రోజుల పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో రెండో సారి కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు. నేడు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్ ను కస్టడీలోకి తీసుకొని మరోసారి విచారించనున్న ఏసీబీ అధికారులు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్నకాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించింది. సరైన పత్రాలు లేని 18 వాహనాలు సీజ్ చేసిన అధికారులు.
ట్రూత్ యాప్‌లో డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్ పెట్టారు. తన మిత్రుడు మోడీకి త్వరలో ఫోన్ చేస్తానని తన పోస్టులో వెల్లడించారు. భారత్ తో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతానని ట్రంప్ అందులో పేర్కొన్నారు. అమెరికా – భారత్ మధ్య ట్రేడ్ డీల్ విజయవంతం అవుతుంది ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నంద్యాల శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. జూరాల జలాశయం వద్దకు 45,450 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. సుంకేసులకు..30,415 క్యూసెక్కులు నీరు చేరింది. ఇన్ ఫ్లో : 65,865 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 66,052 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 883.30 అడుగుల మేర వరద నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 206.0996 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
గంజాయి మత్తులో విశాఖపట్నంలో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. జ్ఞానాపురం బాబు కాలనీలో ఓ ఇంట్లో చొరబడేందుకు యత్నం. ప్రశ్నించిన తండ్రి కొడుకుల పై దాడికి తెగబడ్డారు. దీంతో నారాయణ, శ్రీనివాసరావుకు గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు దేవర కళ్యాణ్ అలియాస్ గొల్ల, దుర్గాప్రసాద్ అలియాస్ పులి పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్యాక్టీరియా కారణంగానే చనిపోయారంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు. క్రమ క్రమంగా వీడు తున్న మరణాల మిస్టరీ. జాతీయ స్థాయి సంస్థల నివేదిక మరింత స్పష్టత వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. దీంతో ఆందోళన నుండి స్థానికులు బయటపడుతున్నారు.
నేడు గుంటూరు తురకపాలెంలో ఐసిఎంఆర్ బృందం పర్యటించనుంది. మరణాల మిస్టరీ చేధించేందుకు ఇప్పటికే గ్రామంలో పర్యటించిన పలు జాతీయ సంస్థలు. దీనిపై జాతీయ సంస్థలు నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిమ్స్, ఐసిఏఆర్, NCDC, NHC బృందాలు గ్రామంలో పర్యటించాయి. నేడు ICAL ప్రాధమిక నివేదిక అందివ్వనుంది. ఇందులో గ్రామంలో మట్టి, త్రాగునీటి నమూనాలు ICAR సేకరించింది.
యూరియా అక్రమ రవాణా అరికట్టే చర్యల్లో భాగంగా నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.యూరియా అక్రమ రవాణా జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద కలెక్టర్, ఎస్పీ తనిఖీలు చేపట్టారు.
తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు దక్షిణ ఒడిస్సా సమీపంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుండి 4.5 కి.మీ ఎత్తులో చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
రేపు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ రోజు, రేపు తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
బాబోయ్ మళ్లీ వస్తున్నాయ్.. 3 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు.! హెచ్చరికలు జారీ.. ఇక్కడ పూర్తి వార్తకథనం చదవండి.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఈ రోజు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
బాబోయ్ మళ్లీ వస్తున్నాయ్.. 3 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు.! హెచ్చరికలు జారీ.. ఇక్కడ పూర్తి వార్తకథనం చదవండి.
ఉపరాష్ట్రపతులుగా పనిచేసినవారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్‌హుస్సేన్, వి.వి.గిరి, ఆర్.వెంకటరామన్, శంకర్‌దయాళ్‌శర్మ, కె.ఆర్.నారాయణన్‌లు రాష్ట్రపతులు అయ్యారు. నారాయణన్ తర్వాత ఇప్పటివరకూ ఒక్క ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి స్థానానికి చేరుకోలేకపోయారు.
ఇప్పటివరకు 14 మంది ఉపరాష్ట్రపతులుగా సేవలందించగా.. 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మే 13,1952 నుంచి మే 13,1962 వరకు, ఆ తర్వాత మహమ్మద్ హమీద్‌అన్సారీ ఆగస్ట్ 11, 2007 నుంచి ఆగస్ట్ 11, 2017 వరకు అత్యధికంగా పదేళ్ల చొప్పున ఈ పదవిలో కొనసాగారు. అత్యల్పకాలం ఏడాది355 రోజులపాటు వీవీగిరి అత్యల్ప కాలం ఈ పదవిలో ఉన్నారు. ఇక ఆర్.వెంకటరామన్ రెండేళ్ల 327 రోజులు ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల వల్ల వీరిద్దరూ రాష్ట్రపతులు కూడా అయ్యారు. వేరే ఏ పదవీ లేకుండా 2 ఏళ్ల 344 రోజులకే ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తొలివ్యక్తి మాత్రం జగదీప్ ధన్‌ఖడే.
సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. అంతకుముందు.. జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ వ్యవహరించారు. దక్షిణ భారతం నుంచి బీజేపీకి బలమైన ప్రతినిధిగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణన్.. ఆర్ఎస్ఎస్‌తో చాలా కాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో తమిళనాడు బీజేపీకి అధ్యక్షుడిగానూ పనిచేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సీపీ రాధాకృష్ణన్ అనేక విజయాలు సాధించారు. దీంతోపాటు.. రాధాకృష్ణన్.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి నమ్మకస్థుడిగా భావిస్తారు. మొత్తంగా.. హఠాత్తుగా ఆరోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం.. మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే.. ఎన్డీయే పక్షాల మద్దతుతో సీపీ రాధాకృష్ణన్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన రాధాకృష్ణన్‌కు ఇండి కూటమి అభ్యర్ధి సుదర్శన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాన్ని అంగీకరిస్తునట్టు తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ కూడా రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపారు. సమాజసేవకు రాధాకృష్ణన్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు. ఎన్డీఏ అభ్యర్ధి విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మరోవైపు.. రాధాకృష్ణన్‌కు ఎన్డీఏ బలం కంటే 25 ఓట్లు ఎక్కువ రావడం చర్చకు దారి తీసింది. అయితే.. ఇండి కూటమి ఎంపీలు కూడా తమకు క్రాస్ ఓటింగ్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అటు.. ప్రజాస్వామ్య విలువలను రాధాకృష్ణన్ కాపాడుతారని ఆశిస్తునట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైద్దాంతిక పోరాటం జరిగిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తోపాటు పలువురు ప్రముఖులు రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపారు.
భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తన ప్రత్యర్థి, ఇండికూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ విజయం సాధించారు. మొత్తం 767 ఓట్లు పోలవగా.. ఎన్డీఏ అభ్యర్థికి 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. అయితే.. పోలైన ఓట్లలో 15 ఓట్లు చెల్లలేదని రాజ్యసభ సెక్రటరీ జనరల్ వెల్లడించింది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్, బీజేడీ, అకాళీదళ్ పార్టీలు దూరంగా ఉన్నాయి. సీపీ రాధాకృష్ణన్ గెలుస్తారని ఎన్డీఏ కూటమి ముందునుంచే నమ్మకంతో ఉంది. లోక్‌సభ, రాజ్యసభతో కలిపి ఎన్డీఏకు 427 ఎంపీల బలం ఉంది. అనుకున్నట్లుగానే రాధాకృష్ణన్ సునాయాసంగా గెలుపొందారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంపై సీపీ రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ముగిస్తే రాజకీయాలు మరిచిపోవాలి.. దేశ అభివృద్ధిపైనే దృష్టి.. అధికార, విపక్షాలు నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి.. ఏ పోస్టుకైనా కొన్ని పరిమితులు ఉంటాయని భారత నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.