అన్నం తినే శాకాహార మొసలి బాబియా 75 ఏళ్ల వయసులో మరణించింది. కేరళ తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి కోనేరులో ఉండే మొసలి కన్నుమూసినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. కాసరగోడ్ జిల్లాలోని అనంతపుర అనే గ్రామంలో ఉన్న పవిత్ర అనంత పద్మనాభ స్వామి ఆలయం కోనేరు మధ్యలో ఉంటుంది. ఈ సరస్సులో మొసలి బబియా దశాబ్ధాల పాటు నివసించింది. ఇది భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతోపాటు కేవలం అన్నం మాత్రమే తిని జీవించేది. మొసలి బాబియా శాకాహారం, ఆలయంలోని ప్రసాదాన్ని ఇష్టంగా తినేదని.. 70 సంవత్సరాలకు పైగా ఆలయ సరస్సులో జీవించిందని అధికారులు వెల్లడించారు. బబియా ప్రతిరోజూ మధ్యాహ్నం పూజ తర్వాత అందించే ఆలయ ప్రసాదాన్ని ఇష్టంగా తినేది. శాకాహార ప్రసాదంలో అన్నం, బెల్లం ఉంటాయని.. దీనిని రోజుకు రెండు సార్లు తినేదని పూజారి తెలిపారు. అంతేకాకుండా భక్తులు నిర్భయంగా స్నేహపూర్వకంగా మొసలికి ఇష్టంతో తినిపించేవారని తెలిపారు.
అయితే, అనంత పద్మనాభ స్వామి ఆలయ చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదని స్థానికులు తెలిపారు. అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని.. ఆ చెరువులో ఉండే చేపలను కూడా తినేది కాదని ఆలయ పూజారి వెల్లడించారు. ఆలయ పూజారి ప్రతిరోజు ఆ మొసలికి రెండుసార్లు అన్నం వేసేవాకగ.. ఒక్కోసారి ఆయనే అన్నాన్ని ముద్దలా చేసి దాని నోటికి అందించేవారు.
పురాతన సంప్రదాయానికి అనుగుణంగా ఈ శాఖాహార మొసలి జీవించేదని పేర్కొంటున్నారు. పురాణాల ప్రకారం.. తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి మూలస్థానం ఇదేనని.. స్వామివారు అనంతపుర సరస్సు ఆలయంలోనే స్థిర పడినట్లు భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇంకా ఆలయాన్ని రక్షించడానికి దేవుడు బబియాను నియమించినట్లు భక్తులు పేర్కొంటారు.
కాగా.. ఈ ఆలయ ప్రాంగణానికి వచ్చిన వారంతా బబియా ఫోటోలను తీసుకుంటూ సంతోషపడుతుంటారు. ప్రస్తుతం బబియాకు నివాళులర్పించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్థానికులు, భక్తులు తరలివచ్చి బబియాకు నివాళులర్పించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..