AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌కు సరికొత్త లుక్.. రూ.424 కోట్లతో 10 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ..

భారతీయ రైల్వే ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశంలోని విభిన్న రాష్ట్రాల్లో 10 కీలక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మొత్తం రూ.424 కోట్లకు పైగా వ్యయంతో ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలోని ఈ స్టేషన్లను సర్వాంగ సుందరంగా మార్చారు.

Indian Railways: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌కు సరికొత్త లుక్.. రూ.424 కోట్లతో 10 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ..
Indian Railways Completes Redevelopment Of 10 Railway Stations
Krishna S
|

Updated on: Jul 16, 2026 | 8:57 PM

Share

భారతీయ రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించే దిశగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 10 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం రూ.424.02 కోట్ల వ్యయంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఈ 10 స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేషన్ల రూపురేఖలను మార్చడమే కాకుండా మల్టీమోడల్ కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, దివ్యాంగులకు సులభ ప్రవేశం కల్పించే దీర్ఘకాలిక ప్రణాళికతో 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది.

హైటెక్ సిటీ స్టేషన్‌కు సరికొత్త హంగులు

ఈ 10 స్టేషన్ల జాబితాలో ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా ఉంది. రూ.26 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ పూర్తి ఆధునిక హంగులను సంతరించుకుంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ సబర్బన్ స్టేషన్ ద్వారా రోజూ సుమారు 3000 మంది ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడి నుండి సికింద్రాబాద్, హైదరాబాద్, ఉందానగర్, ఫలక్‌నుమా, మేడ్చల్, ఘటకేసర్ రూట్లలో నిత్యం 62 రైళ్లు నడుస్తుంటాయి. తాజా ఆధునీకరణతో ఐటీ కారిడార్ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందునున్నాయి.

140 కోట్లతో జైసల్మేర్ స్టేషన్‌

మరోవైపు పర్యాటక ప్రాంతమైన రాజస్థాన్‌లోని జైసల్మేర్ స్టేషన్‌ను అత్యంత విలాసవంతంగా మార్చడానికి రైల్వే శాఖ ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసింది. ప్రసిద్ధ గోల్డెన్ స్టోన్‌తో స్టేషన్ ముఖద్వారాన్ని డిజైన్ చేశారు. ఇందులో 10 లిఫ్టులు, 10 ఎస్కలేటర్లు, ఎయిర్ కండిషన్డ్ కాంకోర్స్, భారీ కమర్షియల్ జోన్‌ను ఏర్పాటు చేశారు. టూరిస్ట్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా పంజాబ్‌లోని 110 ఏళ్ల నాటి చారిత్రాత్మక జలంధర్ కాంట్ స్టేషన్‌ను రూ.125 కోట్లతో రీడెవలప్ చేశారు. ఇందులో భారీ ఎయిర్ కాంకోర్స్, స్లిప్ రెసిస్టెంట్ ఫ్లోరింగ్, ఎనర్జీ ఎఫిషియంట్ ఎల్‌ఈడీ లైటింగ్, రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించి, సిటీకి ఇరువైపుల నుండి స్టేషన్‌కు వచ్చేలా కొత్త ఎంట్రీ పాయింట్లను ఏర్పాటు చేశారు.

ఆధునిక హంగులతో మోదీ నగర్ రైల్వే స్టేషన్‌

ఢిల్లీ పరిధిలోని మోదీ నగర్ రైల్వే స్టేషన్‌ను రూ.25.75 కోట్ల వ్యయంతో ఆధునీకరించారు. ఇక్కడ 12 మీటర్ల వెడల్పున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కొత్త పార్కింగ్ ఏరియా, దివ్యాంగుల స్నేహపూర్వక వసతులు, లిఫ్టులను అందుబాటులోకి తెచ్చారు. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఉత్తరప్రదేశ్‌లోని పాంకీ ధామ్ స్టేషన్‌ను రూ.25 కోట్ల వ్యయంతో మేకోవర్ చేశారు. ఇందులో సుమారు 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సర్క్యులేటింగ్ ఏరియా, ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, గ్రీన్ స్పేస్‌లను అభివృద్ధి చేశారు. అలాగే యూపీలోని మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వింధ్యాచల్ స్టేషన్‌ను రూ. 23.24 కోట్లతో రీడెవలప్ చేసి G+1 కొత్త బిల్డింగ్, ఎంట్రన్స్ ప్లాజా, ఎగ్జిక్యూటివ్ లాంజ్, వెయిటింగ్ హాల్స్‌ను నిర్మించారు.

ఒడిశాలోని కేసింగ రైల్వే స్టేషన్ రూ.22 కోట్ల వ్యయంతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇక్కడ ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేసేందుకు రెండో ఎంట్రీ పాయింట్, 3 లిఫ్టులతో కూడిన 12 మీటర్ల వెడల్పు గల FOB, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లోని దౌసా రైల్వే స్టేషన్‌ను రూ. 15 కోట్ల వ్యయంతో ఆధునీకరించి, ర్యాంపులతో కూడిన కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఆధునిక కోచ్ ఇండికేషన్ బోర్డులు మరియు ప్రయాణికుల భద్రత కోసం నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు.

మహారాష్ట్ర పరిధిలోని పూణేకు చెందిన బారామతి రైల్వే స్టేషన్‌ను రూ.11.40 కోట్ల వ్యయంతో పునర్నిర్మించారు. కొత్త ముఖద్వారం, వీఐపీ లాంజ్ ఆధునీకరణతో పాటు ప్లాట్‌ఫారమ్ సర్ఫేస్‌లను మెరుగుపరిచారు. అలాగే మహారాష్ట్రలోని భూసావల్ డివిజన్ పరిధిలోకి వచ్చే నందురా రైల్వే స్టేషన్‌ను రూ.10.63 కోట్ల వ్యయంతో అప్‌గ్రేడ్ చేశారు. హౌరా-నాగ్‌పూర్-ముంబై మెయిన్ లైన్‌లో ఉన్న ఈ స్టేషన్‌లో 4 కౌంటర్లతో కూడిన కొత్త బుకింగ్ ఆఫీస్, ఏసీ వెయిటింగ్ రూమ్, ఆధునిక శౌచాలయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

మొత్తంగా అమృత్ భారత్ స్కీమ్ కింద ఆధునీకరించిన ఈ 10 రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం కొత్త వెయిటింగ్ హాల్స్, ఆధునిక టాయిలెట్స్, తాగునీటి కూలర్లు, వై ఫై సదుపాయం, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ర్యాంపులు, టాక్టైల్ పాత్‌వేస్ వంటి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించారు. దీనివల్ల ప్రయాణికులకు మరింత ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి లభించనుంది.

వీడియో చూడండి..

Follow Us