మరో రెండేళ్లలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా నిర్మూలిస్తాం.. హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల సీఎంలు ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్, అశ్విని చౌబే, అర్జున్ ముండా, దేవుసింగ్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌తో పాటు..

ఉగ్రవాదం, తీవ్రవాదం.. ఈ రెండూ అభివృద్ధికి గొడ్డలి పెట్టు. అశాంతి నెలకొన్న చోట ఏ పరిశ్రమలూ రావు, ఏ పెట్టుబడులూ రావు. అందుకే కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల భద్రతతో పాటు అంతర్గత భద్రతకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తోంది. ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ పేరుతో ఉక్కుపాదం మోపి అణచివేస్తోంది. ప్రజా ఉద్యమాలతో మిళితమైన వామపక్ష తీవ్రవాదంపై బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తూ ఫలితాలు సాధిస్తోంది. ఎప్పటికప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో సమావేశాలు జరుపుతూ పురోగతిని సమీక్షిస్తోంది. ఆ క్రమంలో తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల సీఎంలు ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్, అశ్విని చౌబే, అర్జున్ ముండా, దేవుసింగ్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భాల, కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఉన్నతాధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల హోం మంత్రులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదానికి అడ్డుకట్టేందుకు అనుసరించాల్సిన బహుముఖ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలో మరో రెండేళ్లలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. 2022 గణాంకాలను పరిశీలిస్తే గత 4 దశాబ్దాల్లో అత్యల్ప హింస నమోదైందన్నారు.
#WATCH | Union Home Minister Amit Shah chairs the Review Meeting on Left Wing Extremism (LWE), in Delhi. pic.twitter.com/UHqTZkotgt
— ANI (@ANI) October 6, 2023
వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యం. వామపక్ష తీవ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి హోంశాఖ 2015 నుండి ‘జాతీయ విధానం – కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించి అమలు చేస్తోంది. దీని కింద మావోయిస్టుల హింసను కట్టడి చేయడంతో పాటు ఏకకాలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపడుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పేద, బలహీన ప్రజలకు చేరేలా అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తున్నారు.
బహుముఖ వ్యూహం
వామపక్ష తీవ్రవాదం అనేక దశాబ్దాలుగా పెద్ద సవాలుగా ఉంది. ఇది రాష్ట్రాల వ్యవహారమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడిగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ పోరాటంలో హోం మంత్రిత్వ శాఖ 2015 సంవత్సరంలో జాతీయ విధాన కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. అప్పటి నుంచి పరిస్థితిని పటిష్టంగా పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేయడంతో పాటు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగాలను బలోపేతం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర సాయుధ పారా మిలటరీ బలగాలకు చెందిన బెటాలియన్‌లను మోహరించడం, హెలికాప్టర్లు, మానవ రహిత విమానాలు, డ్రోన్లు (UAV)లు, ఇండియా రిజర్వ్ బెటాలియన్ (IRB), స్పెషల్ ఇండియా రిజర్వ్ బెటాలియన్ (SIRB) వంటి ప్రత్యేక సుశిక్షత బలగాలను అందించడం ద్వారా హోం శాఖ రాష్ట్రాలకు సహాయం చేస్తోంది. దీంతో పాటు రాష్ట్ర పోలీసు వ్యవస్థలను ఆధునీకరించడం, పోలీసు బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, భద్రత సంబంధిత ఖర్చుల్లో ఆర్థిక సాయం అందించడం, మౌలిక సదుపాయాల కోసం నిధులు సమకూర్చడం వంటి చర్యల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తోంది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 17,600 కి.మీ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తోంది. ప్రభావిత రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో టెలీకాం కనెక్టివిటీని పెంచడంపై దృష్టి సారించింది. ఆ క్రమంలో కొత్త టవర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తోంది. బ్యాంకులు, ఏటీఎంలు, ఇతర అవసరమైన సదుపాయాలు మారుమూల గ్రామాల వరకు చేరేలా చర్యలు తీసుకుంటోంది.




