
ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ సంస్థ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2026-2030 మధ్యకాలంలో భారత్‌లో సుమారు 4.03 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఇందులో ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసంసుమారు 1.1 లక్షల కోట్లు వెచ్చించనుంది. 3.8 మిలియన్ ఉద్యోగాలు సృష్టించడం, 15 మిలియన్ చిన్న వ్యాపారాలకు ఉపయోగకరంగా, 4 మిలియన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుకు ఏఐ ప్రయోజనాలు అందించడం వంటి లక్ష్యాలతో అమెజాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారత్‌లో విస్తరించనుంది. భారత్‌లో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడుల నేపద్యంలో అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ప్రధాని మోదీతో భేటి అయ్యారు. ఈ భేటీలో డిజిటల్ ఎకానమీ, స్టార్టప్‌లు, ఎగుమతులు, చిన్న వ్యాపారాల డిజిటైజేషన్ వంటి అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపిన జాస్సీ వికసిత్ భారత్ -ఆత్మనిర్భర్ భారత్ దృష్టిని ప్రశంసించారు. భారత్ అమెజాన్‌కు అతి ముఖ్యమైన మార్కెట్‌లలో ఒకటిగా ఉందని చెప్పారు. ఇక ప్రధాని మోదీ కూడా జాస్సీతో సమావేశం అద్భుతంగా జరిగిందనీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారతదేశంలో అమెజాన్ రికార్డు స్థాయి 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడాన్ని మోదీ స్వాగతించారు. ఇది మన యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని.. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా తెలిపారు.
ఇక ప్రధానితో భేటి గురించి అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశంలో అమెజాన్ భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మంచి సమావేశం జరిగిందన్నారు. అమెజాన్ సంస్థ ఒక దశాబ్దానికి పైగా భారతదేశంలోని వినియోగదారులకు, విక్రేతలకు, డెవలపర్‌లకు, స్టార్టప్‌లకు సంస్థలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడే తమ ప్రస్థానం మొదలైందనీ రాబోయే ఐదేళ్లలో మేము 48 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెడుతున్నామని, ఇందులో ఏఐ , క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 21 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిపారు. 2030 నాటికి అమెజాన్ సంస్థ 3.8 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యంతో ఉందని 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులను సాధ్యం చేసే లక్ష్యం తో ఉన్నట్లు తెలిపారు. 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, 4 మిలియన్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించాలని ప్రణాళిక వేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో అమెజాన్ సంస్థ వ్యాపార విస్తరణ గురించి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం తో కలిసి ఏం చేయగలమో చెప్పడానికి చాలా సమయం ఉందంటూ అమెజాన్ సంస్థ గురించిన వివరాలు వెల్లడించారు
అమెజాన్ ఒక అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలలో ఒకటి. 1994 లో జెఫ్ బెజోస్ జూలై 5న బెల్‌వ్యూ వాషింగ్టన్‌లో స్థాపించారు. ప్రస్తుతం ఆండీ జాస్సీ 2021 మంచి సీఈఓగా కొనసాగుతున్నారు. మొదట్లో ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌గా ప్రారంభమైన అమెజాన్ తదుపరి వివిధ విభాగాల్లో తన వ్యాపార పరిధిని విస్తరించుకుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 15.76 లక్షల మంది ఉద్యోగులున్నారు. అమెజాన్ 2025 వార్షిక ఆదాయం సుమారు 60 లక్షల కోట్లుగా ఉంది. ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఉన్న పబ్లిక్ కంపెనీలలో ఒకటిగా అమెజాన్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ సంస్థ ఈ-కామర్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్. AI, డేటా స్టోరేజ్, కంప్యూటింగ్, ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ , ఫాస్ట్ డెలివరీ, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో అడ్వర్టైజింగ్ వేగంగా వృద్ధి చెందుతుంది.