మృత్యువు అంచున 194 మంది ప్రయాణికులు.. పైలట్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం!

బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న అకాసా ఎయిర్ విమానం (QP 1503) లో చోటుచేసుకున్న సాంకేతిక ఉత్కంఠ ప్రయాణికులను, అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇంధనం నిండుకోవడంతో విమానంలో తీవ్ర గందరగోళం నెలకొనగా, గగనతలంలో తలెత్తిన ఈ అత్యవసర పరిస్థితి చివరకు సురక్షితంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మృత్యువు అంచున 194 మంది ప్రయాణికులు.. పైలట్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం!
Akasa Air Flight

Updated on: May 28, 2026 | 8:06 AM

బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న అకాసా ఎయిర్ విమానం (QP 1503) లో చోటుచేసుకున్న సాంకేతిక ఉత్కంఠ ప్రయాణికులను, అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇంధనం నిండుకోవడంతో విమానంలో తీవ్ర గందరగోళం నెలకొనగా, గగనతలంలో తలెత్తిన ఈ అత్యవసర పరిస్థితి చివరకు సురక్షితంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకానికి చెందిన ఈ విమానం (రిజిస్ట్రేషన్ VT-YAJ), మొత్తం 194 మంది ప్రయాణికులు, సిబ్బందితో బెంగళూరు నుండి బయలుదేరింది. అయితే, భువనేశ్వర్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని రాత్రి 8:40 గంటల ప్రాంతంలో లక్నో విమానాశ్రయానికి మళ్లించారు. ఈ మళ్లింపు సమయంలో విమానంలో ఇంధన స్థాయి ప్రమాదకరంగా తగ్గడం ప్రారంభమైంది.

పరిస్థితి విషమించడాన్ని గమనించిన పైలట్ వెంటనే “పాన్-పాన్” కాల్ జారీ చేశారు. విమానంలో తక్షణ ప్రమాదం లేకపోయినా, అత్యవసర సహాయం అవసరమైనప్పుడు పైలట్లు ఈ కాల్‌ను ఉపయోగిస్తారు. ఇంధనం తక్కువగా ఉన్నందున, ల్యాండింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకే ప్రయత్నంలో రన్‌వేపై విమానాన్ని దించేందుకు అనుమతించాలని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని కోరారు. పైలట్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏటీసీ, బుధవారం (మే 27) రాత్రి 9:02 గంటలకు విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి ప్రకటించింది. రాత్రి 9:04 గంటలకు అగ్నిమాపక వాహనాలు, వైద్య బృందాలు రన్‌వే చుట్టూ సిద్ధమయ్యాయి. రాత్రి 9:21 గంటలకు విమానం రన్‌వే 09పై సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ తర్వాత విమానంలో ఎలాంటి సమస్యలు లేవని పైలట్ నిర్ధారించడంతో, రాత్రి 9:30 గంటలకు ఎమర్జెన్సీని ఎత్తివేశారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం పెద్ద ఊరట. లక్నోలో ముగ్గురు ప్రయాణికులు దిగిపోగా, మిగిలిన వారితో విమానం తిరిగి భువనేశ్వర్‌కు ప్రయాణమైంది. పైలట్ సమయస్ఫూర్తి, ఏటీసీ తక్షణ స్పందన వెరసి ఒక పెద్ద విమాన ప్రమాదం తృటిలో తప్పింది. భద్రతా ప్రోటోకాల్స్ ఎంత పక్కాగా ఉంటే ప్రాణాలు ఎలా కాపాడబడతాయో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us