Airfare Charges: ఢిల్లీ -ముంబై రూట్లో చుక్కలను తాకుతున్నాయి ఫ్లైట్ టిక్కెట్ ధరలు . ఢిల్లీ-ముంబై ప్రయాణించాలంటే ఒక రోజు ముందు టికెట్ బుక్ చేసుకున్నా.. సుమారు రూ.14 వేలు ఖర్చు అవుతోంది. ఇది ప్రపంచంలో అతి బిజీ నగరాల మధ్య టికెట్ ధరల్లో ఒకటి. భారత్‌లోనే దేశీయ విమాన టికెట్ల ధరలు చాలా అధికమని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్ అధ్యయనం తెలిపింది. విమాన టికెట్ ధరలు భారత్‌లోనే అత్యధికంగా 41 శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. దుబాయ్‌లో 34శాతం, సింగపూర్‌లో 30శాతం, ఆస్ట్రేలియా 23శాతం ఉన్నాయి. భారత్‌తో పాటే ఇండోనేషియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, జపాన్‌లో కూడా విమానం టిక్కెట్ ధరలు పెరిగాయి. అమెరికాలోని పలు నగరాల మధ్య ప్రయాణం కంటే ముంబై- ఢిల్లీ మధ్య విమానయానం కాస్ట్‌లీగా మారింది.
విమాన టికెట్ ధరలు భారీగా పెరగడానికి ఇంధన ధరలు, ద్రవ్యోల్బణమే కారణమని సదరు నివేదిక వెల్లడించింది. గత కొంతకాలంగా ఎయిర్‌లైన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అధిక టికెట్ ధరలు ఈ రంగానికి ముప్పుగా మారాయని తాజా నివేదిక హెచ్చరించింది. పెరుగుతోన్న విమాన టికెట్ ధరలపై భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ గ్రూపుతో ఈవిషయంపై చర్చలు కూడా జరిపారు. విమాన టికెట్ ధరల్లో స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. అయితే కొన్ని ఎయిర్‌లైన్స్ కావాలనే టిక్కెట్ ధరలు పెంచుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటిని నియంత్రించాలని ప్రజలు కేంద్రాన్ని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..