అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం..! ఎయిర్‌ ఇండియా ఆఫీస్‌లో సెలబ్రేషన్స్‌..?

అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత, AISATS అనే సంస్థలో జరిగిన పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రమాదంలో 270 మంది మరణించగా, కొద్ది రోజులకే AISATS ఉద్యోగులు పార్టీ చేసుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం..! ఎయిర్‌ ఇండియా ఆఫీస్‌లో సెలబ్రేషన్స్‌..?
Aisats

Updated on: Jun 28, 2025 | 10:18 AM

ఈ నెల 12న అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. టేకాఫ్‌ అయిన నిమిషంలోపే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 270 మంది మరణించారు. అయితే.. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఎయిర్ ఇండియాకు అనుబంధం సంస్థగా ఉన్న AISATSలో సెలబ్రేషన్స్‌ జరిగినట్లు ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. AISATS సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఒక ఆఫీస్ పార్టీలో డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ఫుటేజ్ బయటకు రావడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. దీంతో నలుగురు సీనియర్ AISATS ఉద్యోగులను రాజీనామా చేయాలని ఎయిర్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ కోరినట్లు సమాచారం.

వైరల్‌ అవుతున్న వీడియో AISATS గురుగ్రామ్ కార్యాలయంలో రికార్డ్‌ చేసినట్లు సమాచారం. కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా సిబ్బందితో కలిసి నృత్యం చేస్తుండగా, నేపథ్యంలో ఉల్లాసమైన సంగీతం వినిపిస్తోంది. ఈ వేడుకల సమయాన్ని విస్తృతంగా ఖండించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు ఇప్పటికీ తమ ప్రియమైనవారి మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ కంపెనీ ఉద్యోగులు ఇలా పార్టీలు చేసుకోవడం, అది కూడా కంపెనీ ఆఫీస్‌లోనే కావడంతో పలువురు తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ సెలబ్రేషన్స్‌ దేని కోసం జరిగాయనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

AISATS అంటే ఏమిటి?

ఎయిర్ ఇండియా SATS (AISATS) అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్, సింగపూర్‌కు చెందిన SATS లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్. ఇది భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలను అందిస్తుంది. ఏవియేషన్ లాజిస్టిక్స్‌లో ఫ్రంట్‌లైన్ ప్లేయర్‌గా, ఎయిర్ ఇండియా విమానాల సేవలను నిర్వహించడంలో కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి