ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా వీడని మిస్టరీ.. నివేదికపై ఉత్కంఠ..
టేకాఫ్ అయిన కేవలం మూడు సెకన్లు.. కాక్‌పిట్‌లో అనూహ్యంగా రెండు ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అయిపోయాయి.. ఇంజన్లకు ఇంధనం నిలిచిపోయింది. మరో 30 సెకన్లలో భారీ బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం ఒక మెడికల్ హాస్టల్‌పై కుప్పకూలడంతో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత ఏవియేషన్ చరిత్రలోనే బ్లాక్ డేగా మిగిలిన ఎయిర్ ఇండియా 171 ఘోర విమాన ప్రమాదం జరిగి నేటికి సరిగ్గా ఏడాది.

“మేడే.. మేడే.. మేడే..’’సరిగ్గా ఏడాది క్రితం.. 2025 జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ రన్‌వే నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 171 విమాన పైలట్ నుండి వచ్చిన ఆఖరి ఆర్తనాదం ఇది. టేకాఫ్ అయిన కేవలం మూడు సెకన్లలోనే కాక్‌పిట్‌లోని రెండు ఫ్యూయల్ స్విచ్‌లు ఆగిపోయి, ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. మరో ముప్పై సెకన్లలో ఆ భారీ విమానం సమీపంలోని మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్‌పై కుప్పకూలింది. ఈ దారుణ ఉదంతంలో 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విమానంలో ఉన్న 242 మందిలో కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, భూమిపై ఉన్న మరో 19 మంది అమాయకులు బలయ్యారు. 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సంభవించిన ఆ అగ్నిప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో, గుర్తింపు ప్రక్రియకు వారాల తరబడి DNA పరీక్షలు చేయాల్సి వచ్చింది. 1996 నాటి చర్ఖీ దాద్రి ప్రమాదం తర్వాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన విపత్తు ఇదే. నేడు ఈ దారుణ ఘటన జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు రహస్యంపై అంతర్జాతీయ ఏవియేషన్ రంగంలో ఉత్కంఠ రేపుతోంది.
రెండు పీడకలల సిద్ధాంతాలు
గడిచిన ఏడాది కాలంగా ఎయిర్ ఇండియా 171 ప్రమాదం రెండు ప్రధాన సిద్ధాంతాల చుట్టూ తిరుగుతోంది. ఈ రెండూ కాక్‌పిట్‌లోని ఆ రెండు ఫ్యూయల్ కటాఫ్ స్విచ్‌ల కదలికతోనే ముడిపడి ఉన్నాయి.
మొదటిది – మానవ తప్పిదం : టేకాఫ్ అయిన వెంటనే పైలట్లలో ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగానో లేదా పొరపాటునగానో ఆ ఫ్యూయల్ స్విచ్‌లను ఆపేశారనేది ఒక వాదన. సాధారణంగా ఈ స్విచ్‌లు రక్షణ కవచంతో ఉండి అంత సులభంగా ఆపడానికి వీలుండదు. కాబట్టి ఇందులో మానవ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
రెండూ – సాంకేతిక లోపం: అత్యాధునిక బ్యాకప్ సిస్టమ్స్ ఉన్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో తీవ్రమైన ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లోపం తలెత్తి, అత్యంత కీలకమైన సమయంలో ఇంధన సరఫరాను నిలిపివేసిందనేది రెండో వాదన.
ప్రాథమిక నివేదిక వెల్లడించిన షాకింగ్ నిజాలు
గతేడాది జూలై 12న లీకైన ప్రాథమిక నివేదిక ప్రకారం.. టేకాఫ్ అయిన మూడు సెకన్లలోనే ఇంజన్ 1, ఇంజన్ 2 ఫ్యూయల్ స్విచ్‌లు కేవలం ఒక సెకను వ్యవధిలో RUN నుండి CUTOFF మోడ్‌లోకి మారిపోయాయి. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఒక పైలట్ “నువ్వు స్విచ్‌లు ఎందుకు కట్ చేసావ్?” అని అడగగా.. రెండో పైలట్ “నేను చేయలేదు” అని సమాధానం ఇచ్చినట్లు రికార్డ్ అయింది. ఆ తర్వాత స్విచ్‌లను మళ్లీ RUN మోడ్‌లోకి తెచ్చినప్పటికీ, అప్పటికే విమానం వేగాన్ని, ఎత్తును కోల్పోయి కూలిపోయింది.
రంగంలోకి బోయింగ్.. కొత్త ట్విస్ట్‌లు
ఈ ప్రమాదం అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్, ఎయిర్ ఇండియా ప్రతిష్టలను పణంగా పెట్టింది. ఒకవేళ పైలట్ తప్పిదమైతే చనిపోయిన పైలట్లను సమర్థించుకునేవారు లేరు. అదే సాంకేతిక లోపమైతే బోయింగ్ సంస్థ బిలియన్ల డాలర్ల నష్టపరిహారంతో పాటు వందలాది డ్రీమ్‌లైనర్ విమానాలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో కొన్ని నెలల క్రితం లండన్-బెంగళూరు రూట్‌లో వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా 787 విమానంలో కూడా ఇలాంటి ఫ్యూయల్ స్విచ్ లాచ్ సమస్య తాత్కాలికంగా తలెత్తడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. ప్రస్తుతం ఆ విమాన స్విచ్ యూనిట్‌ను భారత ఏవియేషన్ నిపుణుల సమక్షంలో పరీక్షించడానికి అమెరికాలోని బోయింగ్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. గతంలో బోయింగ్ 737 MAX విమానాల కంట్రోల్ సాఫ్ట్‌వేర్ వివాదంలో బోయింగ్ ప్రవర్తనను గుర్తుచేస్తూ చాలా మంది నిపుణులు సాంకేతిక లోపం వైపే మొగ్గు చూపుతున్నారు.
రెండు ప్రమాదాల గుణపాఠాలు
భారతదేశానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ దర్యాప్తును నడిపిస్తోంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏడాది పూర్తయిన సందర్భంగా AAIB ఈరోజు తుది నివేదికను గానీ, లేదా తాత్కాలిక పురోగతి నివేదికను గానీ సమర్పించాల్సి ఉంది. అయితే చరిత్రలో మిగిలిపోయిన రెండు ప్రమాదాలు మనకు హెచ్చరికలుగా నిలుస్తున్నాయి.
చైనా ఈస్టర్న్ ఫ్లైట్ 5735 (2022): ఈ ప్రమాదం జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా చైనా పూర్తి నివేదిక ఇవ్వకుండా దాటవేస్తోంది. ఇటీవల అమెరికా NTSB డేటా లీక్ చేస్తూ అది పైలట్ చర్యేనని చెప్పే వరకు అసలు విషయం బయటకు రాలేదు. నిశబ్దం అనేది దర్యాప్తును నిర్వీర్యం చేస్తుందనడానికి ఇది ఉదాహరణ.
ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ 990 (1999): అమెరికా దర్యాప్తు సంస్థ ఇది పైలట్ ఆత్మహత్య అని చెబితే, ఈజిప్ట్ ప్రభుత్వం దాన్ని తిరస్కరించి యాంత్రిక లోపమని వాదించింది. ఇలాంటి పరస్పర విరుద్ధ ముగింపులు ఏవియేషన్ రంగానికి పెద్ద శాపాలు.
ఎయిర్ ఇండియా 171 ప్రమాదానికి కారణం మానవ తప్పిదమైతే పైలట్ల మానసిక ఆరోగ్యం, కాక్‌పిట్ నిబంధనలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సాంకేతిక లోపమైతే వందలాది బోయింగ్ విమానాల రీ డిజైనింగ్ చేయాల్సి వస్తుంది. కారణం ఏదైనా కావచ్చు, విమాన ప్రయాణాల భద్రత అనేది ఎప్పుడూ కఠినమైన నిజాల పైనే నిర్మించబడుతుంది. ఈ వార్షికోత్సవం వేళ, బాధితుల కుటుంబాలకు కావాల్సింది ఊహాగానాలు కావు.. నిజమైన, పారదర్శకమైన సమాధానం.
