
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీకి ఓ పెట్ డాగ్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ తన తల్లికి కుక్క పిల్లను బహూకరించారు. సోనియా గాంధీకి కూడా ఈ కుక్క పిల్ల చాలా బాగా నచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఆ పెంపుడు కుక్కకు పెట్టిన పేరే రాహుల్ గాంధీకి పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇంతకీ ఈ పెట్‌డాగ్ పేరేంటో తెలుసా.. ‘నూరీ’. ఇస్లాం మతానికి సంబంధించిన ఈ పేరును కుక్క పిల్లకు పెట్టడంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) తీవ్రంగా మండిపడుతోంది. పెట్‌డాగ్‌కు ఈ పేరు పెట్టి ముస్లింల మనోభావాలు దెబ్బ తీశారంటూ రాహుల్‌ను హెచ్చరిస్తున్నారు. వెంటనే పెట్ డాగ్ పేరు మార్చాలని, అలాగే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నూరి పేరుపై ఎంఐఎం అధికార ప్రతినిధి ఫర్హాన్ ప్రయాగ్ రాజ్ లోని సీజేఎం కోర్టును ఆశ్రయించారు. మహ్మద్ ఫర్హాన్ మాట్లాడుతూ ‘ కుక్క పేరు తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసింది. ‘నూరీ’ అనే పదం ఇస్లాంకు ప్రత్యేకంగా సంబంధించినది. ఖురాన్‌లో కూడా దీని ప్రస్తావన ఉంది. ఇస్లాంలో నూరి అంటే మొహమ్మద్ ప్రవక్త వ్యక్తిత్వాన్నికి సంబంధించిగా. అలాంటి పేరును కుక్కకు పెట్టి రాహుల్ ముస్లింలను దారుణంగా అవమానించారు ‘ అని తెలిపారు.
కాగా ఈ కేసు గురించి ఫర్హాన్ తరపు న్యాయవాది మహ్మద్ అలీ మాట్లాడుతూ ‘ఐపీసీ సెక్షన్ 295 ఎ (మత మనోభావాలను దెబ్బతీయడం) కింద రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాం. అలాగే కోర్టు కేసును విచారణకు స్వీకరించింది. విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది’ అని తెలిపారు. కాగా
వివిధ వార్తాపత్రికలు, రాహుల్ గాంధీ ఫేస్‌బుక్ పేజీ, యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా కుక్క పేరు గురించి ఏఐఎంఐఎం అధినేతకు తెలిసిందని న్యాయవాది తెలిపారు. కుక్క పేరు మార్చాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫర్హాన్ న్యూస్ ఛానల్స్, వార్తాపత్రికల ద్వారా రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారని, అయితే ఆయన దీనిని పట్టించుకోవడం లేదన్నారు. నవంబర్ 8న ఫర్హాన్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు కోర్టు సమన్లు జారీ చేసిందని తెలిపారు. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత రాహుల్ గాంధీని కోర్టుకు సమన్లు చేయవచ్చని లాయర్ తెలిపారు. కాగా ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి కుక్కను బహుమతిగా ఇస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ కుక్క పేరు రాహుల్‌కు తల నొప్పి తెచ్చిపెట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…