ONE NATION – ONE ELECTION: ప్రధాన నోట మళ్ళీ జమిలి ప్రస్తావన.. కార్యాచరణ అత్యంత సంక్లిష్టం.. మరి మోదీ వ్యూహమిదేనా..?

కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికారపగ్గాలు చేపట్టినప్పట్నించి జమిలి ఎన్నికల అంశం తరచూ చర్చకొస్తోంది. తాజాగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మరోసారి జమిలి ఎన్నికల అవసరాన్ని చాటి చెప్పారు.

ONE NATION - ONE ELECTION: ప్రధాన నోట మళ్ళీ జమిలి ప్రస్తావన.. కార్యాచరణ అత్యంత సంక్లిష్టం.. మరి మోదీ వ్యూహమిదేనా..?
Modi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 26, 2022 | 3:48 PM

ONE NATION ONE ELECTION PRIME MINISTER NARENDRA MODI STATEMENT: జమిలి ఎన్నికలు.. ఈ పదబంధం గత ఏడేళ్ళుగా తరచూ వినిపిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ (NARENDRA MODI) సారథ్యంలో భారతీయ జనతా పార్టీ (BHARATIYA JANATA PARTY) అధికారపగ్గాలు చేపట్టినప్పట్నించి జమిలి ఎన్నికల అంశం తరచూ చర్చకొస్తోంది. పలు మార్లు ప్రధాని స్వయంగా దేశంలో జమిలి ఎన్నికల ఆవశ్యకతను ప్రస్తావించారు. తాజాగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం (NATIONAL VOTER’S DAY) సందర్భంగా ప్రధాన మంత్రి మరోసారి జమిలి ఎన్నికల అవసరాన్ని చాటి చెప్పారు. దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికలు జరిపితే బావుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకేసారి ఎన్నికల ప్రహసనం పూర్తి అయితే.. ఆ తర్వాత అయిదేళ్ళ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంశాలపైనే ఫోకస్ చేసే అవకాశం వుంటుందని, అలా కాకుండా వేర్వేరుగా ఎన్నికలు జరుగుతండడం వల్ల ప్రతీ ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలొచ్చి.. రాజకీయాలకు ప్రాధాన్యత ఏర్పడి, అభివృద్ధి ఆగిపోతుందని మోదీ వివరించారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రాసెస్ మొదలైన నేపథ్యంలో ‘‘వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌’’ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆ నినాదాన్ని మరింతగా పొడిగిస్తూ.. ‘‘వన్‌ నేషన్‌–వన్‌ –ఎలక్షన్‌ –వన్‌ ఓటరు లిస్ట్‌’’ (ONE NATION ONE ELECTION ONE VOTER LIST) ఉండాలన్నారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (GENERAL ELECTIONS) ఇంకా రెండేళ్ళ సమయం వుంది. 2019 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. తిరిగి 2024లో దాదాపు అదే సమయంలో ఎన్నికలకు ఆస్కారం వుంది. ఈలోగా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు, మీడియా సంస్థలు అభివర్ణిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీనే అధికారంలో వుంది. ఒక్క పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. అక్కడ ఇటీవల ముఖ్యమంత్రిని మార్చడం, క్రికెటర్ నుంచి రాజకీయవేత్తగా మారిన నవ్ జోత్ సింగ్ సిద్దూ రూపంలో వివాదాలు వెంటపడుతుండడం..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పంజాబ్‌లో తిరిగి అధికారాన్ని సాధించడం అంత ఈజీ కాదని చాటుతున్నాయి. దానికితోడు ఢిల్లీ నుంచి బయలు దేరిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోను బలమైన శక్తిగా ఎదిగింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ పార్టీ అటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఇటు విపక్ష బీజేపీకి సవాల్ విసురుతోంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి కేంద్రీకృతమైంది.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంపైనే. అక్కడ యోగీ అదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా రావడంతో కమలనాథుల్లో విజయంపై ధీమా వ్యక్తమవుతోంది.

ప్రధాని ప్రవచించిన జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అన్నదిపుడు చర్చనీయాంశం. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలి. దానికి అనుగుణంగా పార్లమెంటులో చట్టం చేయాలి. అంతకు పూర్వం రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ప్రతిపాదించే ఏ అంశాన్నైనా వ్యతిరేకించేందుకు పలు రాష్ట్రాల్లో అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీలు సిద్దంగా వున్నాయి. ఉదాహరణకు తెలంగాణనే తీసుకుంటే.. రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో రాజకీయ వైరం నెలకొంది. జనవరి 25న నిజామాబాద్ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై జరిగిన దాడి ఉదంతమే ఇందుకు పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి. తెలంగాణలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరే అవకాశం వుంది. అటు మహారాష్ట్రలో అధికారంలో వున్న శివసేన కూటమి కావచ్చు.. దానిపై పెత్తనం చేసే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు.. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించే జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా స్పందించే అవకాశాలే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో స్థానికంగా బలంగా వున్న ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్నాయి. వీటిలో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజూ జనతాదళ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్వర్యంలోని వైసీపీ జమిలి ఎన్నికలకు అనుకూలంగా వుండడమో లేదా తటస్థ వైఖరిని తీసుకోవడమో చేసే అవకాశాలే ఎక్కువ. అటు తమిళనాడులో అధికారంలో వున్న డిఎంకే.. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యుపీఏలో భాగం కాబట్టి.. యుపీఏ పార్టీలు తీసుకునే వైఖరికి అనుగునంగా డిఎంకే అధినేత స్టాలిన్ వ్యవహరించే అవకాశం వుంది.

జమిలి ఎన్నికలు అనగానే.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధం లేకుండా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీలను ముందుగా రద్దు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవేళ 2024లో జమిలి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమైతే.. కేవలం రెండేళ్ళ కాలం పూర్తి చేసుకున్న ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాల్సి వస్తుంది. అంటే మూడేళ్ళ ముందే అసెంబ్లీలు డిజాల్వ్ అవుతాయన్నమాట. గత సంవత్సరం తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. 2024 నాటికి ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలు మూడేళ్ళ కాలాన్ని మాత్రమే పూర్తి చేసుకుంటాయి. సో.. ఆ అసెంబ్లీలను కూడా రెండేళ్ళ ముందే రద్దు చేసి.. జమిలి ఎన్నికలకు వెళ్ళాల్సి వుంటుంది. నిజానికి ఈ తంతు కాస్త ఎక్కువ కాంప్లికేషన్లకు దారితీసే అవకాశాలే ఎక్కువ అని చెప్పాలి. న్యాయపరమైన చిక్కులకు అవకాశాలు లేకపోలేదు. ఈక్రమంలో మోదీ ప్రవచించిన జమిలి ఎన్నికలు రాజకీయ ఏకాభిప్రాయం లేకుండా సాధ్యం కాదన్నది నిర్వివాదాంశం. జాతీయస్థాయిలో .. ఆ మాటకొస్తే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక చరిష్మా కలిగిన నేతగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ.. తన వ్యక్తిగత చరిష్మాను అసెంబ్లీల ఎన్నికల్లోను ప్రదర్శించడం ద్వారా బీజేపీకి సానుకూల ఫలితాలు రాబట్టేందుకే కమలనాథులు జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదికి తెస్తోందని పలు పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్డీయేకు మెజారిటీ వుంది. లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ కలిగిన ఎన్డీయేకు రాజ్యసభలో బొటాబొటీ మెజారిటీ వుంది. ఈక్రమంలో జమిలి ఎన్నికలపై చట్టం తెస్తే ఎన్డీయే దాన్ని ఆమోదింపచేసుకునేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కానీ.. ఆ చట్టాన్ని అమలు చేయడంలోనే జమిలి ఎన్నికలను వ్యతిరేకంచే పార్టీలు, వాటి అధ్వర్యంలో వున్న రాష్ట్రాల ప్రభుత్వాలు న్యాయ పోరాటానికి దిగడం ఖాయం. అదే గనక జరిగితే.. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం వుంది.

గత ఏడేళ్ళుగా జమిలి ఎన్నికలను తరచూ ప్రస్తావిస్తున్న బీజేపీ నేతలు.. ఆ విషయంలో రాజకీయ ఏకాభిప్రాయానికి చేసిన ప్రయత్నాలు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. కానీ.. 2024 నాటికి జమిలి ఎన్నికలకు రంగం సిద్దం చేయాలనుకుంటే మాత్రం ఈ విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం కోసం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియను వెంటనే చేపట్టాల్సి వుంది. రెండేళ్ళ కాలాన్ని ఏకాభిప్రాయ సాధనకు కేటాయించి.. సార్వత్రిక ఎన్నికలకు ముందు చట్టం చేయగలిగితే బీజేపీ నేతలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవచిస్తున్న జమిలి ఎన్నికలకు దారి సుగమం అయ్యే అవకాశం వుంది. అలా కాకుండా ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద చట్టం చేస్తే.. న్యాయపరమైన చిక్కులతో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కూడా ప్రశ్నార్థకమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. జమిలి ఎన్నికల అంశాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేస్తారా ? లేక కార్యాచరణకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందా అన్ని వేచి చూడాలి.