‘అసెంబ్లీలో MLAలకు మసాజ్‌ కుర్చీలు.. భోజనం తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటే తప్పేంటీ?’.. అసెంబ్లీ స్పీకర్‌ ఖాదర్‌

మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఎమ్మెల్యే కార్యాలయాల్లో రిక్లైనర్లు ఏర్పాట్లు చేయాలని గతంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మారు ఆయన చేసిన పలు ప్రతిపాదనలు సర్వత్రా చర్చణీయాంశంగా మారాయి. ఏకంగా రూ. 3 కోట్ల వ్యయంతో ప్రతి ఎమ్మెల్యే కార్యాలయానికి స్మార్ట్ లాక్‌లు, రిక్లైనర్లతో పాటు మసాజ్ కుర్చీలనూ ఏర్పాటు చేయాలని, ఇందులో తప్పేంలేదని వ్యాఖ్యానించారు..

అసెంబ్లీలో MLAలకు మసాజ్‌ కుర్చీలు.. భోజనం తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటే తప్పేంటీ?.. అసెంబ్లీ స్పీకర్‌ ఖాదర్‌
massage chairs for MLAs at Assembly

Updated on: Mar 03, 2025 | 2:55 PM

ఎమ్మెల్యేల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ ప్రతిపాదించిన పలు సూచనలు ఇప్పుడు సర్వత్రా చర్చణీయాంశంగా మారాయి. ఏకంగా రూ. 3 కోట్ల వ్యయంతో ప్రతి ఎమ్మెల్యే కార్యాలయానికి స్మార్ట్ లాక్‌లను ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి అసెంబ్లీలో రిక్లైనర్లతో పాటు మసాజ్ కుర్చీలనూ ఏర్పాటు చేయాలని స్పీకర్ యూటీ ఖాదర్‌ అన్నారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, అవసరమైన ఇతర సౌకర్యాలపై శాసనసభ్యులతో తదుపరి చర్చలు జరుగుతాయని స్పీకర్‌ ఖాదర్ స్పష్టం చేశారు. గతంలో రిక్లైనర్ల ఏర్పాటును సమర్థించిన ఖాదర్.. తన వైఖరిని తాజాగా సమర్ధించుకున్నారు. అసెంబ్లీలో రిక్లైనర్లను మాత్రమేకాకుండా మసాజ్ చైర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చట్టసభల్లో సభ్యులు గంటల కొద్దీ చర్చలు సాగిస్తున్నారనీ, దీంతో వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. అంతేగానీ విలాసాల కోసం కానేకాదని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు ఈ విధమైన సముచిత సౌకర్యాలకు అర్హులని ఆయన అన్నారు. పైగా వీటిని కొనడానికి బదులు, అద్దెకు మాత్రమే తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను శత్రువుల మాదిరి చూడొద్దని, వారిని స్నేహితులు మాదిరి చూడాలని హితవుపలికారు. పెద్ద వయసులో ఉన్న మీ తండ్రి, సోదరుడు ఎవరైనా ఎమ్మెల్యే అయితే వారికి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడానికి మీరు ఏర్పాట్లు చేయరా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇక స్పీకర్‌ ఖాదర్‌ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గేతోపాటు పలువురు మంత్రులు సమర్థించారు.

‘నాకు రిక్లైనర్లు, మసాజ్ కుర్చీల గురించి తెలియదు. శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి, పాల్గొనేలా స్పీకర్ అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారని’ ఖర్గే అన్నారు. ఇక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా స్వీకర్‌కు మద్దతు పలికారు. ‘చాలా మంది శాసనసభ్యుల్లో సీనియర్ సిటిజన్లు ఉన్నారని, స్పీకర్‌ నిర్ణయం ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, ఇందులో తప్పేం ఉందని’ అన్నారు. బీజేపీ ప్రతిదానినీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు. అసలు వారి వ్యాఖ్యలకు వారే సిగ్గుపడాలని ఖండ్రే అన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అనవసరమైన ఖర్చని, కీలకమైన సమస్యల నుంచి దృష్టి మరల్చడంగా పేర్కొంది. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, కాంట్రాక్టర్లకు కనీసం జీతాలు కూడా చెల్లించడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి ధ్వజమెత్తారు. ముందు కాంట్రాక్టర్ల అప్పు చెల్లించి, తర్వాత మీ ఆనందం కోసం కుర్చీలు తెచ్చుకోండని వ్యాఖ్యానించారు. మీకు కావాలంటే మసాజ్ కుర్చీలు తెచ్చుకోండి. మాకు అలాంటివి ఏమీ వద్దని బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.