పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్‌లోని ఎగ్రాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎగ్రాలోని సహారా ప్రాంతంలోని గోపీనాథ్‌పూర్ చంద్‌కూరి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుపుతుందని స్థానిక ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అక్రమంగా నిర్వహిస్తున్న ఈ బాణాసంచా కర్మాగారం యజమానిని ఇటీవలనే అరెస్టు చేశామని, కానీ బెయిల్‌పై బయటకు వచ్చాడంటూ పేర్కొన్నారు.
అయితే, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు.. ఎన్ఐఏ విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్ఐఏ విచారణ జరిపి విచారిస్తే మాకు అభ్యంతరం లేదు. అయితే అసలు వ్యక్తిని పట్టుకోనివ్వండి.. అతనికి బెయిల్ ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందంటూ ముఖ్యమంత్రి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..