Syria: సిరియా అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు.. సేఫ్‌గా తీసుకొచ్చిన దౌత్యవేత్తలు
తాజాగా సిరియాలో నెలకొన్న అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది. సుమారు 75 మందిని సిరియాలోని కల్లోల ప్రాంతం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వారిలో 44 మంది జైరీన్ (ఇస్లామిక్ ఆధ్యాత్మిక యాత్రికులు) ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇప్పుడు భారతీయులు కనిపిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సంక్షోభం తలెత్తినా.. అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్లు’ చేపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ వైద్య విద్యార్థులు, ఇతరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ గంగా’ చేపట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా సిరియాలో నెలకొన్న అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది. సుమారు 75 మందిని సిరియాలోని కల్లోల ప్రాంతం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వారిలో 44 మంది జైరీన్ (ఇస్లామిక్ ఆధ్యాత్మిక యాత్రికులు) ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. జమ్ము-కాశ్మీర్‌కు చెందిన ఈ 44 మంది సిరియాలోని ఇస్లాంలో షియా వర్గానికి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటైన ‘సైదా జైనాబ్’ వద్ద వీరంతా చిక్కుకున్నారు. సరిగ్గా అదే సమయంలో సిరియా రాజధానిని తిరుగుబాటు దళాలు హస్తగతం చేసుకోవడం, 24 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన నియంత మహమ్మద్ అల్ బషీర్ దేశం విడిచి రష్యాకు పారిపోవడం జరిగాయి. పూర్తి అల్లకల్లోలంగా ఉన్న ఆ దేశం నుంచి తమను స్వదేశానికి పంపాలని అభ్యర్థించారు. వారితో పాటు వేర్వేరు కారణాలతో సిరియాలో ఉంటున్న భారతీయులు కూడా స్వదేశానికి తిరిగొచ్చే ప్రయత్నాల్లో భాగంగా అక్కడున్న భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో వారిని సిరియా రాజధాని డెమాస్కస్ నుంచి పొరుగుదేశం లెబనాన్ రాజధాని బీరుట్‌కు తరలించారు. బీరుట్ నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు కమర్షియల్ ఎయిర్‌లైన్స్ సేవలు కొనసాగుతున్నాయి. వాటిలో తమ తమ స్వస్థలాలకు చేరుకునేలా దౌత్యాధికారులు సహకరించారు.
సిరియాలో ముప్పేట సంక్షోభం
అసలే దశాబ్దాలుగా సిరియా అంతర్గతంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత కిరాతక ఉగ్రవాద సంస్థగా పేరుమోసిన “ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాఖ్ అండ్ సిరియా (ISIS)” పురుడు పోసుకున్నది కూడా ఈ దేశంలోనే. ఓవైపు నియంత అల్ బషీర్ పాలన, మరోవైపు “హయత్ తహ్రీర్ అల్-షాం” తిరుగుబాటుదారులు, ఇంకోవైపు ISIS ఉగ్రవాదులు.. ఇలా అన్ని రకాలుగా తీవ్రమైన హింస, నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశం నుంచి మిలియన్ల సంఖ్యలో శరణార్థులుగా యూరప్ సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు వలసపోయారు. ప్రస్తుతం నియంత పాలన పోయి గతంలో తిరుగుబాటుదారుల పాలన రావడం “పెనం మీద నుంచి పొయ్యి”లో పడ్డట్టుగా మారిందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పొరుగుదేశం తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లడంతో గత ప్రభుత్వం దాచిపెట్టిన క్షిపణులు, ఇతర మారణాయుధాలను తమ దేశానికి వ్యతిరేకంగా ప్రయోగిస్తారన్న భయంతో ఇజ్రాయిల్ ఇప్పుడు సిరియాపై విరుచుకుపడింది. సైనిక స్థావరాలు, ఆయుధ భాండాగారాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులు, ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహిస్తోంది.
హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన భారత్
ఇలాంటి అత్యంత తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోనూ అక్కడ భారతీయులు కొందరు సంచరిస్తూ ఇరుక్కుపోయారు. వారిలో కొందరు ఇప్పటికే దౌత్య కార్యాలయాన్ని సంప్రదించడంతో దేశం దాటి బయటపడేందుకు సహాయం లభించింది. ఇంకా సహాయం అందుకోవాల్సినవారు ఉన్నారని భారత ప్రభుత్వం భావిస్తోంది. వారి కోసం సిరియా రాజధాని డెమాస్కస్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
హెల్ప్‌లైన్ నెంబర్లు: Contact Details: +963 993385973, Email ID: hoc.damascus@mea.gov.in
ఫోన్ కాల్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తమను సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి