Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 64కు చేరిన మృతుల సంఖ్య

|

Oct 22, 2021 | 4:34 PM

ఉత్తరాఖండ్‌ వరదల్లో మరణించిన వారి సంఖ్య 64కి చేరుకుంది.. శిథిలాలను వెలికితీస్తున్న కొద్దీ గల్లంతైనవారి మృతదేహాలు బయటపడుతున్నాయి..

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 64కు చేరిన మృతుల సంఖ్య
Uttarakhand Floods
Follow us on

ఉత్తరాఖండ్‌ వరదల్లో మరణించిన వారి సంఖ్య 64కి చేరుకుంది.. శిథిలాలను వెలికితీస్తున్న కొద్దీ గల్లంతైనవారి మృతదేహాలు బయటపడుతున్నాయి.. విరిగిపడిన కొండ చరియలను తొలగించడంతో పాటు సహాయక చర్యలను సహాయక సిబ్బంది ముమ్మరం చేశారు.

దేవభూమి విలవిలలాడిపోయింది.. ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు, వరదలు కుదిపేశాయి.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు 107 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్‌ చేశాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు, రైల్వే ట్రాకులు, బ్రిడ్జిలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోత, వరదల కారణంగా ఇప్పటి వరకూ 64మంది మృత్యువాత పడ్డారు. 11మంది గల్లంతయ్యారు. సహాయ బృందాలు శిథిలాలను వెలికితీస్తున్న కొద్దీ గల్లంతైనవారి మృతదేహాలు బయటపడతున్నాయి. నైనితాల్‌ జిల్లాలో 34 మంది, చంపావత్‌ జిల్లాలో 11 మంది మృతిచెందారు. ప్రభుత్వ అంచనాల మేరకు వరదల కారణంగా దాదాపు రూ.7000 కోట్ల నష్టంవాటిల్లింది.

పశ్చిమ్ బెంగాల్ నుంచి పర్వతారోహణ కోసం ఉత్తరాఖండ్‌ వచ్చిన వారిలో 9 మంది ప్రకృతి బీభత్సానికి ప్రాణాలు కోల్పోయారు. భాగేశ్వర్ జిల్లా కుమావ్ ప్రాంతంలోని సుందర్‌దంగా హిమనీనదం దగ్గర ఐదు మృతదేహాలను గుర్తించారు. మరో నలుగురు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ మార్గంలో చనిపోయిరనిఅధికారులు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి. భారత వాయుసేనకు చెందిన మూడు హెలికాఫ్టర్లు రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నాయి. విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. భాగేశ్వర్ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో వరదల్లో నుంచి నలుగురిని రక్షించారు.

నైనితాల్‌లో పోటెత్తిన వరదలు..

ఉత్తరాఖండ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటించారు.. సీఎం పుష్కర సింగ్‌ ధామీ, గవర్నర్‌ గుర్మీత్‌ సింగ్‌తో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నైనిటాల్‌, అల్మోరా, హల్ద్వానీలో రోడ్లను క్లియర్‌ చేశామని..త్వరలోనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెరుగుపడిందని..చార్‌దామ్‌ యాత్రను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా సంభవించిన నష్టం 7 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read..

Harassment: ట్రైనింగ్‌ కోసం వచ్చిన బాలికతో కోచ్‌ అసభ్యకర ప్రవర్తన…కేసు నమోదు చేసిన పోలీసులు..

House Collapse: అర్ధరాత్రి కుప్పకూలిన రెండస్థుల భవనం.. నిద్రలోనే ఐదుగురు దుర్మరణం.. మరో ఆరుగురు..