17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ నెటిజన్ల డిమాండ్!
ఇద్దరు పిల్లలను కని, పెంచడమే తల్లిదండ్రులకు గగనమై పోతుంది. అలాంటిది ఓ జంట ఏకంగా 17 మంది పిల్లల్నీ కనేశారు. వైద్యరంగంలో చర్చనీయాంశంగా మారిన ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం సదరు మహిళకు 55 ఏళ్లు. తాజాగా మరోమారు కాన్పుకు వచ్చిన ఆమె.. 17 వ సారి విజయవంతంగా ప్రసవించి..

నేటి జీవన పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలను కని, పెంచడమే తల్లిదండ్రులకు గగనమై పోతుంది. అలాంటిది ఓ జంట ఏకంగా 17 మంది పిల్లల్నీ కనేశారు. వైద్యరంగంలో చర్చనీయాంశంగా మారిన ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం సదరు మహిళకు 55 ఏళ్లు. తాజాగా మరోమారు కాన్పుకు వచ్చిన ఆమె.. 17 వ సారి విజయవంతంగా ప్రసవించి, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన రేఖ గల్బెలియా(55) అనే మహిళ.. ఒకరుకాదు, ఇద్దరు కాదు ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనిచ్చింది. గతంలో 16 మందికి జన్మనిచ్చిన ఆమె.. తాజాగా ఆమె తాజాగా 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కావ్రా, రేఖ దంపతులకు గతంలో జన్మించిన 16 మంది సంతానంలో ఇప్పటికే నలుగురు కుమారులు, ఒక కుమార్తె పుట్టిన వెంటనే మరణించారు. మరో ఐదుగురికి వివాహాలు జరిగాయి. అయితే తాజాగా పురిటినొప్పులతో ఆస్పత్రికి వెచ్చిన రేఖ.. నాలుగో ప్రసవం అని వైద్యులకు అబద్ధం చెప్పి ఆస్పత్రిలో చేరినట్లు జాడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గైనకాలజిస్ట్ అయిన రోషన్ దరంగి తెలిపారు.
ఆనక ఆసలు విషయం తెలిసి వైద్యులు షాకయ్యారు. ఆమె కుమార్తెల్లో శిలా కల్బెలియా అనే అమ్మాయి తమ కుటుంబం ఆర్ధిక పరిస్థితి గురించి చెబుతూ ప్రభుత్వాన్ని సాయం కోరింది. తమకు ఇళ్లు లేదని, పిల్లల్ని చదివించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. పిల్లలను పోషించడానికి వడ్డీ వ్యాపారుల నుంచి 20 శాతం వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకోచ్చానని, ఆ అప్పు ఇప్పుడు లక్షల రూపాయలకు చేరిందని అన్నారు. అసలు చెల్లించినప్పటికీ.. వడ్డీ ఇప్పటికీ పూర్తిగా చెల్లించబడలేకపోయానని రేఖ భర్త కావ్రా కల్బెలియా కుటుంబ దీన స్థితిని వివరించాడు. ప్రధానమంత్రి ఆవాస్ పథకం కింద ఇల్లు మంజూరు చేయబడినప్పటికీ, భూమి తమ పేరు మీద లేకపోవడంతో నిరాశ్రయులమైపోయామన్నాడు. ఆహారం, వివాహాలు, విద్యకు ప్రతిరోజూ ఇబ్బంది పెడుతున్నామని కావ్రా వాపోయాడు. ఈ ఘటనపై నెటిజెన్లు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. రేఖ పిల్లలకు తల్లికి వందనం లాంటి పథకాలను ఆ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ కాలంలోనూ ఆమె 17 మంది బిడ్డలకు జన్మనిచ్చిందంటే గ్రేట్ అని ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




