ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన 14 ఏళ్ల బాలుడు.. గొంతుకోసి చంపేసిన మేనమామ! ఎక్కడంటే..

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి ఓ బాలుడు నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి మేనమామను పదే పదే డబ్బు ఇవ్వాలని విసిగించడంతో.. సహనం కోల్పోయి క్షణికావేశంలో బాలుడిని కిరాతకంగా హతమార్చాడు. బెంగళూరులో సోలదేవనహళ్లి పోలీసు పరిధిలోని వినాయక్ లేఅవుట్‌లో సోమవారం (ఆగస్టు 4) తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన 14 ఏళ్ల బాలుడు.. గొంతుకోసి చంపేసిన మేనమామ! ఎక్కడంటే..
Maternal Uncle Killed Nephe

Updated on: Aug 09, 2025 | 9:58 AM

బెంగళూరు, ఆగస్టు 9: అమోఘకీర్తి (14) అనే బాలుడు గత ఎనిమిది నెలలుగా బెంగళూరులోని సోలదేవనహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వినాయక లేఅవుట్‌లో ఉన్న తన మేనమామ నాగప్రసాద్‌ (50) వద్ద ఉంటున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన అమోఘకీర్తి రాత్రింబగళ్లు ఆడుతూ ఉండేవాడు. ఈక్రమంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేందుకు తరచూ డబ్బులు కావాలని మేనమామను విసిగించేవాడు. డబ్బులు ఇవ్వాల్సిందేనని ఇబ్బంది పెట్టేవాడు. అమోఘ కీర్తి ప్రవర్తనతో విసిగిపోయిన మేనమామ నాగప్రసాద్‌ .. సోమవారం తెల్లవారుజామున 4.30 గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో వదిలి నాగప్రసాద్‌ పరారైనాడు. సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత గురువారం రాత్రి సోలదేవనహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు నార్త్ వెస్ట్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిఎల్ నగేష్ తెలిపారు. పరారీ సమయంలో నాగప్రసాద్ మూడు రోజులు సిటీ సెంట్రల్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నాగప్రసాద్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ మేరకు అతని ఇంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న అమోఘకీర్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు వారం క్రితం తనపై దాడి చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. డబ్బుల కోసం తరచూ అమోఘకీర్తి వేధించేవాడని.. ఈ క్రమంలో వారం క్రితం పెద్ద గొడవ జరగగా తనపై దాడి చేసినట్లు పోలీసులకు తెలిపాడు. గొడవ సమయంలో తన మేనల్లుడు తనను కొట్టాడని, మేనల్లుడి టార్చర్‌ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపాడు. అయితే అందుకు కూడా తన వద్ద డబ్బులేదనీ, చివరకు నా చెల్లెలి కొడుకునే హత్య చేసి ఆ వేధన నుంచి విముక్తి పొందాలని భావించినట్లు పోలీసులకు తెలిపాడు.

బాలుడు చాలా రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదని, మానసిక సమస్యల కారణంగా డబ్బు కోసం మేనమామను వేధిస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వేధింపుల కారణంగానే నిందితుడు బాలుడిని హత్య చేసినట్లు డీసీపీ నాగేష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమోఘ కీర్తి మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నాగప్రసాద్‌ను కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.