రాత్రి బిర్యానీ, పుచ్చకాయ తిని పడుకున్నారు.. తెల్లారి చూసేసరికి ఆ నలుగురూ..
రాత్రి భోజనం చేసి.. రేపటి గురించిన ఎన్నో కలలతో ఆ కుటుంబం నిద్రపోయింది. కానీ అదే వారి చివరి రాత్రి అవుతుందని వారు ఊహించలేదు. బిర్యానీ, పుచ్చకాయ.. సాధారణంగా అందరూ తినే ఆహారమే ఆ నలుగురి ప్రాణాల మీదకు వస్తుందని ఎవరూ అనుకోలేదు. ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ముంబైలోని పైధుని ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. రాత్రి భోజనం తిని సంతోషంగా నిద్రపోయిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు.. తెల్లవారేసరికి విగతజీవులుగా మారారు. ఈ ఘటన యావత్ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక నివేదికల ప్రకారం.. పైధుని ప్రాంతానికి చెందిన అబ్దుల్లా డోకాడియా కుటుంబం రాత్రి బిర్యానీ తిన్నారు. భోజనం ముగిసిన కొద్దిసేపటికే వారంతా కలిసి పుచ్చకాయ తిన్నట్లు తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు మొదలై ఆరోగ్యం వేగంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు, చికిత్స పొందుతూ కుటుంబ పెద్ద అబ్దుల్లాతో పాటు అతని భార్య నస్రీన్, కూతుళ్లు అయేషా, జైనాబ్ మరణించారు.
ఫుడ్ పాయిజనింగ్ అనుమానం
ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారు తిన్న బిర్యానీ మరియు మిగిలిన పుచ్చకాయ ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపారు. విషం బిర్యానీలో ఉందా? లేక పుచ్చకాయలో ఉందా? లేదా బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తినడం వల్ల ఏదైనా రసాయనిక ప్రతిచర్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు, మరణానికి గల ఖచ్చితమైన కారణం ‘హిస్టోపాథాలజీ’ నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని వెల్లడించారు.
ప్రజల్లో భయాందోళనలు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అందరూ ఒకేసారి మరణించడం అరుదుగా జరుగుతుందని, దీని వెనుక మరేదైనా కారణం ఉందేమోనని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయట దొరికే ఆహారం లేదా నిల్వ ఉన్న పదార్థాలను తినేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.
