AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెదిరిన డాల్లర్ డ్రీమ్స్.. యూఎస్ నుంచి వెనక్కి వచ్చిన మూడో బ్యాచ్..!

అక్రమ వలసదారులతో అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో సోమవారం మూడో బ్యాచ్‌తో మరోసారి ల్యాండ్‌ అయింది. ఈ సారి 112 మందిని పంపారు. వీరిలో ఎక్కువ మంది హర్యానాకు చెందినవారు ఉన్నారు. హర్యానాకు చెందిన 44 మందితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..

చెదిరిన డాల్లర్ డ్రీమ్స్.. యూఎస్ నుంచి వెనక్కి వచ్చిన మూడో బ్యాచ్..!
Us Air Force
SN Pasha
|

Updated on: Feb 17, 2025 | 8:51 AM

Share

అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారిని తిరిగి వారి దేశాలకు పంపే ప్రక్రియ వేగంగా సాగుతోంది. మనదేశం నుంచి నుంచి అక్రమంగా వలస వెళ్లిన వారిని.. అమెరికా యుద్ధ విమానంలో తీసుకొచ్చి అమృత్‌సర్‌లో దింపేస్తున్న విషయం తెలిసిందే. గత రెండు వారాల్లో ఇప్పటికే రెండు సార్లు అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ కాగా.. సోమవారం మూడో బ్యాచ్‌తో మరోసారి అమెరికా విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ అయింది. ఈ సారి 112 మందిని పంపారు. వీరిలో ఎక్కువ మంది హర్యానాకు చెందినవారు ఉన్నారు. హర్యానాకు చెందిన 44 మందితో పాటు, 33 మంది గుజరాత్‌, 31 మంది పంజాబ్‌కు, ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు, హిమాచల్, ఉత్తరాఖండ్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నానని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రమే 119 మందితో ఓ విమానం ల్యాండ్‌ అయింది. వెంటనే ఒక రోజు గ్యాప్‌ తర్వాత మరో 112 మందిని దింపేశారు.

శనివారం వచ్చిన విమానంలో 67 మంది పంజాబ్‌, 33 మంది హర్యానాకు చెందినవారని అధికారులు తెలిపారు. మిగిలిన ఎనిమిది మంది గుజరాత్‌, ముగ్గురు ఉత్తరప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరిద్దరు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. ఫిబ్రవరి 5న అమెరికా నుండి బహిష్కరించబడిన భారతీయుల మొదటి బ్యాచ్, 104 మందితో సహా, అమెరికా సైనిక విమానంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఇప్పటివరకు, అమెరికా నుండి భారతీయ అక్రమ వలసదారులతో వచ్చిన విమానాలు అమృత్‌సర్ విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యాయి. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అసహనం వ్యక్తం చేశారు.

పవిత్ర నగరాన్ని బహిష్కరణ కేంద్రంగా మార్చొద్దని, అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం, దుర్గియానా మందిర్, రామ్ తీరథ్ ఆలయం, జలియన్‌వాలా బాగ్, గోవింద్‌గఢ్ కోట వంటి వాటికి ప్రసిద్ధి అని సీఎం మాన్‌ పేర్కొన్నారు. భారతదేశంలో అనేక వైమానిక స్థావరాలు ఉన్నాయని, అమృత్‌సర్‌లోనే కాకుండా అక్కడ కూడా ల్యాండ్‌ చేయవచ్చని, పంజాబ్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇక్కడే ల్యాండ్‌ చేస్తున్నారంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాగా శనివారం ల్యాండ్ అయిన సైనిక విమానంలో ఉన్న కొంతమంది చేతులకు సంకెళ్లు వేసి, కాళ్ళకు గొలుసులు వేసి ఉన్నట్లు సమాచారం. “మా కాళ్ళకు గొలుసులు వేసి, చేతులు కూడా కట్టి ఉంచారు” అని అక్రమ వలసదారుల బృందంతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా ఖండించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.