Tamil Nadu Jallikattu: తమిళనాట జల్లికట్టు క్రీడలో అపశృతి.. ఇద్దరు మృతి, 70 మందికి గాయాలు
పొంగల్ పండగ సందర్భంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. శివగంగ జిల్లాలో ఈ రోజు జరిగిన జల్లికట్టు పోటీలో మైనర్ సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో 70 మంది గాయపడినట్లు సమాచారం. మృతులను వలయంపాటికి చెందిన రవి (11), మరో 35 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. జిల్లా కలెక్టర్ ఆశా అజిత్, నియోజకవర్గం ఎంపీ కార్తీ పి చిదంబరం..
శివగంగ, జనవరి 17: పొంగల్ పండగ సందర్భంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. శివగంగ జిల్లాలో ఈ రోజు జరిగిన జల్లికట్టు పోటీలో మైనర్ సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో 70 మంది గాయపడినట్లు సమాచారం. మృతులను వలయంపాటికి చెందిన రవి (11), మరో 35 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. జిల్లా కలెక్టర్ ఆశా అజిత్, నియోజకవర్గం ఎంపీ కార్తీ పి చిదంబరం, డీఎంకే మంత్రి పెరియకరుప్పన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో 186 ఎద్దులు, 81 మంది వ్యక్తులు పాల్గొన్నారు.
పోటీ సమయంలో ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోలేదు. పోటీ తర్వాత యజమానులు తమ ఎద్దులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా ఎద్దులు అదుపుతప్పి పరుగులు తీశాయి. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి చెందారు. తమిళనాడులో ఇతర చోట్ల జరిగిన జల్లికట్టు పోటీల్లోనూ పలువురికి గాయాలు అయ్యాయి. మదురై జిల్లాలోని పాలమేడు వద్ద మంగళవారం 60 మంది గాయపడ్డారు. పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడులోని అనేక ప్రాంతాలలో సాంప్రదాయకంగా ఆడే జల్లికట్టుపై అనేక సంవత్సరాలుగా తీవ్ర చర్చలు, సుదీర్ఘ న్యాయ పోరాటాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జంతు హక్కుల సంస్థలు ఈ క్రీడపై నిషేధం విధించాలని పిలుపునిచ్చాయి. ఈ క్రీడలో పాల్గొనేవారితోపాటు ఎద్దులకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.
2006లో మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు జల్లికట్టుపై మొట్టమొదట నిషేధం విధించారు. జంతు హింస కారణంగా 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం 2017లో తాత్కాలికంగా నిషేధాన్ని ఎత్తివేసి, క్రీడను నియంత్రించే చట్టాన్ని (జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం (తమిళనాడు సవరణ) చట్టం, 2017) సవరించింది. జంతు హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. సుప్రీంకోర్టు వాదనల సమయంలో జల్లికట్టును కేవలం వినోదం కోసమే కాదని గొప్ప చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ఆచారానికి సంబంధించినదని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. దీంతో ‘జల్లికట్టు’కు అనుమతిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని గతేడాది సుప్రీంకోర్టు సమర్థించింది. తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో ‘జల్లికట్టు’ భాగమని, దీనిపై న్యాయవ్యవస్థ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచదని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. క్రీడల్లో జంతువుల పట్ల క్రూరత్వాన్ని గణనీయంగా తగ్గిస్తుందని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.