Parliament: 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు షురూ.. రెండు రోజుల పాటు కొత్త ఎంపీల ప్రమాణం.. 26న స్పీకర్ ఎన్నిక
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు, రేపు లోక్‌సభ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారగా.. ప్యానెల్‌లోని ముగ్గురు విపక్ష సభ్యులు సహకరించకుంటే అధికార పక్షం వ్యూహంపై ఆసక్తి నెలకొంది.
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు, రేపు లోక్‌సభ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారగా.. ప్యానెల్‌లోని ముగ్గురు విపక్ష సభ్యులు సహకరించకుంటే అధికార పక్షం వ్యూహంపై ఆసక్తి నెలకొంది.
18వ లోక్‌సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెం స్పీకర్ నేడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగనుంది. మొదట ప్రధాని మోదీ.. ఆ తర్వాత ప్యానల్ స్పీకర్లు ప్రమాణం చేస్తారు. అనంతరం కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం..రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మొదలవుతుంది. తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు, ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేస్తారు.
ఈ రోజు అండమాన్ నికోబార్, ఏపీ, అరుణాచల్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. రేపు తెలంగాణకు చెందిన ఎంపీలు, చివరగా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్‌తో మొదలై ఖమ్మంతో ముగుస్తుంది. తొలి రోజు 280 మంది ఎంపీలు.. రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక్కో ఎంపీ ప్రమాణస్వీకారానికి ఒక నిమిషం సమయం కేటాయిస్తారు.
మరోవైపు లోక్‌సభ ప్రొటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారింది. సీనియర్‌ను కాదని జూనియర్‌కు అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికైన సురేష్‌ను కాదని లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సభ్యుడు మహతాబ్‌ను ఎంపిక చేయడం ద్వారా నిబంధనలు, సంప్రదాయాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షం ఆరోపిస్తోంది.
లోక్‌సభ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు సహకారం అందించేందుకు విపక్షం నుంచి ఇప్పటికే ముగ్గురు సభ్యులను నియమించారు. అయితే ఆ ప్యానెల్‌లో ఉండేందుకు వారు విముఖత చూపిస్తున్నారు. బుధవారం స్పీకర్ ఎన్నిక జరిగే అంత వరకు కాంగ్రెస్ ఎంపీ కే.సురేష్, డీఎంకే ఎంపీ టీ.ఆర్.బాలు, TMC ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ఈ ప్యానెల్‌లో ఉండేలా తొలుత నిర్ణయించారు. ఈ ముగ్గురితోపాటు BJP సభ్యులు రాధామోహన్ సింగ్, ఫగ్గన్‌సింగ్ దీనిలో చోటు కల్పించారు. అయితే భర్తృహరి నియామకంపై తమ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పదవుల్ని ఆమోదించకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రొటెం స్పీకర్ మహతాబ్‌కు సహకరించేందుకు ప్యానెల్‌లోని తమ సభ్యులు సిద్ధంగా లేరని విపక్ష నేతలు ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…