Kota: కోటాలో ఆగని విద్యార్ధుల ఆత్మహత్యలు.. జేఈఈకి ప్రిపేరవుతున్న మరో విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కలను నెరవేర్చుకునేందుకు కోచింగ్ హబ్ కోటాకు వెళ్తున్న విద్యార్ధులు చదువుల ఒత్తిగి తట్టుకోలేక వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో జేఈఈ విద్యార్ధి తనువు చాలించాడు...
కోటా, నవంబర్ 4: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన కోటాలో ఇప్పటికే అనేక మంది విద్యార్ధులు చదువుల ఒత్తిడి కారణంగా తనువు చాలించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.
అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఐఐటీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కి సిద్ధమవుతున్న 16 ఏళ్ల విద్యార్థి ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని కోటాలో శవమై కనిపించాడు. ఇది ఆత్మహత్యా లేక సహజ మరణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. విద్యార్ధి ఆదివారం రాత్రి డిన్నర్ చేసిన తర్వాత తన గదికి వెళ్ళాడు. అయితే, ఏం జరిగిందో తెలియదుగానీ తెల్లారేసరికి తన గదిలో విగత జీవిగా కనిపించాడు. గమనించిన తల్లి విద్యార్ధిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా.. అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి) యోగేష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన విద్యార్థి బీహార్‌కు చెందినవాడని, గత ఏడాది కాలంగా తల్లితో కలిసి కోటలోని తలవండి ప్రాంతంలో ఓ అద్దె గదిలో ఉంటూ చదువుకుంటున్నాడని తెలిపారు.
పోస్టుమార్టం తర్వాత విద్యార్ధి మరణానికి గల కారణాన్ని నిర్ధారించగలమని శర్మ తెలిపారు. విద్యార్థి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని డీఎస్పీ తెలిపారు. గత కొన్ని రోజులుగా తన కుమారుడిలో ఎలాంటి అనుమానాస్పద ప్రవర్తనను తాను చూడలేదని తల్లి కన్నీరుమున్నీరవుతూ తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా తాజా ఘటనతో కలిపి ఈ ఏడాది కోటాలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్ధుల సంఖ్య 16కు చేరడం గమనార్హం. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు కోటాలో సూసైడ్ చేసుకున్నారు.