13 మంది విద్యార్థులపై టీచర్‌ దాష్టీకం.. ఆస్పత్రిలో చిన్నారులు.. రోడ్డెక్కి తల్లిదండ్రుల ఆందోళన..

పసివాళ్లని కూడా చూడకుండా స్కూల్‌ విద్యార్థులను అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. కర్రలతో విచక్షణా రహితంగా చితకబాదాడు.

13 మంది విద్యార్థులపై టీచర్‌ దాష్టీకం.. ఆస్పత్రిలో చిన్నారులు.. రోడ్డెక్కి తల్లిదండ్రుల ఆందోళన..
Teacher
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2022 | 9:51 PM

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. పసివాళ్లని కూడా చూడకుండా స్కూల్‌ విద్యార్థులను అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. కర్రలతో విచక్షణా రహితంగా చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లాలో చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని గుమ్లాలో పాఠశాల ఉపాధ్యాయుడు 13 మంది విద్యార్థులను కర్రలతో దారుణంగా కొట్టడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. 6వ తరగతి విద్యార్థులను కొట్టి పాఠశాలలోని తరగతి గదిలో బంధించారు. గాయపడిన 13 మంది విద్యార్థులను ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

గుమ్లాలోని సెయింట్ మైఖేల్ పాఠశాలకు చెందిన వికాస్ సిరిల్ అనే ఉపాధ్యాయుడు, 6వ తరగతి విద్యార్థులు తన ఆదేశాల మేరకు డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. అయితే విద్యార్థులను కొట్టాలని ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుడిని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేలా ఉపాధ్యాయులు మనుషులమని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. టీచర్ దాడి చేయడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 13 మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు అందాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశుతోష్ సింగ్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, విచారణ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శిశిర్ కుమార్ సింగ్ కూడా ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి