
ఉదయం రాజులా తినాలి అన్నది పాత మాట. కానీ ఉదయం 8 గంటలకే తినాలి అన్నది తాజా ఆరోగ్య సూత్రం. మనం అల్పాహారం ఏం తింటున్నాం అనే దానికంటే.. ఏ సమయానికి తింటున్నాం అనేది మన ఆరోగ్యాన్ని శాసిస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 8 గంటల ప్రాంతంలో అల్పాహారం ముగించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
రాత్రి భోజనం తర్వాత సుమారు 10 నుండి 12 గంటల సుదీర్ఘ విరామం తర్వాత శరీరం శక్తి కోసం ఎదురుచూస్తుంది. ఈ సమయంలో అల్పాహారం దాటవేసినా లేదా ఆలస్యం చేసినా శరీర జీవక్రియ మందగిస్తుంది. అల్పాహారం ఆలస్యమయ్యే ప్రతి గంటకు గుండె జబ్బుల ప్రమాదం 6 శాతం పెరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 9 గంటల తర్వాత తినేవారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, స్ట్రోక్, గుండె వైఫల్యానికి దారితీసే అవకాశాలు ఎక్కువ.
మన శరీరానికి ఒక జీవ గడియారం ఉంటుంది. ఉదయం 8 గంటలకు ఆహారం తీసుకోవడం వల్ల ఆ గడియారం సరిగ్గా పనిచేస్తుంది.
మెరుగైన జీవక్రియ: ఉదయాన్నే తినడం వల్ల క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి, దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండి, టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది.
ఏకాగ్రత: మెదడుకు అవసరమైన గ్లూకోజ్ అంది, రోజంతా ఉత్సాహంగా, ఏకాగ్రతతో పనిచేయడానికి సహాయపడుతుంది.
అల్పాహారం సరిగ్గా తీసుకోని వారిలో కేవలం శారీరక సమస్యలే కాకుండా నిరాశ, నిద్రలేమి, విపరీతమైన అలసట, దంత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేవలం సమయమే కాదు, మనం తీసుకునే ఆహారంలో పోషకాలు కూడా ఉండాలి. నిపుణుల సిఫార్సు ప్రకారం మీ బ్రేక్ ఫాస్ట్ ఇలా ఉండాలి.
ప్రోటీన్ – ఫైబర్: గుడ్లు, ఓట్ మీల్, పండ్లు, నట్స్
హెల్తీ ఫ్యాట్స్: అవకాడో లేదా గింజలు.
నివారించాల్సినవి: అతిగా టీ, కాఫీలు లేదా చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు.
మీ గుండె పదిలంగా ఉండాలన్నా, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా రేపటి నుండి మీ అల్పాహార సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్చుకోండి. గుర్తుంచుకోండి, సరైన సమయంలో తీసుకునే ఆహారం ఔషధంతో సమానం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..