Health: గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..

|

Apr 26, 2024 | 8:58 AM

గర్భిణీల్లో విటమిన్‌ డీ లోపం ఉంటే అది పుట్టబోయే పిల్లలపై స్పష్టమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విటమిన్‌ డీ లోపం ఉన్న గర్భిణీలకు పుట్టిన పిల్లలకు టైప్‌2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తాజాగా అధ్యయనంలో బయటపడింది...

Health: గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
Pregnancy
Follow us on

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం తల్లి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిపోలికలు వచ్చిటట్లు తల్లిలోని లోపాలు కూడా బిడ్డకు శాపంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఎదుర్కొనే పోషకాహార లోపం పుట్టబోయే చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

గర్భిణీల్లో విటమిన్‌ డీ లోపం ఉంటే అది పుట్టబోయే పిల్లలపై స్పష్టమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విటమిన్‌ డీ లోపం ఉన్న గర్భిణీలకు పుట్టిన పిల్లలకు టైప్‌2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తాజాగా అధ్యయనంలో బయటపడింది. వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

గర్భిణీల్లో తలెత్తే కొన్ని సమస్యల కారణంగా గర్భసంచిలో ఏర్పడే సమస్యలు పిల్లలు జీవితాంతం ఎదుర్కొనే ఇబ్బందులకు దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్‌ డి లోపం గల ఎలుకలకు పుట్టిన పిల్లల్లో ఇన్సులిన్‌ నిరోధకత ఏర్పడుతోందని, మున్ముందు ఇది మధుమేహానికి దారితీస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన కార్లోస్‌ బెర్నల్‌-మిజ్రాచీ తెలిపారు.

అయితే బిడ్డ జన్మించిన తరవ్ఆత తగినంత విటమిన్‌ డి అందిస్తే గ్లూకోజు మోతాదులు కొంతవరకు సర్దుకున్నప్పటికీ పూర్తిగా మామూలు స్థాయిలకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. గర్భాశయంలో పిండం ఎదుగుతున్నప్పుడు విటమిన్‌ డి లోపం మూలంగా ఒకరకం రోగనిరోధక కణాలు తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింటున్నాయని చెబుతోన్న పరిశోధకులు మధుమేహం ముప్పు పెరగడానికి ఇదే కారణమని చెబుతున్నారు. కాబట్టి గర్భం ధరించినప్పుడు తగినంత విటమిన్‌ డి లోపం తలెత్తకుండా, ఉదయం కాసేపు ఎండలో ఉండడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే డీ విటమిన్‌ లభించే ఆహారాన్ని సైతం డైట్‌లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..