అల్లూరి సీతారామరాజు జిల్లాలో శ్రీతకాలం అందాలు కనుల విందు చేస్తున్నాయి. ఓ వైపు ఉష్ణోగ్రతలు మినుములూరు 10.. పాడేరు 12 డిగ్రీలుగా నమోదయ్యాయి.ఏజెన్సీలోని అనేక ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. వంజంగి మేఘాల కొండకు తెల్లవారి జాము నుండి పర్యాటకులు క్యూ కట్టారు. అంతేకాదు అరకులోయ కు పర్యాటకులు పోటెత్తారు. మాడగడ మేఘల వ్యూ పాయింట్ జనసంద్రంగా మారింది . వీకెండ్ కావడంతో భారీగా రద్దీ పెరిగింది.
ఓ వైపు కార్తీక మాసం మరోవైపు వరస సెలవు రోజులు కావడంతో మాడగడ మేఘసంద్రంకు పర్యాటకులు భారీ ఎత్తున తరలివచ్చారు. అరకులోయ ను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. మాడగడ వ్యూ పాయింట్ వద్ద కు తెల్లవారుజామున 5 గంటల నుంచి పర్యాటకులు చేరుకుంటున్నారు. ఫోటోలతో సెల్ఫీలతో చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ పర్యటకులు ఉల్లాసంగా గడుపుతున్నారు.
హోటల్స్ లో రూమ్స్ అన్ని ముందుగానే రిజర్వ్ అయిపోవడంతో చాలామంది పర్యాటకులు తమ సొంత వాహనాల్లోనే గడపవలసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు పర్యాటకులు అధికంగా సందర్శిస్తున్న మాడగడ మేఘసంద్రాన్ని.. ఈరోజు తెల్లవారుజామున అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణ సందర్శించారు.
తెలుగు రాష్ట్రాల వారినే కాకుండా భారత దేశంలో అన్ని మూలల నుంచి అరకులోయ ను సందర్శించే వారి సంఖ్య అధికంగా ఉందని అన్నారు ఎమ్మెల్యే ఫాల్గుణ. అరకులోయకు దగ్గర్లో ఇంత అద్భుత సౌందర్యం ఉండడం మన అదృష్టం అన్నారు. ఈ వ్యూ పాయింట్ కి సంబంధించి పార్కింగ్ రహదారి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అరకులోయ సి ఐ జి డి బాబు చెప్పారు.
Reporter: Khaja
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..