Winter Tourism: శీతాకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్రాంతాలను అస్సలు స్కిప్ చేయొద్దు! బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్..

| Edited By: Anil kumar poka

Dec 28, 2022 | 6:16 PM

ముఖ్యంగా డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఆయా ప్రాంతాలలో పర్యటిస్తే ఆ ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, సరస్సుల్లో స్పష్టమైన నీరు మీ శీతాకాలాన్ని మరింత కూల్ గా మార్చేస్తాయి.

Winter Tourism: శీతాకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్రాంతాలను అస్సలు స్కిప్ చేయొద్దు! బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్..
Tour
Follow us on

భారతదేశం విభిన్న వాతావరణాల సమ్మేళనం.. ఒకచోట అధిక ఉష్ణోగ్రతలు ఉంటే, మరోచోట అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. వీటిల్లో చాలా ప్రాంతాలు పర్యాటకులకు విశేష అనుభూతినిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఆహ్లాదకర అనుభవాన్ని పొందడానికి, వింతైన అనుభూతని ఆస్వాదించడానికి అనువైన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఆయా ప్రాంతాలలో పర్యటిస్తే ఆ ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, సరస్సుల్లో స్పష్టమైన నీరు మీ శీతాకాలాన్ని మరింత కూల్ గా మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో శీతాకాలంలో పర్యటించదగ్గ బెస్ట్ ప్రాంతాలను ఇప్పుడు చూద్దాం..

అండమాన్ అందాలు.. సముద్రపు చందాలు..

పర్వతాల కన్నా సముద్రాన్ని, నీటిని ఎక్కువ ఇష్టపడే వారికి బెస్ట్ ఆప్షన్ అండమాన్. ఇక్కడి తెల్లటి బీచ్‌లలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ప్రశాంతతను ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశం ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నందున వేసవిలో ఇక్కడ చాలా వేడి, అధికంగా తేమ ఉంటుంది. అందుకనే శీతాకాలం ఈ ద్వీపాలను సందర్శించడానికి ఉత్తమ సమయం. పర్యాటకుల కోసం వాటర్ స్పోర్ట్స్‌, సెల్యులార్ జైలులో లైట్ షో ఆకట్టుకుంటుంది.

రాజస్థాన్ రాజసం చూసి తీరాల్సిందే..

రాజస్థాన్ చక్కని శిల్ప సౌందర్యం.. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ రాష్ట్రంలోని ప్రతి నగరానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదయపూర్ లో సుందరమైన సరస్సులు, జైసల్మేర్
లో ఎడారి చూడదగిన ప్రాంతాలే. అయితే వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి .. చలికాలం సందర్శనకు అనువుగా ఉంటుంది. జోధ్‌పూర్, జైపూర్, ఉదయపూర్‌లోని కోటలు , రాజభవనాల వైభవాన్ని చూసి తీరాల్సిందే. జైసల్మేర్‌లో ఎడారి క్యాంపింగ్ , పుష్కర్‌లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ను ఆస్వాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రకృతి వరప్రసాదం కేరళ..

శీతాకాలంలో మనదేశంలో తప్పక చూడవలసిన మరొక పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రాంతం కేరళ. ఇక్కడ స్పష్టమైన నీటి బీచ్‌లు, విశ్రాంతి కోరుకునే వారి కోసం బ్యాక్ వాటర్‌, వన్యప్రాణుల అభయారణ్యాలు, ప్రకృతి ప్రేమికులకు సఫారీలు, సుందరమైన హిల్ స్టేషన్‌లు ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం కేరళను సందర్శించడానికి ఉత్తమ సమయం. ఇక్కడ తప్పనిసరిగా చేయవలసిన కార్యకలాపాలలో హౌస్‌బోట్ రైడ్, పచ్చదనం మధ్య తేయాకు తోటలలో వాకింగ్, బ్యాక్ వాటర్స్ వద్ద హౌస్ బోట్ లేదా షికారా రైడ్‌లు ఉన్నాయి. అలాగే కేరళలో కథాకళి నృత్య ప్రదర్శనను చూడటం మాత్రం మర్చిపోవద్దు.

రాన్ ఆఫ్ కచ్.. మరచిపోలేని టచ్..

రాన్ ఆఫ్ కచ్‌లోని తెల్లటి ఇసుక ఎడారి దేశంలోనే ప్రసిద్ధి చెందింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో పర్యటించడానికి అనువైన సమయం. ఆ సమయంలో ఇక్కడ ఏర్పాటు చేసే రాన్ ఉత్సవ్‌కు కూడా హాజరు కావాలి. ఈ పండుగ స్థానిక వంటకాలను రుచి చూడటానికి, స్థానిక కళాఖండాలను ఆస్వాదించడానికి, షాపింగ్ చేయడానికి అనువైన సమయం. స్టార్‌లైట్ నైట్‌లో ఒంటె సవారీ తప్పనిసరిగా అనుభవించాల్సిన అనుభవం.

మేఘాలలో తేలియాడే మేఘాలయ..

దేశంలోని అందమైన ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి మేఘాలయ. సహజమైన జలపాతాలు, సరస్సులు, నదుల అందాలతో కూడిన సుందరమైన రాష్ట్రం. మేఘాలయలో పచ్చదనం అక్కడికి వచ్చే పర్యాటకులందరికీ విశేష అనుభూతినిస్తుంది. మేఘాలయలో ఉన్నప్పుడు, షిల్లాంగ్‌ని సందర్శించడం, చిరపుంజీలోని లివింగ్-రూట్ బ్రిడ్జ్‌కి హైకింగ్ చేయడం, దావ్కి స్పష్టమైన నీటిలో పడవ ప్రయాణం చేయడం వంటివి అస్సలు మిస్ కావొద్దు.

సిక్కిం అందాలలో చిక్కాల్సిందే..

చలికాలంలో తప్పక సందర్శించవలసిన మరొక ఈశాన్య రాష్ట్రం సిక్కిం. పర్వత శ్రేణులపై ఉదయపు సూర్యుడు మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాడు. సిక్కింలోని గ్యాంగ్‌టక్ ప్రాంతం ఉదయాన్నే మెరిసే కాంచనగంగా పర్వతంతో సుందరమైన అందాలతో అలంకరించబడి ఉంది. స్థానిక రుచికరమైన వంటకాలు, హైకింగ్, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ వంటివి తప్పక ఆస్వాదించాల్సిందే.

పాండిచ్చేరి.. అందాలన్నీ ఒక్కచోట చేరి..

భారతదేశంలోని పూర్వపు ఫ్రెంచ్ కాలనీ చుట్టూ సహజమైన బీచ్‌లు ఉన్నాయి. ఇది భారతదేశంలో శీతాకాలపు గొప్ప గమ్యస్థానంగా మారింది. నగరంలోని అందమైన కేఫ్‌లు, రెస్టారెంట్‌లు ఆకర్షిస్తాయి. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన అనుభవం కోసం మీరు ఆరోవిల్‌ని కూడా సందర్శించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..