Divya Dakshin Yatra
వేసవి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకునే తెలుగు వారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. తాజాగా తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలనుకునే వారి కోసం దివ్య దక్షిణ యాత్ర పేరుతో స్పెషల్ టూర్ ని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి ఆలయాలను సందర్శించవచ్చు. ఈ నెల 25వ తేదీ సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ తొమ్మిది రోజులు సాగనుంది. 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగే ఈ టూర్ కు వెళ్లాలనుకునే తెలుగు వారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌ను ఎక్కొచ్చు. ఈ నేపధ్యంలో ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలకు వెళ్తే..
- ఐఆర్‌సీటీసీ ప్రకటించిన దివ్య దక్షిణ యాత్ర ఫస్ట్ డే మే 25 వ తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలు కానుంది. మొదటి రోజు కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోల్ లో ప్రయాణీకులు ఎక్కవచ్చు.
- టూర్ లో రెండో నెల్లూర్, గూడూర్, రేణిగుంటలో పర్యాటకులు ఎక్కాల్సి ఉంటుంది.
- రేణిగుంట నుంచి రెండో రోజు తిరువన్నామలై చేరుకుంటారు. అరుణాచలం ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అనంతరం రామేశ్వరం బయలు దేరతారు. మూడో రోజు ఉదయం రామేశ్వరం చేరుకుంటారు. ఇక్కడ స్థానిక ఆలయాలను సందర్శించి రాత్రికి రామేశ్వరంలో బస చేయాల్సి ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం టిఫిన్ తిని రామేశ్వరం నుంచి మదురైకు బయలు దేరతారు. ఇక్కడ మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని.. కన్యాకుమారికి బయలు దేరి వెళ్ళాల్సి ఉంటుంది.
- ఐదో రోజు కన్యాకుమారికి చేరుకుని ఇక్కడ బస చేయాల్సి ఉంటుంది. రాక్ మెమొరియల్, గాంధీ మండపాన్ని చూడడమే కాదు.. సముద్రంలో అస్తమించే సూర్యుడి అందాలను వీక్షించి మదిలో అనుభూతులను పదిల పరచుకోవచ్చు. రాత్రికి కన్యాకుమారిలోనే బస చేయాల్సి ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం కన్యాకుమారిలో అల్పాహారం తిని త్రివేండ్రం బయలు దేరాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. కోవలం బీచ్ అందాలను వీక్షించవచ్చు.
- ఆ రోజు సాయంత్రం తిరుచిరాపల్లి బయలుదేరాల్సి ఉంది. ఏడో రోజు శ్రీరంగం చేరుకుని.. శ్రీరంగం ఆలయాన్ని, బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించాలి. ఇక్కడతో టూర్ ముగుస్తుంది.
- శ్రీ రంగం నుంచి సొంత ఊర్లకు పయనం కావాల్సి ఉంటుంది. ఎనిమిదో రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్ లో పర్యాటకులు దిగాల్సి ఉంటుంది.
- తొమ్మిదో రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దక్షిణ యాత్ర టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు:
కంఫర్ట్ క్లాస్ టికెట్ ధర రూ.28,450
స్టాండర్డ్ క్లాస్ టికెట్ ధర రూ.21,900
ఎకనమీ క్లాస్ టికెట్ ధర రూ.14,250
ఏఏ సదుపాయాలు ఉంటాయంటే..
కంఫర్ట్ క్లాస్‌కు సెకండ్ ఏసీ ప్రయాణం, స్టాండర్డ్ క్లాస్‌కు థర్డ్ ఏసీ ప్రయాణం, ఎకనమీ క్లాస్‌కు స్లీపర్ క్లాస్ ప్రయాణం అందిస్తుంది. అంతేకాదు ఎకనమీ క్లాస్ ప్రయాణీకులకు నాన్ ఏసీ గదుల్లో బస, మిగలిన ప్రయాణీకులకు ఏసీ గదుల్లో బస అందించనుంది. సైట్ సీయింగ్ కూడా ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. దివ్య దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..