AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన విహారం.. కొడైకెనాల్ టూర్ ప్యాకేజీ.. టికెట్ ధరలు, పూర్తి వివరాలు ఇవే!

IRCTC Kodaikanal Tour Package Telugu: ప్రకృతి అందాల నడుమ ఐదు రోజుల పాటు విహరించాలనుకునేవారికి IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ అందిస్తోంది. చెన్నై నుంచి కొడైకెనాల్, మదురై ప్రాంతాలను సందర్శించే ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ధరలు, ప్రయాణ షెడ్యూల్, ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోండి.

IRCTC: ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన విహారం.. కొడైకెనాల్ టూర్ ప్యాకేజీ.. టికెట్ ధరలు, పూర్తి వివరాలు ఇవే!
Irctc Kodaikanal Tour Package Telugu
Rajashekher G
|

Updated on: Nov 09, 2026 | 6:58 PM

Share

IRCTC Kodaikanal Tour Package Telugu: నిత్యం ఉరుకుల పరుగుల నగర జీవితానికి కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నారా? ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా గడపాలని, పచ్చని కొండలు, జలపాతాలు, సరస్సులను ఆస్వాదించాలని భావిస్తున్నారా? అయితే తమిళనాడులోని కొడైకెనాల్ (Kodaikanal) పర్యాటకులకు చక్కటి ఎంపిక. ‘ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్’గా పేరుగాంచిన ఈ అందమైన హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి పచ్చని కొండలు, అందమైన లోయలు, జలపాతాలు, చల్లని వాతావరణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి.

ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చెన్నై నుంచి కొడైకెనాల్, మదురై ప్రాంతాలను సందర్శించే ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, స్థానిక రవాణా, సందర్శనీయ ప్రాంతాల పర్యటన ఇందులో భాగంగా ఉంటాయి.

ప్యాకేజీ వివరాలు

ఈ టూర్ ప్యాకేజీ పేరు చెన్నై కొడైకెనాల్ ప్యాకేజీ. ప్రతి గురువారం ఈ పర్యటన ప్రారంభమవుతుంది. 2026 సెప్టెంబర్ నుంచి 2027 మార్చి వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో కొడైకెనాల్, మదురై ప్రాంతాలను సందర్శించవచ్చు. పర్యాటకులకు స్టాండర్డ్, కంఫర్ట్ అనే రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో 3AC ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

స్టాండర్డ్ ప్యాకేజీ ధరలు:

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.24,300
  • ఇద్దరికి (ట్విన్ షేరింగ్): రూ.13,280
  • ముగ్గురికి (ట్రిపుల్ షేరింగ్): రూ.10,480
  • 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో: రూ.7,340
  • బెడ్ లేకుండా: రూ.6,420

కంఫర్ట్ ప్యాకేజీ ధరలు:

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.25,730
  • ఇద్దరికి (ట్విన్ షేరింగ్): రూ.14,710
  • ముగ్గురికి (ట్రిపుల్ షేరింగ్): రూ.11,910
  • 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో: రూ.8,770
  • బెడ్ లేకుండా: రూ.7,850

ఐదు రోజుల టూర్ షెడ్యూల్ ఇదే!

  1. మొదటి రోజు: చెన్నై తాంబరం రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8:17 గంటలకు 20635 అనంతపురి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం ప్రారంభమవుతుంది.
  2. రెండో రోజు: తెల్లవారుజామున 3:25 గంటలకు మదురై చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొడైకెనాల్‌కు వెళ్తారు. మధ్యాహ్నం హోటల్‌లో చెక్‌ఇన్ అయిన తర్వాత గ్రీన్ వ్యాలీ వ్యూ, కోకర్స్ వాక్, పిల్లర్ రాక్స్ ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి కొడైకెనాల్‌లో బస చేస్తారు.
  3. మూడో రోజు: అప్పర్ లేక్ వ్యూ, బోటింగ్, పైన్ ఫారెస్ట్, గుణ గుహలు, మ్యూజియాన్ని సందర్శించవచ్చు. సాయంత్రం పర్యాటకులకు విశ్రాంతి సమయం ఉంటుంది.
  4. నాలుగో రోజు: ఉదయం 9 గంటలకు హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి మదురైకి బయలుదేరుతారు. మార్గమధ్యంలో సిల్వర్ క్యాస్కేడ్ జలపాతాన్ని సందర్శిస్తారు. అనంతరం మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయం, తిరుమలై నాయకర్ మహల్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు మదురై రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 9:45 గంటలకు 20636 అనంతపురి ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
  5. ఐదో రోజు: ఉదయం 4:48 గంటలకు చెన్నై తాంబరం రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?

రైలు ప్రయాణం, కొడైకెనాల్‌లో రెండు రాత్రుల హోటల్ వసతి, స్థానికంగా తిరిగేందుకు ప్రత్యేక వాహనం, షెడ్యూల్ ప్రకారం అన్ని సందర్శనీయ ప్రాంతాల పర్యటన, ప్రయాణ బీమా, జీఎస్టీ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. అయితే భోజన ఖర్చులు, రైలు ప్రయాణంలో క్యాటరింగ్, స్మారక కట్టడాల ప్రవేశ రుసుములు, బోటింగ్ వంటి కార్యకలాపాల ఛార్జీలు, వ్యక్తిగత ఖర్చులు, గైడ్ సేవలు ప్యాకేజీలో ఉండవు. 59 ఏళ్లు పైబడిన వారికి ప్రయాణ బీమా కూడా అదనంగా వర్తిస్తుంది.

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల పాటు ఆహ్లాదకరమైన పర్యటన చేయాలనుకునేవారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశం. అయితే రైలు సమయాలు, హోటల్ వసతి, పర్యటన షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున బుకింగ్‌కు ముందు IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు, అందుబాటులో ఉన్న తేదీలు, ధరలను పరిశీలించాలి.

Follow Us