వివిధ ప్రాంతాలను సందర్శించాలనుకునే వారు, సాహస కార్యక్రమాలను ఇష్టపడే వారు ట్రెక్కింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కష్టసాధ్యమైన కొండలనూ ఎక్కేందుకూ ఉత్సాహం కనబరుస్తుంటారు. సాహసోపేతమైన క్రీడల్లో ట్రెక్కింగ్ ఒకటి. ట్రెక్కింగ్ చేయడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి థ్రిల్ తో పాటు, మర్చిపోలేని జ్ఞాపకాలనూ సొంతం చేసుకోవచ్చు. మన దేశంలో ట్రెక్కింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలుగా చాలానే ఉన్నాయి. తూర్పుకనుమల నుంచి మొదలుకుని పశ్చిమ కనుమల వరకు, హిమాలయాలు, వింధ్య ఆరావళి పర్వతాలు.. ఇలా ఒక్కటేమిటి చాలానే ఉన్నాయి. అయితే, పచ్చదనంతో కూడుకున్న సుందరమైన ప్రకృతి అందాల వెనుక కనిపించని ప్రమాదాలూ పొంచి ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ట్రెక్కింగ్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే నిర్ణయించుకోవడం చాలా అవసరం. సాహసయాత్రకు సిద్ధమైన ట్రెక్కింగ్ ప్రియులు పర్వతాలపైకి వెళ్లే సమయంలో పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ప్రాంతాల్లో రాళ్లపై నాచు పట్టి ఉండడం వల్ల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రెక్కింగ్ చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు చాలా దృఢంగా ఉండాలి. ట్రెక్కీలు వెళ్లే దారి మధ్యలో ఎండిపోయిన చెట్లు, రాళ్లు, విష పురుగులు, సర్పాలు, కీటకాలు, తేళ్లు ఉంటాయి. కాబట్టి సౌండ్ వచ్చే షూస్ ను వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అలికిడికి దూరంగా వెళ్లిపోతాయి.
సాధారణంగా చాలా మంది ట్రెక్కింగ్ చేసే విషయంలో నీరు, ఆహారం విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాటిని మోసుకుని పైకి ఎక్కాలంటే కాస్త కష్టంతో కూడుకున్నదే. అలా అని వాటిని కిందనే వదిలేసి వెళ్లకూడదు. వెంట తీసుకెళ్లాలి. ఎందుకంటే కొండ పైకి ఎక్కుతున్న సమయంలో మనకు దాహం అధికంగా వేస్తుంటుంది. అలాంటి సమయాల్లో నీరు అందుబాటులోకి లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లగేజ్ కూడా చాలా ఎక్కువగా కాకుండా అవసరమైన వాటిని మాత్రమే తీసుకువెళ్లాలి. అనవసరమైన వస్తువులను వీలైనంత వరకూ తీసుకువెళ్లకపోవడమే మంచిది. అధిక లగేజ్ కారణంగా గమ్య స్థానం చేరుకోకముందే మీ శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.
ఎండింగ్ పాయింట్ చేరుకునేవరకూ వెళ్లే మార్గం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగిన అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల రూట్ మ్యాపును తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మారు మూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఉంటాయి. టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా మాన్యువల్ మ్యాప్‌ను ఫాలో అవ్వాలి. ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవారు బృందాలుగా విడిపోవాలి. అలా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించేవారిని అనుసరించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బృందంలో చర్చలు జరుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ట్రెక్కింగ్ లో మంచి అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని టూరిజం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి