
హోలీ రంగుల కేళీ.. ఉద్యోగాల టెన్షన్స్.. కుటుంబ బాధ్యతల భారం.. ఉరుకు పరుగుల జీవితాన్ని కాసేపు పక్కన పెట్టి ఉత్సాహంగా అందిరతో కలిసి రంగుల ప్రపంచంలో తేలియాడటమే హోలీ. ఈ పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిలో ఉత్సహం ఉరకలేస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ రంగుల పండుగను జరుపుకుంటారు. అయితే అవి సహజసిద్ధమైన రంగులైతే పర్వాలేదు. అదే ఒకవేళ రసాయన రంగులతో ఎవరైనా హోలీ ఆడితే అది మీ కళ్ళలో పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే సరదా పండుగ కాస్త విషాదం అయిపోతుంది. అందుకనే కళ్లను సంరక్షించుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ హోలీ వేళ మీ కళ్లను సంరక్షించే కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం.. ఓ సారి చదవండి..
మార్కెట్‌లో విక్రయిస్తున్న హోలీ రంగులలో చాలా వరకు పాదరసం, ఆస్బెస్టాస్, సిలికా, మైకా, సీసం వంటి ప్రమాదకర రసాయనాలు ఉండవచ్చు. ఇవి మానవ చర్మం, కళ్లకు చాలా ప్రమాదకరమైనవి. కళ్లతో ఈ రసాయనాల ప్రతిచర్య చికాకు, ఎరుపు, అలెర్జీల వంటి లక్షణాలకు దారి తీస్తుంది. కొన్నిసార్లు, కంటికి తీవ్రమైన రసాయన ఘాటు తగిలి కూడా శాశ్వత దృష్టిని కోల్పోవచ్చు. ఈ రంగులకు బదులుగా పసుపు, వేప, గంధం, పువ్వులు మొదలైన సహజ పదార్థాలతో తయారు చేసిన సంప్రదాయ సహజ రంగులను ఉపయోగించడం మంచిది.
రంగులతో ఆడుకోవడానికి బయటికి వెళ్లే ముందు ముఖంపై ముఖ్యంగా కళ్ల చుట్టూ ఫేస్ క్రీమ్ లేదా కొబ్బరి నూనె పూయడం మంచిది. రంగు కళ్ళలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. ఇలా రంగులను వదిలించుకోవడాన్ని సులభం అవుతుంది. ఇలా చేయడం ద్వారా చర్మం సున్నితమైన భాగాలకు రంగులు అంటుకోకుండా నిరోధించవచ్చు.
హోలీ రంగులలో తడిసినప్పుడు ముఖం, కళ్లను తాకడం మానుకోవాలి. చేతులు మురికిగా ఉన్నప్పుడు, చేతుల్లోని రంగు కళ్లకు వ్యాపిస్తోంది. ఇది ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఒకవేళ, హోలీ రంగు కళ్లలోకి ప్రవేశిస్తే, రుద్దకండి. కొన్నిసార్లు, మురికి చేతులతో కళ్లను రుద్దడం వల్ల కార్నియల్ రాపిడి లేదా కార్నియాపై గీతలు పడవచ్చు. ఇది కంటి ఇన్ఫెక్షన్ల కూడా కారణమవుతుంది.
హోలీ వేడుక ముగిసిన తర్వాత, చల్లటి నీటితో కళ్లను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత నిపుణులు సూచించిన కంటి చుక్కలతో కళ్లలో వేయాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల శాశ్వత కంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.
హోలీ రంగు కళ్లలోకి పడితే, కళ్లలోని రంగు పోవాలంటే, చల్లని శుభ్రమైన నీటితో కళ్లను బాగా కడుక్కోవాలి. ఎక్కువ సేపు కళ్లను నీళ్లతో కడుక్కోవడం వల్ల కళ్లకు ఉపశమనం కలుగుతుంది. అయినా సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..