చాలా మందికి ప్రయాణం చేసే సమయంలో పొట్ట గడ బిడలాంటి సమస్యలు వేధిస్తుంటాయి. ప్రయాణం ఇలా మొదలైందో లేదో అజీర్ణం, డయేరియా వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, కలుషితమైన నీటిని తాగడం, నిద్రలేకపోవడం వంటి కారణాలు ఈ సమస్యలకు కారణాలుగా చెప్పొచ్చు. అయితే ప్రయాణం చేసే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రయాణం చేసే సమయంలో ఎదురయ్యే పొట్ట సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
* ప్రయాణం చేసే సమయాల్లో ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది. ఈ కారణంగా దేనిని పడితే దానిని తాకాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. కరోనా తర్వాత సహజంగానే అందరికీ ఈ అలవాటు అబ్బింది. ప్రయాణం సమయంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం.
* ఇక ప్రయాణాల్లో తీసుకునే నీటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగకుండా వీలైనంత వరకు ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్‌ను తీసుకోవాలి. ఇంటి నుంచి తెచ్చుకునే నీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
* ఇక ప్రయాణం చేసే ముందు వీలైనంత వరకు ఆహారం తీసుకోకపోవడమే ఉత్తమం. వీలైనంత వరకు లిక్విడ్ ఫుడ్‌నే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఓఆర్‌ఎస్ వంటి డ్రింక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.
* ప్రయాణానికి ముందు రోజు రాత్రి కూడా ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. సాధారణంగా ప్రయాణానికి ముందు రోజు ఆతృతగా నిద్ర తగ్గుతుంది. ఇది కూడా అజీర్తి సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..