Cold Water: చల్ల నీళ్లు తాగితే బరువు పెరుగుతారా? నిపుణులు ఏమంటున్నారంటే..?
వేసవిలో ఉపశమనం కోసం చల్లని నీటిని ఆశ్రయించడం సాధారణం. అయితే, చాలా మంది వాతావరణం, సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లనీళ్లే తాగుతుంటారు. ఇంటర్నెట్ లో తాజాగా ఓ ప్రచారం జరుగుతోంది. చల్ల నీరు తాగితే బరువు పెరుగుతారని అంటున్చానారు. ఈ వాదనలో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే, నిపుణులు ఏమి చెబుతున్నారో చూడండి.

వేసవి కాలంలో చల్లని నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారనే నమ్మకం చాలామందిలో ఉంది. ఈ అపోహను ముంబైకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు అమితా గాద్రే ఖండించారు. నీరు ఏ ఉష్ణోగ్రతలో ఉన్నా దానికి కేలరీలు ఉండవు కాబట్టి శరీర బరువును ప్రభావితం చేయదని ఆమె స్పష్టం చేశారు. సరైన పద్ధతిలో నీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం, కానీ నీరు వేడిగా ఉందా, చల్లగా ఉందా అన్న విషయం పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.
శరీరంలోని ప్రతి వ్యవస్థ సరిగా పనిచేయడానికి నీరు కీలకం. నీరు కణాలకు పోషకాలను ఆక్సిజన్‌ను చేరవేయడానికి, మూత్రాశయం నుండి బ్యాక్టీరియాను బయటకు పంపడానికి, జీర్ణక్రియ సజావుగా సాగడానికి, రక్తపోటును నిర్వహించడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి దోహదపడుతుంది. రోజుకు ఎంత నీరు తాగాలనేది వ్యక్తి జీవనశైలి, వారు నివసించే ప్రాంత వాతావరణం, ఆరోగ్య పరిస్థితులు, శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు రోజుకు 6 నుంచి 8 గ్లాసుల ద్రవ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
చల్లటి నీరు తాగితే బరువు పెరుగుతారనే వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు. నిజానికి నీటి ఉష్ణోగ్రత బరువుపై ఎలాంటి ప్రభావం చూపదు. నీరు తక్కువగా తాగితే శరీరం డీహైడ్రేషన్కు గురై అలసట, బలహీనతలకు కారణమవుతుంది. ఇది జీవక్రియలను నెమ్మదిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు లేదా బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారు సరిపడా నీరు తాగడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే జీవక్రియలు మెరుగై, శరీరం సరైన రీతిలో పనిచేస్తుంది. వేడి నీరు తాగితే బరువు తగ్గుతారనే మరొక అపోహ కూడా ప్రచారంలో ఉంది. నీటి ఉష్ణోగ్రతలో ఎలాంటి తేడా బరువును ప్రభావితం చేయదని నిపుణులు పునరుద్ఘాటించారు. శరీరానికి అవసరమైనంత నీరు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. ఈ అపోహలు నిజం కాదని తెలుసుకుని, సంకోచం లేకుండా మీకు నచ్చిన ఉష్ణోగ్రతలో నీరు తాగవచ్చు.




