Moral Story: బడాయి కప్ప కథ.. ఇతరులతో పోల్చుకోవడం ప్రమాదకరం..!

నీతి కథలు నైతిక విలువలతో పాటు జీవిత పాఠాలను నేర్పుతాయి. అలాంటి నీతి కథల్లో ఒకటి ‘బడాయి కప్ప’. ఈ నీతి కథ అహంకారం, అత్యాశ, లేని గొప్పలకు పోవడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. ఇతరులతో అనవసరంగా పోల్చుకోవడం కంటే మన సామర్థ్యాన్ని గుర్తించి వినయంతో ముందుకు సాగాలని ఈ పంచతంత్ర కథ విలువైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది.

Moral Story: బడాయి కప్ప కథ.. ఇతరులతో పోల్చుకోవడం ప్రమాదకరం..!
Boastful Frog Story

Updated on: Jul 04, 2026 | 5:26 PM

Telugu Moral Strory: నీతి కథలు మన జీవితానికి విలువైన పాఠాలను నేర్పుతాయి. వాటిలో పంచతంత్ర కథలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కథల్లో ఒకటే “బడాయి కప్ప” కథ. ఇతరులతో పోల్చుకోవడం, లేని గొప్పలకు పోవడం, అత్యాశతో ప్రవర్తించడం ఎంత ప్రమాదకరమో ఈ కథ చక్కగా వివరిస్తుంది. ఇతరులను చూసి అసూయపడకుండా, మన సామర్థ్యాన్ని గుర్తించి, వినయంతో జీవించాలని ఈ నీతి కథ స్పష్టం చేస్తుంది.

కథ

ఒకప్పుడు తిమ్మాపురం అనే గ్రామం చివర్లో ఉన్న అడవిలో అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సులో ఎన్నో కప్పలు నివసించేవి. ఒక రోజు సరస్సు పక్కనే ఒక ఆవు ప్రశాంతంగా గడ్డి మేస్తోంది. అదే సమయంలో కొన్ని చిన్న కప్పలు సరస్సు నుంచి బయటకు వచ్చి ఎండలో ఆడుకుంటున్నాయి. అల్లరి చేస్తూ గెంతుతున్న ఒక చిన్న కప్ప అనుకోకుండా ఆవు దగ్గరకు వెళ్లింది. ఆవు కదులుతున్న సమయంలో అది దాని కాలి కింద పడటంతో అక్కడికక్కడే చనిపోయింది. మిగతా కప్పలు భయంతో వణికిపోతూ వెంటనే నీటిలోకి దూకి తమ తల్లి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాయి.

అమ్మా! బయట మేమెప్పుడూ చూడని అంత పెద్ద జంతువు ఉందని ఆశ్చర్యంగా చెప్పాయి. పిల్ల కప్పల మాటలు విన్న తల్లి కప్పకు అహంకారం, బడాయి ఎక్కువయ్యాయి. తాను ఎంతో గొప్ప అనే భావన కలిగింది. కొద్దిగా నీరు తాగి.. అక్కడ కనిపించింది అంత పెద్దదా? ఇంత ఉంటుందా? అంటూ తన శరీరాన్ని కొద్దిగా ఉబ్బించింది. కాదమ్మా..అది ఇంకా పెద్దదని పిల్ల కప్పలు చెప్పడంతో.. తల్లి కప్పకు పౌరుషం మరింత పెరిగింది.

ఇవి కూడా చదవండి

మళ్లీ తల్లి కప్ప ఇంకాస్త నీళ్లు తాగి తన పొట్టను మరింత ఉబ్బిస్తూ..ఇప్పుడు అంత పెద్దదా? అని అడిగింది. పిల్ల కప్పలు మళ్లీ కాదమ్మా.. ఆ జంతువు ఇంకా పెద్దదని చెప్పాయి. ఎలాగైనా ఆ జంతువుకంటే తానే పెద్దదిగా కనిపించాలని తల్లి కప్ప మొండిగా ప్రయత్నించింది. తన శరీరాన్ని నీరు తాగుతూ మరింత ఉబ్బిస్తూ చివరకు పొట్ట పగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

నీతి

ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ఇతరులతో అనవసరంగా పోల్చుకోవడం, లేని గొప్పలకు పోవడం, మన సామర్థ్యాన్ని మించి నిరూపించుకోవాలని ప్రయత్నించడం చివరికి నష్టానికే దారితీస్తుంది. అత్యాశ, అహంకారం, బడాయి మనిషిని పతనం వైపు నడిపిస్తాయి. వినయం, ఆత్మవిశ్వాసం, తన పరిమితులను తెలుసుకుని ముందుకు సాగడం మంచిది.

Also Read: దుష్టులతో వాదనలు వద్దు… దూరంగా ఉండటమే తెలివి!

Follow Us