ఆరోగ్యంగానే ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం. ఏ పని అయినా చేయగలం. అందుకే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, వర్షాకాలం, శీతాకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఔట్‌డోర్ వ్యాయామలు చేయడం, గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఆస్కారం ఉంది. అందుకే.. వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వ్యాయామం చేయడానికి అనువైన సమయాన్ని ఎంచుకోవాలి. సాయంకాలం గానీ, ఉదయం వేళ గానీ వ్యాయామం కోసం
సరైన సమయం చూసుకుని వెళ్లాలి. తద్వారా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదయం 9 గంటల ముందే వ్యాయామం చేయాలి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వెళితే మంచిది. ఈ సమయాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి.
వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు.. శరీరం నుండి చాలా చెమట బయటకు వస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. శరీరంలో నీటికొరత ఏర్పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తగినంత నీరు తాగాలి. ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే బదులు.. నీళ్లు తాగితే మేలు జరుగుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. ఇందులో కొంత తేనె కలుపుకుని కూడా తాగొచ్చు. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయొద్దు. వర్కవుట్ సమయంలో చాలా చెమట పడుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా భారీగా పెరుగుతంది. అలాంటి సమయంలో స్నానం చేయడం వల్ల శరీరంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చిన తరువాత స్నానం చేయాలి.
వ్యాయామం సమయంలో శరీరంలో శక్తి తగ్గుతుంది. దీని వల్ల ఎనర్జీ కోసం చాలా మంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. కానీ, ఎనర్జీ డ్రింక్స్‌లో గ్లూకోజ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. వీటికి బదులుగా సాధారణ నీటిని తాగొచ్చు.
వేసవిలో వదులుగా, లేత రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. దీని కారణంగా చర్మానికి గాలి తగులుతుంది. చెమట ఆరిపోతుంది. బిగుతుగా ఉండే, ముదురు రంగు దుస్తులను ధరిస్తే విపరీతమైన వేడి కలుగుతుంది. చికాకుగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..