Success Story: వినికిడి శక్తి లేకపోయినా సొంతంగా చదువుకుని 4 నెలల్లోనే సివిల్స్ క్రాక్ చేసిన సౌమ్య శర్మ..

ఎటువంటి పరిస్థితులు, అడ్డకుంకులు ఎదురైనా కృషి పట్టుదల ఉంటే చాలు మనం నిర్దేశించుకున్న లక్షాన్ని చేరుకోవడానికి అని నిరూపించి.. నేటి యువతకు స్పూర్తిగా నిలిచారు ఐఏఎస్ అధికారిణి సౌమ్య శర్మ. అది కూడా కేవలం నాలుగు నెలలు చదువుకుని మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. ఢిల్లీ నివాసి సౌమ్య శర్మ 16 సంవత్సరాల వయసులో అకస్మాత్తుగా తన వినికిడి శక్తిని కోల్పోయారు. అయినా సరే ఆమె చదువు మీద ఇష్టాన్ని వదులుకోలేదు. సంకల్పాన్ని సదలించలేదు. సౌమ్య ఇంట్లోనే ఉండి.. UPSCకి సిద్ధం కావడం ప్రారంభించారు.

Success Story: వినికిడి శక్తి లేకపోయినా సొంతంగా చదువుకుని 4 నెలల్లోనే సివిల్స్ క్రాక్ చేసిన సౌమ్య శర్మ..
Success Story Ias Saumya Sharma

Updated on: Jul 28, 2025 | 4:12 PM

మన దేశంలో UPSC పరీక్షను అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణిస్తారు. చాలా పోటీ ఉంటుంది. దేశంలోనే అత్యుత్తమ సేవలను అందించేందుకు లక్షలాది మంది అభ్యర్థులు ఈ పోటీ పరీక్షకు హాజరవుతారు. ఇందులో కొంతమంది మాత్రమే విజయం సాధించగలుగుతారు. కొంతమంది విజయగాథ ఇతర అభ్యర్థులకు ప్రేరణగా మారుతుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన కథ IAS సౌమ్య శర్మది. అకస్మాత్తుగా వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయిన తర్వాత కూడా దైర్యాన్ని కోల్పోలేదు.. సౌమ్య అద్భుతమైన ర్యాంకుతో దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

దేశంలోని అత్యంత ప్రసిద్ధ మహిళా IAS అధికారిణులు అనగానే తప్పని సరిగా IAS సౌమ్య శర్మ పేరు కూడా వినిపిస్తుంది. ఆమె 2017 సివిల్ సర్వీస్ పరీక్షలో 9వ ర్యాంక్ సాధించడం ద్వారా ఉత్తీర్ణురాలయ్యారు. సౌమ్య IAS అధికారిణి అయ్యేందుకు చేసిన UPSC ప్రయాణం పోరాటాలతో నిండి ఉంది. సౌమ్య శర్మ ఢిల్లీకి మహిళ. ఆమె తన మొత్తం విద్యను ఢిల్లీలోనే పూర్తి చేశారు. సౌమ్య తండ్రి అశోక్ శర్మ, తల్లి లీనా శర్మ వృత్తిరీత్యా వైద్యులు. అందుకే సౌమ్య చిన్నతనం నుంచి ఇంట్లో వాతావరణం చాడువుతోనే నిండి ఉంది.

16 సంవత్సరాల వయసులో వినికిడి శక్తి కోల్పోయిన సౌమ్య
ఐఏఎస్ సౌమ్య శర్మ 16 సంవత్సరాల వయసులో తన వినికిడి శక్తిని కోల్పోయారు. అయినా ఆమె తన ఆశ వదులుకోలేదు.. ఐఏఎస్ కావాలనే తన కలను సజీవంగా ఉంచుకున్నారు. దానిని నెరవేర్చుకుని నేడు IAS అధికారిణిగా ప్రజలకు సేవలు చేస్తున్నారు. సౌమ్య పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత నేషనల్ లా స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుని లా డిగ్రీ పట్టాని పొందారు. ఆమె లా చదువుతున్న సమయంలోనే ఎలాగైనా సరే యుపిఎస్‌సి ఉత్తీర్ణులై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

నాలుగు నెలల సన్నద్ధత తర్వాత విజయం

IAS సౌమ్య శర్మ కేవలం 4 నెలల్లోనే IAS ప్రిలిమ్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. ఈ పరీక్షలో ఆమె దేశంలో 9వ ర్యాంకు సాధించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత 2017 సంవత్సరంలో UPSC పరీక్ష రాయాలని నిర్ణయించుకుని … మొదటి ప్రయత్నంలోనే IAS అయ్యే ఘనతను సాధించింది. తాను ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయినట్లు.. రోజుకి 10-15 గంటలు చదివేదానని చెప్పారు సౌమ్య. సివిల్ సర్వీస్ మెయిన్ పరీక్ష సమయంలో కూడా అనారోగ్యం బారిన పడ్డారు. ఆమెకు ఒక రోజుకి మూడు సార్లు సెలైన్ ఇవ్వాల్సి పరిస్థితికి కూడా వచ్చింది. అయినా సరే తన కష్టాన్ని నమ్ముకుని తెలివి తేటలతో UPSCని క్రాక్ చేసి చరిత్ర సృష్టించింది సౌమ్య,

స్వీయ అధ్యయనం ఆధారంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామనే నమ్మకం ఉంటే.. కోచింగ్ అవసరం లేదని సౌమ్య శర్మ నమ్ముతారు. అయితే ఎవరికైనా UPSC ఎలా రాయాలి అనే విషయంలో మార్గదర్శకత్వం అవసరమైతే.. అప్పుడు కోచింగ్ తీసుకోవచ్చని చెబుతారు. కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ స్వశక్తిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కోచింగ్‌లో చేరిన తర్వాత కూడా సొంతంగా ప్రిపేర్ అయ్యడం చాలా అవసరం ఆమె చెబుతారు. ఎవరైనా సరే ఖచ్చితంగా షెడ్యూల్‌ని అనుసరిస్తూ.. శ్రద్ధగా చదువుకుంటే UPSCలో విజయం సాధించడం తధ్యం అని నేటి యువతకు చెబుతారు సౌమ్య.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..