
నోటి దుర్వాసన అనేది చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం, కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యల వల్ల ఇది వస్తుంది. ప్రధానంగా దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను విడుదల చేసే బ్యాక్టీరియా వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. నోటి దుర్వాసనను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, మీ శ్వాసను తాజాగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
ఫలకం నాలుగు నుండి పన్నెండు గంటల్లో ఏర్పడటం ప్రారంభమవుతుంది. కాబట్టి రోజూ రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయడం చాలా ముఖ్యం. మీ దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలను తొలగించడానికి తప్పనిసరిగా ఫ్లాస్ చేయండి. నాలుకపై పేరుకుపోయే బ్యాక్టీరియా కూడా దుర్వాసనకు కారణమవుతుంది. మీ బ్రష్ వెనుక భాగంలో ఉన్న రబ్బరు బ్రష్ లేదా నాలుక స్క్రాపర్‌ను ఉపయోగించి మీ నాలుకను శుభ్రపరచడం మర్చిపోవద్దు.
ప్రతి భోజనం తర్వాత మీ నోటిని మౌత్ వాష్‌తో శుభ్రం చేసుకోవడం వల్ల మీ నోరు తాజాగా ఉంటుంది. మౌత్ వాష్‌కు శక్తివంతమైన ప్రత్యామ్నాయం కూడా ఉంది అదే బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాను సమర్థవంతంగా చంపి, దుర్వాసనను తొలగిస్తుంది.
నోరు పొడిబారడం కూడా దుర్వాసనకు ఒక ప్రధాన కారణం. లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. రోజు పొడవునా పుష్కలంగా నీరు త్రాగడం వల్ల మీ నోరు తేమగా, శుభ్రంగా ఉండి, బ్యాక్టీరియా పేరుకుపోకుండా నిరోధిస్తుంది. నిరంతరంగా నోరు పొడిబారడం సమస్య కొనసాగితే అది ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
భోజనం తర్వాత సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా సోంపు గింజలను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సోంపు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా దాని సహజ సువాసన వల్ల మీ శ్వాసను తక్షణమే తాజాగా మారుస్తుంది. ఈ సాధారణ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీరు నోటి దుర్వాసన సమస్యను నివారించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఇతరులతో మాట్లాడవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..