మగువలు అందాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులోనూ ముఖం కాంతివంతంగా, మచ్చలు లేకుండా చేయడానికి అనేక రకాల రెమెడీస్‌ని అనుసరిస్తుంటారు. కానీ చర్మానికి ఇలా ప్రతిదీ అప్లై చేసే ముందు వాటి వల్ల ఎదురయ్యే లాభాలేకాదు దుష్ర్పభావాలు కూడా తెలుసుకోవాలి. ఇందులో నిమ్మకాయ ముఖ్యమైనది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే ముఖానికి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిమ్మకాయను ముఖానికి ఎల్లప్పుడూ నేరుగా అప్లై చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే చర్మం పాడయ్యే అవకాశం ఎక్కువట. కాబట్టి ఇది ఎలాంటి చర్మ సమస్యలను కలిగిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
నిమ్మకాయలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సంబంధిత సమస్యలను నయం చేసే సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అయినప్పటికీ దాని ఆమ్ల లక్షణాల కారణంగా చర్మానికి నేరుగా అప్లై చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగిస్తుంది.
నిమ్మకాయను నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై పొక్కులు ఏర్పడతాయి. అందుకే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మకాయను నేరుగా అప్లై చేయడం మానుకోవాలి. లేదంటే చర్మంపై వాపు, దురద, మంట, ఎర్రబడడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలను తేలికగా తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. బదులుగా దీనికి సున్ని పిండి, ముల్తానీ మిట్టి, గ్లిజరిన్, కొబ్బరి నూనె, అలోవెరా జెల్ మొదలైనవి కలిపి అప్లై చేయాలి.
నిమ్మకాయను నేరుగా చర్మానికి రాసుకుంటే చర్మం చాలా సున్నితంగా మారుతుంది. దీంతో సూర్యరశ్మికి చర్మం బహిర్గతం చేసినప్పుడు, వేగంగా వడదెబ్బకు గురవుతుంది. ఇది హైపర్పిగ్మెంటేషన్‌కు కూడా కారణం అవుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని నేరుగా చర్మంపై రుద్దకూడదు.
నిమ్మకాయలో ఆమ్లతత్వం అధికంగా ఉంటుంది. కాబట్టి, మీరు దానిని నేరుగా చర్మంపై అప్లై చేయడం వల్ల pH బ్యాలెన్స్ చెదిరిపోతుంది. దీని వల్ల చర్మంలో రకరకాల సమస్యలు మొదలవుతాయి. అలాగే ఇది చిన్న వయసులోనే ముడతలకు కారణమవుతుంది. ఇవన్నీ మొటిమల సమస్య పెంచి, తద్వారా చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడడానికి కారణం అవుతుంది.