Cancer : కరోనా వల్ల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో గత కొన్ని రోజులుగా ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం చేశారు. ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని ఇంటికే తెప్పించుకున్నారు. వ్యాయామం చేద్దామంటే పార్కులు, జిమ్‌లు మూసి ఉండటంతో ఇంట్లోనే కాలం వెళ్లదీశారు. దీంతో ఇప్పుడు చాలామంది అనారోగ్యం బారినపడుతున్నారు. కొంతమంది అధిక ఆహారం వల్ల కొలస్ట్రాల్ పెరిగి ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటే మరికొందరు ఎండ తగలక విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. తాజాగా కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు చేసిన అధ్యయనంలో శరీరానికి సరిపడ ఎండ తగలకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలిందట.
అందుకే కొవిడ్ వచ్చిన వారికి ఆస్పత్రిలో విటమిన్ డి సప్లిమెంట్లు ఇవ్వడం అందరు గమనించే ఉంటారు. వాటివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. తాజాగా విటమిన్ డి ఉత్పత్తికి కారణమైన అతినీల లోహిత కిరణాలు తగినంతగా శరీరానికి సోకకపోతే పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని శాన్‌డియాగో పరిశోధనలో తేలింది. వీరు 2017, 2018 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల్లోని వాతావరణంలో ఉండే అతినీల లోహిత కిరణాల స్థాయిని, ఆయా దేశాల్లోని పెద్దపేగు-మలద్వార క్యాన్సర్ ఉద్ధృతిని అధ్యయనం చేశారు.
పుట్టిన శిశువులు మొదలుకుని 75 ఏళ్ల వరకు ఉన్న వ్యక్తులను పరిశీలించారు. 45 ఏళ్లు పైబడ్డవారిలో యూవీబీ కిరణాలు లోపించడానికి, క్యాన్సర్ ముప్పు పెరిగేందుకు దగ్గరి సంబంధం ఉందని కనుగొన్నారు. యూవీబీ కిరణాలకు శరీరం గురికాకపోతే విటమిన్ డి కొరత ఏర్పడుతోందని, తద్వారా క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న రాఫేల్ క్యూమో ప్రకారం ‘‘మనుషులకు సోకే యూవీబీ కిరణాల్లో హెచ్చుతగ్గుల వల్ల పెద్దపేగు-మలద్వారం క్యాన్సర్ నిష్పత్తిలో భారీగా తేడాలను గుర్తించాం. ఇది ప్రాథమిక ఆధారమే అయినప్పటికీ, వయసు మీద పడ్డవారు విటమిన్ డి కొరతను నివారించుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు’’ అన్నారు.