AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Health Tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. మసకబారుతున్న చూపు! మయోపియా ముప్పు నుంచి ఇలా బయటపడండి!

కంటి సమస్యలు కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం అనే రోజులు పోయాయి. ప్రస్తుత జీవనశైలి కారణంగా అన్ని వయసుల వారు చూపు మందగించడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు గడపడం, పోషకాహార లోపం, విపరీతమైన ఒత్తిడి, పెరిగిన స్క్రీన్ టైమ్ ఇందుకు ప్రధాన కారణాలు.

Eye Health Tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. మసకబారుతున్న చూపు! మయోపియా ముప్పు నుంచి ఇలా బయటపడండి!
Eye Care Tips.jpg
Nikhil
|

Updated on: Feb 12, 2026 | 1:18 PM

Share

కంటి సమస్యలు కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం అనే రోజులు పోయాయి. ప్రస్తుత జీవనశైలి కారణంగా అన్ని వయసుల వారు చూపు మందగించడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు గడపడం, పోషకాహార లోపం, విపరీతమైన ఒత్తిడి, పెరిగిన స్క్రీన్ టైమ్ ఇందుకు ప్రధాన కారణాలు. కంటి విషయంలో స్వల్పంగా ఏదైనా అనుమానం ఉన్నా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే కంటి చూపును శాశ్వతంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

డిజిటల్ పరికరాల ప్రభావం..

స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరగడం వల్ల పెద్దలతో పాటు పిల్లలలో కూడా కంటిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. కళ్లు పొడిబారడానికి ఇదే ప్రధాన కారణం. స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి రెటీనాను దెభ్బతీస్తుంది. ఇది భవిష్యత్తులో మాక్యులర్ క్షీణత వంటి తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంది. మన ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు లోపించినప్పుడు, కళ్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోలేవు. దీనివల్ల కంటి రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా మయోపియా (దూరపు చూపు సరిగ్గా లేకపోవడం) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లలు ఇళ్లకే పరిమితం కావడంతో స్క్రీన్ చూసే అలవాటు పెరిగింది. ఆరుబయట ఆడుకోవడం తగ్గడం వల్ల రెటీనాలో సహజంగా ఉత్పత్తి కావాల్సిన డోపమైన్ తగ్గిపోతోంది. డోపమైన్ అనేది ఐబాల్ అక్షసంబంధ పొడిగింపును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లేకపోతే ఐబాల్ పొడవుగా మారి చూపు దెబ్బతింటుంది. 1990ల నుంచి నగరాల్లో నివసిస్తున్న యువకుల్లో ఈ సమస్య అధికంగా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో గ్లాకోమా లేదా రెటీనా డిటాచ్మెంట్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది.

జీవనశైలి మార్పులు ..

మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు ఇప్పుడు యువతలో డయాబెటిక్ రెటినోపతికి కారణమవుతున్నాయి. ధూమపానం, అతిగా ఎండలో తిరగడం వల్ల 40 ఏళ్ల కంటే ముందే కంటిశుక్లం వచ్చే ప్రమాదం ఉంది. సరిగ్గా నిద్రపోకపోవడం, ఒత్తిడి వల్ల కంటి ముందు చుక్కలు కనిపించడం (ఫ్లోటర్లు), కంటి రెప్పల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పెరుగుతున్న కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఒక సులభమైన మార్గం ఉంది. అదే ’20-20-20′ నియమం. ప్రతి 20 నిమిషాల స్క్రీన్ వినియోగం తర్వాత 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గి, కళ్లు పొడిబారకుండా ఉంటాయి. అలాగే పిల్లలను రోజుకు కనీసం 2 గంటలు ఆరుబయట ఆడనివ్వాలి. సూర్యరశ్మి వల్ల ఉత్పత్తి అయ్యే డోపమైన్ మయోపియా వ్యాప్తిని అడ్డుకుంటుంది. కంటి ఆరోగ్యం కోసం బచ్చలికూర, సాల్మన్ చేపలు, నట్స్ వంటి ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి నీలి కాంతి నుంచి రక్షణ ఇస్తాయి. రాత్రి సమయంలో స్క్రీన్ వినియోగం తగ్గించి, తగినంత నీరు తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండాలి. గ్లాకోమా వంటి సమస్యలు రాకుండా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ఈ జాగ్రత్తలు పాటిస్తే కంటి చూపును దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.