Prediabetes
ప్రపంచంలోని మొత్తం మధుమేహ రోగులలో 17 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. అందుకనే భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అని పిలుస్తున్నారు. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహ రోగులున్నారు. ఈ షుగర్ బాధితుల సంఖ్య 2045 నాటికి ఈ సంఖ్య 13 కోట్లు దాటబోతోంది. దీనికి కారణం మారిన ఆహారపు అలవాట్లు, అదుపులేని జీవన శైలి అని చెబుతున్నారు. ఈ వ్యాధి నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వేగంగా పెరుగుతోంది. అయితే ప్రీ-డయాబెటిస్ గురించి తెలుసుకుందాం.. ఎందుకంటే భారతదేశంలో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిక్ బాధితులున్నట్లు ICMR ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. అంటే వీరిలో డయాబెటిస్ లేదు.. అయితే వీరికి భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని అర్ధం.
ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి?
రక్తంలో చక్కెర స్థాయి సాధార స్థితి కంటే ఎక్కువగా ఉన్నా అది మధుమేహంగా పరిగణించబడదు. ప్రీ-డయాబెటిస్ బాధితులకు సరైన చికిత్స అందించకపోతే రానున్న కాలంలో ఇది మధుమేహం రూపంగా మారుతుందని చెబుతున్నారు. అయితే ప్రీ-డయాబెటిస్ ఒక వ్యాధి కాదు.. ఇది ఒక అనారోగ్య పరిస్థితి.
ప్రీ-డయాబెటిస్ లక్షణాలు
- ప్రీ-డయాబెటిక్ బారిన పడితే.. అందుకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
- తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది.
- ఎక్కువగా ఆకలిగా అనిపిస్తుంది
- చేతులు, కాళ్ళలో చక్కిలిగింతలు కలుగుతాయి
- చేతులు, కాళ్ళు తిమ్మిరి ఎక్కుతాయి
- అలసినట్లు అనిపిస్తుంది.
- కంటి చూపులో ఇబ్బంది కలుగుతుంది.
- సాధారణ బరువు కంటే ఎక్కువగా బరువు పెరుగుతారు
- శరీరంలో గాయం అయితే గాయం త్వరగా మానదు.
- మెడ చర్మంలో మార్పులు కలుగుతాయి
- చంక చర్మంలో మార్పులు వస్తాయి
ప్రీ-డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎవరికి ఉంటుందంటే
- కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు.. అంటే కుటుంబంలోని ఎవరైనా మధుమేహంతో బాధపడుతుంటే
- లేదా గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్న స్త్రీ లేదా 4 కిలోల కంటే ఎక్కువ బరువున్న బిడ్డకు జన్మనిచ్చినా ప్రీ-డయాబెటిస్ పరిస్థితి తలెత్తుతుంది.
- ఈ వ్యాధి ప్రమాదం సాధారణంగా 45 సంవత్సరాల వయస్సు తర్వాత ఎక్కువగా పెరుగుతుంది.
- శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సమయం కూర్చొని గడిపే వ్యక్తుల్లో కూడా ప్రీ-డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి.
- బెల్లీ ఫ్యాట్ పెరగడం వల్ల ప్రీ-డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
- హార్మోన్ల అసమతుల్యత కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు.
- అంతేకాదు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగా నిలిచిపోయినా కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.
- అలాగే సరైన నిద్ర లేకపోయినా, సరిపడా నిద్రపోలేకపోయినా ప్రీ-డయాబెటిస్ ను ఆహ్వానించినట్లేనని ఓ పరిశోధనలో వెల్లడైంది.
- అందువల్ల ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే మధుమేహం కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని గుర్తించడానికి, వైద్యులు నోటి గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్, HbA1c పరీక్షలను సిఫార్సు చేస్తారు.
అయితే రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహం బారిన పడకుండా చూసుకోవచ్చు. కనుక తినే ఆహారంలో సమతుల్య , పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి
- రోజూ యోగా లేదా వ్యాయామం చేయండి
- తీపి వస్తువులకు పూర్తిగా దూరంగా ఉండండి
- బరువును అదుపులో ఉంచుకోండి
- కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచండి
- పొగత్రాగ వద్దు
- ఇంట్లో డయాబెటిక్ చరిత్ర ఉన్నట్లయితే షుగర్ లెవెల్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..