ప్లాస్టిక్, స్టీల్, రాగి, గాజు, మట్టి.. నీళ్లు తాగడానికి ఏ బాటిల్ బెస్ట్? ఈ తప్పులు మాత్రం చేయొద్దు
ఆఫీస్ అయినా, కాలేజీ అయినా, ప్రయాణమైనా నేడు ప్రతి ఒక్కరి వెంట నీళ్ల సీసా (Water Bottle) ఉండటం సాధారణమైపోయింది. దాహం తీర్చుకోవడానికి ఉపయోగించే ఈ బాటిల్స్ విషయంలో చాలామందికి ఏది మంచిదనే సందేహం ఉంటుంది. మార్కెట్లో ప్లాస్టిక్, స్టీల్, రాగి, గాజు, మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆరోగ్యానికి ఏది సురక్షితమో తెలుసుకోవడం చాలా ముఖ్యం..

నేటి ఆధునిక జీవనశైలిలో వాటర్ బాటిల్ అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీసైనా, కాలేజీ అయినా, సుదూర ప్రయాణాలైనా మంచినీటిని వెంట ఉంచుకోవడం అలవాటుగా మారింది. అయితే, మార్కెట్లో ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం, రాగి, గాజు మట్టి బాటిల్స్ వంటి రకరకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది ఆరోగ్యానికి సురక్షితం? ఏది వాడితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టవుతుంది? అనే విషయాలపై నిపుణులు వెల్లడించిన కీలక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్లాస్టిక్ బాటిల్స్ – ఆరోగ్యాన్ని కరిగించే ప్రమాద రసాయనాలు:
చాలామంది చౌకగా లభిస్తాయని, బరువు తక్కువగా ఉంటాయని ప్లాస్టిక్ సీసాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. కానీ, ఇవి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హానికర రసాయనాల విడుదల: ఎండ తగిలినా లేదా వేడి నీళ్లు పోసినా ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి హానికరమైన రసాయనాలు కరిగి నీటిలో కలుస్తాయి.
వ్యాధుల ముప్పు: వీటిలో ఉండే ‘బిస్ ఫినాల్-ఏ’ (BPA), ‘థాలేట్స్’ (Phthalates) వంటి రసాయనాలు మానవ శరీరంలోకి ప్రవేశిస్తే.. స్థూలకాయం (Obesity), హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు, ఆఖరికి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే రిస్క్ ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
గాజు బాటిళ్లు (Glass Bottles):
గాజు వాటర్ బాటిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇది రసాయనాలతోనూ చర్య జరపదు.. వేడి తగిలినా నీటిలోకి ఎలాంటి విషపూరిత రసాయనాలు విడుదల కావు. ఇది 100% రీసైకిల్ చేయదగినది. అయితే, బరువు ఎక్కువ, సులభంగా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది..
స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్ – దీర్ఘకాలికంగా అత్యుత్తమ ఎంపిక:
ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలకు చెక్ పెట్టడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్ చక్కటి ప్రత్యామ్నాయం..ఇవి ఎటువంటి హానికర రసాయనాలను విడుదల చేయవు. నీటి స్వచ్ఛతను, సహజ రుచిని ఎప్పటికీ మార్చవు. వీటిని శుభ్రం చేయడం చాలా సులభం. తుప్పు పట్టే సమస్య ఉండదు. అలాగే, నీటి ఉష్ణోగ్రతను (చల్లదనం లేదా వేడిని) కొంతవరకు ఎక్కువసేపు కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి.
మట్టి సీసాలు (Clay Bottles) – ప్రకృతి సిద్ధమైన చల్లదనం:
పురాతన కాలం నాటి మన సంస్కృతిని గుర్తుచేస్తూ నేడు మార్కెట్లోకి మట్టి బాటిల్స్ కూడా వచ్చాయి. ఎలాంటి కృత్రిమ రసాయనాల బెడద లేని మట్టి సీసాలలో నిల్వ చేసిన నీరు సహజంగానే చల్లగా మారుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరానికి తగిన పోషకాలను అందించడంలో ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్య పరంగా ఇవి పూర్తి సురక్షితం.
అల్యూమినియం – కాపర్ (రాగి) బాటిల్స్:
అల్యూమినియం బాటిల్స్: బరువు తక్కువగా ఉండి పర్యావరణానికి అంతగా హాని చేయకపోయినా, వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల అల్యూమినియం ధాతువు నీటి ద్వారా శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ఇది కాలేయం, పొట్ట సంబంధిత సమస్యలతో పాటు రక్తహీనత, చిత్తవైకల్యం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాపర్ బాటిల్స్: రాగి పాత్రల్లో నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే, వీటిలో నిల్వ చేసే నీటి రుచి మారే అవకాశం ఉంది. పైగా నిమ్మరసం వంటి ఆమ్ల (Acidic) పానీయాలను రాగి బాటిళ్లలో అసలు ఉంచకూడదు.
ఆరోగ్యకరమైన, తాజాగా ఉండే నీటిని సేవించాలంటే ప్లాస్టిక్ బాటిళ్లకు పూర్తిగా స్వస్తి పలకడం చాలా ముఖ్యం. వీలైనంత వరకు స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా మట్టి, గాజుతో తయారైన బాటిళ్లను ఉపయోగించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏ బాటిల్ అయినా శుభ్రంగా ఉంచడం, తయారీదారు సూచనలు పాటించడం ముఖ్యం..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
