తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఒంట్లో కాస్త నలతగా ఉన్ని పారాసిటమాల్ మాత్ర వేసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఈ పిల్ అన్ని వయసుల వారికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్ మాత్రలు సాధారణంగా జ్వరం, తలనొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. దీంతో వెంటనే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. అందుకే జ్వరం వచ్చినా మనలో చాలా మంది వైద్యులను సంప్రదించకుండానే పారాసిటమాల్ తీసుకుంటుంటూ ఉంటారు.
శరీర నొప్పులు, జ్వరం కోసం పారాసెటమాల్ వాడొచ్చని అందరూ అనుకుంటారు. పారాసెటమాల్ మెదడులో నొప్పి, జ్వరం కలిగించే రసాయనాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. తేలికపాటి నుండి మితమైన నొప్పి, జ్వరం, మైగ్రేన్, ఆర్థరైటిస్ మొదలైన వాటితో బాధపడేవారికి తక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్యులు సాధారణంగా సిఫార్సు చేస్తుంటారు. ఈ మందు ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువ కాలంపాటు తీసుకుంటే శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది.
సాధారణంగా పిల్లలు, పెద్దలు, 65 ఏళ్లు పైబడిన వారికి పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు అధిక మోతాదులో పారాసిటమాల్ వాడితే తీవ్రమైన గుండె, కడుపు, మోకాళ్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
65 ఏళ్లు పైబడిన వారిపై ఈ అధ్యయనం చేశారు. 65 ఏళ్లు పైబడిన వారు దీర్ఘకాలం పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఉపయోగించడం వల్ల జీర్ణకోశ, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని ఆ అధ్యయనం కనుగొంది. అలాగే స్ట్రోక్‌తో బాధపడుతున్న రోగులు కూడా నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్ మాత్రలు ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల వారి గుండె, కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.