AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో కూరగాయలు లేవా? పచ్చిమిర్చితో 5 నిమిషాల్లో కారం పచ్చడి.. వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది!

Green Chilli Pachadi: ఇంట్లో కూరగాయలు లేవని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని పచ్చిమిర్చి ఉంటే చాలు, ఐదు నిమిషాల్లో నోరూరించే, కమ్మటి పచ్చిమిర్చి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ నుండి స్వరాజ్ గారు పరిచయం చేశారు. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, రోటిలోకి, రాగి సంగటిలోకి అద్భుతమైన కాంబినేషన్. దీని రుచి ఎంత బాగుంటుందంటే, రెండు ముద్దలు కాదు నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు..

ఇంట్లో కూరగాయలు లేవా? పచ్చిమిర్చితో 5 నిమిషాల్లో కారం పచ్చడి.. వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది!
Green Chilli Chutney
Srilakshmi C
|

Updated on: Oct 27, 2026 | 9:26 PM

Share

ఇంట్లో కూరగాయలు లేవని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని పచ్చిమిర్చి ఉంటే చాలు, ఐదు నిమిషాల్లో నోరూరించే, కమ్మటి పచ్చిమిర్చి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ నుండి స్వరాజ్ గారు పరిచయం చేశారు. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, రోటిలోకి, రాగి సంగటిలోకి అద్భుతమైన కాంబినేషన్. దీని రుచి ఎంత బాగుంటుందంటే, రెండు ముద్దలు కాదు నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు.

ఎక్కువ మంది చదివినది: మోకాళ్ల నొప్పితో ఆఫీస్‌ బయట కూర్చుంది.. కలెక్టర్‌ అని తెలియక బాధలన్నీ చెప్పుకుంది!

కావలసిన పదార్థాలు..

  • పచ్చిమిరపకాయలు: 10-15 (చిన్నవి, లేదా మీ రుచికి తగ్గట్టు)
  • చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు
  • ఉల్లిపాయ: 1 మీడియం సైజు
  • కరివేపాకు: 3 రెమ్మలు
  • నూనె: 2.5 టేబుల్‌స్పూన్లు
  • జీలకర్ర: 1 టేబుల్‌స్పూన్
  • పచ్చి శెనగపప్పు: 0.5 టేబుల్‌స్పూన్
  • మినప్పప్పు: 0.5 టేబుల్‌స్పూన్
  • తెల్ల నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు
  • కొత్తిమీర కాడలు (ఐచ్ఛికం): కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు: 10-15 (పొట్టు తీసినవి)
  • ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం..

ముందుగా, చిన్న నిమ్మకాయ సైజు చింతపండును శుభ్రంగా కడిగి, గోరువెచ్చటి నీటిలో రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తొక్కు తీసి, వీడియోలో చూపించిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను సగం వేయించడానికి, సగం పచ్చడిలో చివరగా కలుపుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో వేసినప్పుడు పలుకులు పలుకులుగా ఉండేందుకు పెద్దగా కట్ చేయడం మంచిది. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి, కాస్త వేడెక్కిన తర్వాత 2.5 టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక, తొడిమెలు తీసిన పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగుతుండగానే మూడు రెమ్మల కరివేపాకు, సగం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌ అయ్యేవరకు మగ్గించుకోవాలి.

ఇవి కూడా చదవండి

మంటను తగ్గించి, ఇందులోకి 1 టేబుల్‌స్పూన్ జీలకర్ర, 0.5 టేబుల్‌స్పూన్ పచ్చి శెనగపప్పు, 0.5 టేబుల్‌స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత, 2 టేబుల్‌స్పూన్ల తెల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు ముందు వేస్తే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి చివరగా వేయాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే, కొద్దిగా కొత్తిమీర కాడలు వేసి ఒక్కసారి వేయించి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. వేయించిన మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక చిన్న మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. మిక్సీ జార్ లోకి చల్లారిన మిశ్రమం, నానబెట్టిన చింతపండు, 10-15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మిక్సీని పల్స్ మోడ్‌లో మూడు, నాలుగు సార్లు వేసుకుని పలుకులు పలుకులుగా రుబ్బుకోవాలి. రోటిలో చేస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. రుబ్బిన పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకుని, ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ కమ్మటి పచ్చిమిర్చి పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే పెరుగన్నం, ఆమ్లెట్‌తో కూడా దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. కారం కారంగా, పుల్లగా, రుచికరంగా ఉండే ఈ పచ్చడితో ఏ కూర అవసరం లేదనిపిస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయగలరు.

Follow Us