వైభవంగా శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. ఆర్నబ్ తుఫాన్‌ను కూడా లెక్కచేయని భక్తజనం
పైడిమాంబ సిరిమానోత్సవం కన్నుల పండువగా సాగింది. అర్నబ్ తుఫాన్‌ను కూడా భక్తులు లెక్కచేయకుండా తరలివచ్చారు. భక్తుల కొంగుబంగారంగా కొలిచే అమ్మవారి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన సిరిమానోత్సవం వర్షంలోనూ వేడుకగా జరిగింది. 60 అడుగుల పొడవైన సిరిమాను నుంచి ప్రధాన పూజారి అభయం ఇచ్చారు.

ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవం వైభవంగా సాగింది. ఓ వైపు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. మరోవైపు భక్తిభావంతో విజయనగరం ఉప్పొంగింది. అమ్మవారి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వర్షాన్ని సైతం భక్తులు లెక్కచేయలేదు. వర్షంలోనే తడుస్తూ.. భక్తుల కొంగుబంగారంగా కొలిచే పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని విజయవంతంగా ఉత్సాహంగా కొనసాగించారు. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా తరలివచ్చారు. ఏటా విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నిర్వహించే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. సిరిమానును అధిరోహించిన అమ్మవారి పూజారి ఊరేగింపులో పాల్గొనడం ఈ ఉత్సవంలో ప్రధాన ఘట్టం. పైడితల్లి చరిత్ర విన్నా, తెలుసుకున్నా ఎంతో ఫుణ్యఫలం అంటారు. ఆ తల్లిని మదిలో స్మరిస్తూ కోర్కెలు కోరితే.. అవి తీరిన కొద్దిరోజుల్లోనే పైడితల్లిని దర్శించుకునేందుకు మళ్లీ వస్తారని చెబుతారు. ఇదే ఇక్కడి అమ్మవారి మహత్యం.
అమ్మవారి ఆజ్ఞతో తయారైన సుమారు 60 అడుగుల పొడవైన సిరిమాను చివర పూజారి కూర్చుని… భక్తులకు అభయం ఇస్తారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. సిరిమానుకు ముందు తెల్ల ఏనుగు, అంజలి రధాలు సంప్రదాయబద్దంగా ఊరేగుతాయి. జీవితంలో ఒక్కసారైనా పైడితల్లి అమ్మవారి జాతరను కళ్లారా చూస్తే సిరి సంపదలకు లోటుండదని, గౌరవ ప్రతిష్ఠలు, పదవీ యోగాలు కలుగుతాయని విశ్వాసం. విజయనగరం సంస్థానాన్ని పరిపాలించిన పూసపాటి రాజులకు ఇలవేల్పు బెజవాడ కనకదుర్గమ్మ. ఆ అమ్మవారి కటాక్షంతోనే పూసపాటి వంశంలో శ్రీ పైడితల్లి, బంగారు తల్లిగా జన్మించిందని ప్రతీతి. మరోవైపు.. సిరిమానోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
