స్పేస్‌ఎక్స్‌ను వెనక్కి నెట్టిన ఆంత్రోపిక్.. భారతీయులు క్లాడ్ AI షేర్లు కొనొచ్చా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో మరో సంచలనం నమోదైంది. ప్రముఖ ఏఐ చాట్‌బాట్ క్లాడ్ (Claude)ను అభివృద్ధి చేసిన ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ వ్యవస్థాపకుడు డారియో అమోడెయ్ నేతృత్వంలో జరిగిన ఈ ఐపీఓ (IPO) ద్వారా ఏకంగా 81.3 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఒక్కో షేరును 83 డాలర్లకు విక్రయించింది. ఇది సంస్థ ముందుగా నిర్ణయించిన 70 నుంచి 78 డాలర్ల ధరల శ్రేణి కంటే ఎక్కువ కావడం విశేషం. ఈ భారీ ఐపీఓతో అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ ఆఫరింగ్‌ను అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ అరంగేట్రంగా ఆంత్రోపిక్ నిలిచింది. ఈ ఆఫరింగ్‌లో మొత్తం 98 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇందులో 95.635 కోట్ల షేర్లను ఆంత్రోపిక్ విక్రయించగా, మిగిలిన 2.365 కోట్ల షేర్లను ఇప్పటికే వాటాలు కలిగి ఉన్న పెట్టుబడిదారులు విక్రయించారు..

ఆంత్రోపిక్ ఐపీఓపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా భారతీయ ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎన్విడియా వంటి ఏఐ కంపెనీల ప్రారంభ దశలో పెట్టుబడి పెట్టే అవకాశాలను కోల్పోయిన వారు ఇప్పుడు ఆంత్రోపిక్‌పై దృష్టి సారిస్తున్నారు. అయితే భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఐపీఓ ఆఫర్ ధరకు షేర్లను కొనుగోలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ ఈ ఐపీఓ రిటైల్ ఆఫరింగ్ పరిధిలో లేదు. అయితే నాస్డాక్లో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారతీయులు ఆంత్రోపిక్ షేర్లను కొనుగోలు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అందించే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) ద్వారా భారతీయ నివాసితులు విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సదుపాయం కలిగిన ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకోవాలి. అలాగే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన పన్నులు, విదేశీ మారకపు నిబంధనలు, ఇతర ఛార్జీలను ముందుగా తెలుసుకోవాలి.
ఆంత్రోపిక్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా?
2021లో మాజీ ఓపెన్ఏఐ పరిశోధకులు స్థాపించిన ఆంత్రోపిక్ ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ చాట్‌బాట్.. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ ఇస్తోంది. సబ్స్క్రిప్షన్లు, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కాంట్రాక్టులు, వ్యాపార సంస్థలు మరియు డెవలపర్లకు అందించే ఏఐ సేవల ద్వారా కంపెనీ ఆదాయాన్ని పొందుతోంది. అంతేకాకుండా అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థల మద్దతు కూడా ఆంత్రోపిక్‌కు ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అనేక కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ టూల్స్‌ను ఉపయోగించేందుకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంత్రోపిక్ ఆదాయం కూడా వేగంగా పెరుగుతోంది. భవిష్యత్తులో ఇంటర్నెట్లాగే ఏఐ కూడా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుందని నమ్మే పెట్టుబడిదారులకు ఆంత్రోపిక్ మంచి దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశంగా కనిపిస్తోంది. క్లాడ్ వంటి ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ, అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థల మద్దతు కంపెనీ వృద్ధికి అనుకూలంగా మారవచ్చు. ఆంత్రోపిక్‌లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని కీలకమైన రిస్కులను కూడా గుర్తించాలి.
- భారీ వాల్యుయేషన్: కంపెనీ విలువ సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉందనే అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారుల అంచనాలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో కంపెనీ ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించకపోతే షేరు ధర భారీగా పడిపోయే అవకాశం ఉంటుంది.
- భారీ నిర్వహణ ఖర్చులు: ఏఐ సేవలను అభివృద్ధి చేయడానికి శక్తివంతమైన చిప్స్, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. వీటి కోసం ఆంత్రోపిక్ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఏఐ సేవలకు డిమాండ్ తగ్గితే ఈ పెట్టుబడులు ఆర్థిక భారంగా మారవచ్చు.
- తీవ్రమైన పోటీ: ఓపెన్ఏఐ, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న కంపెనీలు మరో ఐదేళ్ల తర్వాత కూడా అదే స్థానంలో ఉంటాయని చెప్పలేం.
ఆంత్రోపిక్ ఐపీఓ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించినప్పటికీ, కేవలం కంపెనీ పేరు, ఏఐ రంగంపై ఉన్న క్రేజ్ చూసి పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. ముఖ్యంగా భారీ వాల్యుయేషన్ ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు కలిగి, అధిక రిస్క్‌ను భరించగలిగే వారు కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా దశలవారీగా పెట్టుబడి పెట్టే విధానాన్ని పరిశీలించవచ్చు. షేర్లు లిస్టింగ్ అయిన మొదటి రోజే తొందరపడి కొనుగోలు చేయడం కంటే, కొంతకాలం కంపెనీ పనితీరు, షేరు ధరల మార్పులు, ఆర్థిక ఫలితాలను పరిశీలించడం మంచిది. ఆంత్రోపిక్ ప్రపంచ ఏఐ రంగంలో కీలకమైన సంస్థగా ఎదుగుతున్నప్పటికీ, దాని షేర్లలో పెట్టుబడికి లాభాలతో పాటు గణనీయమైన రిస్కులు కూడా ఉన్నాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి, షేరు విలువ, భవిష్యత్తు వృద్ధి అవకాశాలను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. ఇది పెట్టుబడి సలహా కాదు.




