Salt Cleaning Hacks: డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉప్పుతోనే ఇంటిని తళతళ మెరిపించండి..!
ఉప్పు వంటల్లోనే కాదు.. ఇంటి శుభ్రతకు కూడా అమూల్యంగా ఉపయోగపడుతుంది. పాత మరకలు, తుప్పు, చెడు వాసనలను తొలగించడంలో ఉప్పు సహజమైన పరిష్కారం. హానికర రసాయనాల అవసరం లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచే ఈ చిట్కాలు మీకు క్లీనింగ్ విషయంలో చాలా హెల్ప్ అవుతాయి.

ఉప్పు అంటే కేవలం వంటల కోసమే కాదు.. ఇంటి శుభ్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీ ఇంటి వివిధ భాగాల్లో ఉప్పు ఎలా సహాయపడుతుందో తెలుసుకుని.. దానిని సద్వినియోగం చేసుకోండి. పాతగా మారిన లేదా తుప్పు పట్టిన వస్తువులపై కొద్దిగా ఉప్పు చల్లి ఉంచితే తుప్పు త్వరగా విడిపోతుంది. తుప్పు ఉన్న ప్రదేశంలో ఉప్పు చల్లి కొంతసేపు అలాగే ఉంచి.. ఆపై తడి బట్టతో మృదువుగా తుడిచితే తుప్పు పోతుంది. ఇది పూర్తి సహజ పద్ధతిగా ఉండటంతో రసాయనాల అవసరం లేకుండా వస్తువులకు ఏవిధమైన నష్టం కలగకుండా తుప్పు తొలగించవచ్చు.
ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటు వాసన వచ్చే ఆహార పదార్థాలను కట్ చేసిన తర్వాత చేతుల్లో ఆ వాసన ఎక్కువగా ఉంటుంది. దీనిని తొలగించాలంటే.. ఉప్పు నీటితో చేతులను కడగడం వల్ల చేతుల్లోని చెడు వాసన పోతుంది. చేతులు తాజాగా ఉంటాయి.
సింక్ లో కాలిపోయిన మరకలు లేదా చెత్త మిగిలిన చోట దుర్గంధం రావడం రోజువారీ సమస్యగా మారుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి సింక్ పైన కొంత ఉప్పు చల్లి ఆపై చల్లని నీళ్లు పోసి కడగండి. ఇది మరకలను తుడిచేసి శుభ్రతను ఇస్తుంది. దుర్గంధం కూడా తగ్గిపోతుంది. సింక్ మెరుస్తూ ఉంటుంది.
ఇళ్లలోని మూలలు, పైపుల ప్రాంతాలు క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం. ఇల్లు తుడవడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల దుర్గంధం తగ్గి శుభ్రత మరింత పెరుగుతుంది. ఉప్పు నీటితో తుడువడం వల్ల మట్టి సులభంగా తొలగిపోతుంది.
రోజువారీ వంట పనిలో వాడే పాత్రలపై మురికి ఆహారపు మచ్చలు ఏర్పడటం సహజం. వాటిని శుభ్రం చేయడానికి.. పాత్రలో కొంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కొన్ని నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత నీటితో కడిగి తుడవడం ద్వారా మురికి సులభంగా పోతుంది. ఈ పద్ధతి సహజసిద్ధంగా ఉండటంతో పాత్రలకు కూడా నష్టం ఉండదు.
ఇలా ఉప్పు వంటలకే కాకుండా ఇంటి వివిధ పనులలో ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే పాత మురికి, దుర్వాసనల నుంచి విముక్తి లభిస్తుంది.
