Beauty Alert:మాల్స్‌లో లిప్‌స్టిక్ టెస్టర్ వాడుతున్నారా? ఆ ఒక్క పొరపాటుతో మీ జీవితం తలకిందులు కావచ్చు!
వారాంతం వచ్చిందంటే చాలు.. సరదాగా షాపింగ్ చేయడానికి మాల్స్‌కు వెళ్లడం మహిళలకు ఒక అలవాటు. ముఖ్యంగా బ్యూటీ కౌంటర్ల దగ్గర రంగురంగుల లిప్‌స్టిక్‌లు, ఐషాడోలను చూడగానే వాటిని ఒకసారి ట్రై చేయాలని అనిపించడం సహజం. అక్కడ ఉంచిన 'టెస్టర్ల'ను తీసుకుని నేరుగా పెదవులకు లేదా ముఖానికి అప్లై చేసుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

పైకి ఎంతో ఆకర్షణీయంగా, శుభ్రంగా కనిపించే ఆ మేకప్ టెస్టర్ల వెనుక ఒక భయంకరమైన అదృశ్య ప్రపంచం దాగి ఉంది. వందలాది మంది చేతులు తగిలే ఆ చిన్న వస్తువుల ద్వారా అత్యంత వేగంగా వ్యాపించే వైరస్‌లు, బ్యాక్టీరియాలు మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. గతంలో ఒక మహిళ బహిరంగ లిప్‌స్టిక్ టెస్టర్‌ను ఉపయోగించి ఒక మొండి వైరస్ బారిన పడటం సంచలనం సృష్టించింది. అసలు ఆ టెస్టర్ల వల్ల వచ్చే జబ్బులేంటి? మీరు సురక్షితంగా ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
టెస్టర్ల ద్వారా వ్యాపించే ఆ ‘మొండి’ వైరస్ ఏది?
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధనల ప్రకారం, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV-1) వంటివి మేకప్ టెస్టర్ల ద్వారా సులభంగా వ్యాపిస్తాయి. ఈ వైరస్ చాలా మొండిది. ముఖ్యంగా క్రీమీ లిప్‌స్టిక్ లేదా మస్కారా వంటి తేమ గల ప్రదేశాల్లో ఇది వారాల తరబడి జీవించగలదు. ఒకసారి ఈ వైరస్ సోకితే నోటి చుట్టూ జ్వరపు బొబ్బలు లేదా కోల్డ్ సోర్స్ ఏర్పడతాయి.
కేవలం హెర్పెస్ మాత్రమే కాదు.. అంతకు మించి!
ఒక అధ్యయనం ప్రకారం, బ్యూటీ స్టోర్లలోని 70% నుండి 90% టెస్టర్లలో ఇ. కోలి స్టెఫిలోకాకస్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉన్నట్లు కనుగొన్నారు. వందలాది మంది ఒకే ప్యాలెట్‌ను తాకడం వల్ల ఒకరి నుండి మరొకరికి వ్యాధి సోకే ప్రమాదం దాదాపు 100% ఉంటుంది. ఇది చర్మంపై దద్దుర్లు, అలర్జీలు మరియు కంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
సురక్షితంగా ఉండటానికి ‘బంగారు నియమాలు’ :
మీరు షాపింగ్ ఆపాల్సిన అవసరం లేదు, కానీ వాడే పద్ధతిని మార్చుకోవాలి:
నేరుగా వాడొద్దు: టెస్టర్‌ను ఎప్పుడూ నేరుగా పెదవులకు లేదా కళ్ళకు అప్లై చేయవద్దు. ఎల్లప్పుడూ మీ చేతి వెనుక భాగంలో స్వ్యాచ్ చేయండి.
శానిటైజ్ చేయండి: స్వ్యాచ్ చేసిన తర్వాత వెంటనే ఆ ప్రాంతాన్ని శానిటైజర్ లేదా ఆల్కహాల్ వైప్స్‌తో శుభ్రం చేసుకోండి.
పై పొరను తొలగించండి: ఒకవేళ లిప్‌స్టిక్ చూడాల్సి వస్తే, ముందుగా శుభ్రమైన గరిటెతో దాని పై పొరను తీసివేయమని స్టోర్ సిబ్బందిని అడగండి.
వాడి పారేసేవి వాడండి: దుకాణం వారు ఇచ్చే సింగిల్ యూస్ స్వాబ్స్ మాత్రమే ఉపయోగించండి. ఒకవేళ వారు ఆ సౌకర్యం కల్పించకపోతే, ఆ టెస్టర్‌ను ముట్టుకోకపోవడమే మంచిది.
గుర్తుంచుకోండి, విలాసవంతమైన మేకప్ కొనేటప్పుడు మనం ఇచ్చే ధర కంటే, అజాగ్రత్త వల్ల సోకే ఇన్ఫెక్షన్ల వల్ల మనం చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఆరోగ్య పరమైన లేదా చర్మ సంబంధిత విషయాలలో సందేహాలుంటే తప్పనిసరిగా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి.
